కళాకారులు జాతర నుంచి తిరిగి వస్తూ..
కళాకారులు జాతర నుంచి తిరిగి వస్తూ..
Published Wed, Apr 19 2017 10:29 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
జిప్సం లోడు లారీ బోల్తా
తుని రూరల్ (తుని) : పెంటమాంబ తల్లి జాతరోత్సవాల్లో ప్రజలను రంజింపజేసి తిరిగి వెళుతోన్న కళాకారులు రోడ్డు ప్రమాదంలో గురై.. పాములూరి వీరేంద్ర (32) మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఎనిమిది మంది త్రుటి ప్రమాదం నుంచి బయటపడ్డారు. గొర్రిపూడి, పెద్దాపురప్పాడు, కొందూరు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది కళాకారులు ఈ నెల 16న విశాఖపట్నం జిల్లా కొత్త గాజువాకలో జాతర ఉత్సవాల కోసం ఈ వెళ్లారు. 17నుంచి మూడు రోజుల పాటు గరగలు, డప్పుల సంబరాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. 19వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత స్వగ్రామాలకు బయలుదేరారు. విశాఖపట్నం నుంచి యర్రవరం వరకు జిప్సం లోడు లారీలో కత్తిపూడికి వెళ్లేందుకు గాజువాక వద్ద పాములూరి వీరేంద్ర, కొమ్ము సత్తిత్య, కొమ్ము జాను, టేకుమూడి దాసు, విరవాడ చైతన్య, టి.రాజు, టి.మల్లేశ్వరరావు, సీహెచ్ రాజేష్, సీహెచ్ సూర్యనారాయణ ఎక్కారు. బుధవారం ఉదయం తేటగుంట వద్ద ఈ లారీ కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. దీంతో పాములూరి వీరేంద్ర (హసి¯ŒSపేట), టి.మల్లేశ్వరరావు (కొందూరు), సీహెచ్.రాజేష్, సీహెచ్ సూర్యనారాయణ (గొర్రిపూడి) జిప్సం లోడులో కూరుకుపోయారు. మిగిలిన ఐదుగురు లారీ నుంచి దూకేశారు.
రక్షించిన స్థానికులు...
స్థానికులు, అటుగా వెళుతున్న వాహనదారులు జిప్సంలో కూరుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. మల్లేశ్వరరావు, రాజేష్, సూర్యనారాయణ ప్రాణాలతో బయటపడగా వీరేంద్ర మృత్యువాత పడ్డాడు. రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు, తొండంగి ఎస్సై కృష్ణమాచార్యులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై పడిన జిప్సం, లారీని తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు.
ప్రాణాలతో బయటపడ్డాం
జిప్సం లారీ ఎక్కిన తర్వాత నలుగురు కుడివైపునా, మరో ఐదుగురు ఎడమవైపునా కుర్చున్నామని, ఎడమవైపున కూర్చున్న తాము ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామని విరవాడ చైతన్య, టేకుముడి దాసు, కొమ్ము సత్తియ్య, కొమ్ము జాను, టి.రాజు తెలిపారు. లారీ వేగంగా వెళుతూ కల్వర్టును ఢీకొందని, తాము వెంటనే లారీలోంచి దూకేశామన్నారు. కుడివైపున కూర్చున నలుగురు కూడా దూకేశారని, అయితే లారీలోని జిప్సం వారిపై పడడంతో కూరుకుపోయారని వివరించారు.
నిద్రమత్తే ప్రమాదానికి కారణం
లారీ డ్రైవర్ ఎస్.శంకరరావు నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు తెలిపారు. మరికొంత ముందుగా లారీ అదుపు తప్పి ఉంటే కల్వర్టులో బోల్తా పడేదని, అప్పుడు తొమ్మిది మంది సజీవ సమాధి అయ్యేవారని వివరించారు. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో రాజేష్‌ను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి, కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
తహసీల్దార్ పరామర్శ
ఈ సంఘటన తెలియడంతో తహసీల్దార్ బి.సూర్యనారాయణ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెద్దాపురం ఆర్డీఓ, కలెక్టర్లకు క్షతగాత్రుల వివరాలతో నివేదిక అందజేస్తామన్నారు.
Advertisement