గ్రామ దర్శనం | The view of the village of the newly introduced program | Sakshi
Sakshi News home page

గ్రామ దర్శనం

Published Sat, Dec 14 2013 4:22 AM | Last Updated on Thu, Jul 25 2019 5:25 PM

The view of the village of the newly introduced program

 మఠంపల్లి, న్యూస్‌లైన్: జిల్లాలో నూతనంగా ప్రవేశపెట్టిన గ్రామ దర్శనం కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్ చిరంజీవులు మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 10.30గంటలకు గ్రామానికి చేరుకున్న కలెక్టర్ ముందుగా అంగన్‌వాడీ కేంద్రం-1ని సందర్శించారు. అక్కడ పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, పాల ప్యాకెట్లను పరిశీలించారు. అయితే, అంగన్‌వాడీ కేంద్రంలో 20మంది పిల్లలున్నట్టు రికార్డుల్లో ఉండగా, కేంద్రానికి ఏడుగురు మాత్రమే హాజరయ్యారు.
 
 దీంతో కలెక్టర్ అంగన్‌వాడీ సూపర్‌వైజర్ హేమాదేవిని ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో పిల్లలు కేంద్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత గ్రామంలో తిరిగి వీధులను పరిశీలిస్తూ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ 15శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గృహనిర్మాణ శాఖలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు. దీంతో వారిపై చర్య తీసుకోవాలని ప్రత్యేకాధికారిని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా గ్రామంలో ప్రత్యేకాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓలు మూడు టీములుగా ఏర్పడి పారిశుద్ధ్యం, రేషన్ దుకాణాలు, హౌసింగ్, ఉపాధిహామీ, అంగన్‌వాడీ, తాగునీటి సరఫరా, విద్య, వైద్యం, పశువైద్యం తదితర అంశాలపై నెలకొన్న సమస్యలను సేకరించారు.
 
 వారు సేకరించిన వివరాలను కలెక్టర్ సమీక్ష  సమావేశంలో అధికారుల ద్వారా గ్రామస్తులకు చదివి విని పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో సేకరించిన సమస్యలను అధికారులు వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో జరుగుతున్న గ్రామ దర్శనం కార్యక్రమంలో ప్రజలు రాజకీయాలకతీతంగా అధికారులు సమస్యలపై ఫిర్యాదు చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల అధికారులు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు గ్రామంలోని సమస్యలపై సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఆ రోజు అధికారులు సేకరించిన సమస్యలను తాను అదేరోజు సాయంత్రం 5నుంచి 6గంటల మధ్య వీడియో కాన్ఫరెన్స్‌లో పర్యవేక్షిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కల్యాణి, పీఏసీఎస్ చైర్మన్ ఎలియాస్‌రెడ్డి, ఏడీఏ యల్లయ్య, తహసిల్దార్ దేవెళ్ల సత్యనారాయణ, ఎంపీడీఓ జె.వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, ఏఓ మల్లికార్జున్‌రావు, ఏఈలు విజయ్‌కుమార్, కోటయ్య, యుగంధర్‌రావు, వైద్యాధికారులు జమున, భూక్యా రమేష్, ఏపీఎం దుర్గాప్రసాద్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ హేమాదేవి, మండల కో ఆర్డినేటర్ తులసీరాంనాయక్, ఆర్‌ఐ శైలజ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement