
కన్నీరు మున్నీరు
అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్: చిన్ననాటి స్నేహితుడికి ఉపనయనమంటే అంతా సంతోషిం చారు. తాము మళ్లీ కలుసుకోవడానికి ఇదో మంచి సందర్భమని భావించారు. అనుకున్నదే తడవుగా ఆ పన్నెండు మంది యువకులు తుమ్మపాలలో మిత్రుడి ఇంటికి వచ్చారు. ఛలోక్తులతో కాసేపు సందడి చేశారు. స్నేహితుడి వే డుక కొనసాగుతూ ఉండగా, అతడి తమ్ముడితో నదికి స్నానానికని బయల్దేరారు.
తోడు వచ్చిన తమ్ముడితోపాటు ఇద్దరు యువకులు నదిలో పొంచి ఉన్న మృత్యువు కోరలకు చిక్కారు. స్నేహితులంతా చూస్తూ ఉండగానే జలసమాధి అయ్యారు. వారితోపాటు నదిలో దిగిన ఇద్దరు మాత్రం చేరువలో ఉన్నవారి చేయూతతో బతికి బయిటపడ్డారు. జరిగిన ఘోరాన్ని చూసి మిగి లిన మిత్రులు బావురుమన్నారు.
అందివస్తారని ఎన్నో కలలు కన్న తల్లిదండ్రులు ఈ ఘాతు కం గురించి తెలియడంతో గుండె పగిలి కూలబ డ్డారు. విషాదసాగరంలో మునిగిపోయారు. కంటిపాపల వంటి కుమారులు కన్నుమూశారని తెలియడంతో వారు గుండెలు పగిలేలా విలపించారు. చనిపోయిన ముగ్గురూ రెండు పదుల వయస్సు దాటనివారే కావడంతో తుమ్మపాలలో కన్నీరు పెట్టనివారు లేరు.
ఉపనయనంలో విషాదం
కందర్ప జగన్నాథరావు మనుమడు సంతోష్ ఉపనయనం కావడంతో అతని స్నేహితులు విశాఖ నగరంలో వేరువేరు ప్రాంతాల నుంచి తుమ్మపాల వచ్చారు. సంతోష్ తమ్ముడు మురళీకృష్ణతో కలసి వీరు శారదానదికి స్నానానికని ఉదయం పదిగంటల సమయంలో బయల్దేరారు. అమర్‌నాథ్, పృథ్వీరాజ్, మురళీకృష్ణ, బోయి చైతన్య, కె. అభిషేక్ ముందుగా స్నానానికి దిగారు. కానీ గట్టు వద్ద అధికంగా నాచు పేరుకపోవడంతో సమీపంలోని గొయ్యిలోకి దిగబడ్డారు. వారిని మిగిలిన స్నేహితులు, సమీపంలోని రజకులు రక్షించేందుకు ప్రయత్నించారు.
చైతన్య, అభిషేక్‌లను గట్టెక్కించినా మిగిలిన ముగ్గురూ అందరి కళ్లెదుటే మృత్యువాతపడ్డారు. జరిగిన ఘోరం గురించి సమాచారమందుకున్న మురళీకృష్ణ తల్లితండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మిగిలిన ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా విశాఖ నుంచి పరుగుపరుగున వెళ్లారు.
నది ఒడ్డున పడి ఉన్న తమ పిల్లలలను చూసి అంతా గుండెలు బాదుకున్నారు.గ్రామస్తులు సంఘటన స్థలానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. చేతికందివచ్చిన యువకులు విగతజీవులు కావడంతో అంతా కన్నీటి పర్యంతమయ్యారు అమర్‌నాథ్ తండ్రి ఆంజనేయులు ఢిల్లీలో సీఐఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.పృథ్వీ తండ్రి ఎన్‌ఏడీలో ప్రైవేటుగా వెహికల్ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మురళీకృష్ణ తండ్రి వెంకటేశ్వరరావు గాజువాకలో ఉద్యోగం చేస్తున్నారు.