వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు సోమవారం కోర్టు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. కాళ్లు, చేతులు విరగడంతో అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన లావుడ్యా మోహన్ హన్మకొండలోని దీనదయాల్‌నగర్‌లో నివాసముంటున్నాడు. అతడు నిట్ సమీపంలోని దేవినగర్ కాలనీలోని బీసీ సామాజికవర్గానికి చెందిన యువతిని 2013 సెప్టెంబర్‌లో కులాంతర వివాహం చేసుకున్నాడు.
హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్న తర్వాత వరంగల్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు వైభవంగా పెళ్లి వేడుకలు చేస్తామని నమ్మించి అమ్మాయిని తీసుకెళ్లారు. అయితే తమ కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సమయంలోనే మోహన్‌పై ఆమె తల్లిదండ్రులు కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేయించారు. ఈ కేసులో అతడు మొదటి అదనపు జిల్లాకోర్టులో ముందస్తు బెయిల్ తీసకున్నాడు.
అమ్మాయిని ఎంతకీ పంపించకపోవడంతో అతడు కొన్నాళ్ల క్రితం అత్తగారింటి వద్ద ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. అతడు భార్యను కాపురానికి పంపించాలని కోరుతూ జిల్లా న్యాయసేవా అధికార సంస్థను కూడా ఆశ్రయించాడు. ఈ క్రమంలో మోహన్‌పై వాళ్లింటి వద్దనే గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. దీంతో నాలుగో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో మోహన్ ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ చేయాలని సుబేదారి పోలీసులను కోర్టు అదేశించింది.
భార్యను కాపురానికి తీసుకొచ్చేందుకు చట్టబద్ధంగా చేయాల్సిన చర్యలు ఎన్ని చేసినా ఫలితం లేకపోవడంతో కలత చెందిన మోహన్ సోమవారం సాయంత్రం ఫ్యామిలీ కోర్టు భవనంపై నుంచి దూకాడు. రెండో అంతస్తు నుంచి దూకడంతో కాళ్లు విరిగి, నడుముకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్నవారు అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
కోర్టుపై నుంచి దూకిన యువకుడు
Published Tue, Feb 18 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM
Advertisement