వేధింపులు తాళలేక ....
పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్య
న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తుల రాస్తారోకో
ఎస్‌ఐ హామీతో విరమణ
ఎ.కొండూరు : కట్టుకున్న భర్త నిత్యం చిత్రహింసలకు గురి చేయడంతో పురుగు మందు తాగి భార్య మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి కోడూరు గ్రామం లో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పాత రేపూడి గ్రామానికి చెందిన మరియమ్మ(30)తో కోడూరుకు చెందిన ఎం.వెంకటేశంతో13ఏళ్ల క్రితం వివాహమైంది.అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని గ్రామ పెద్దలు సర్ధి చెప్పేవారు. ఇటీవల మళ్లీ గొడవలు మొదలయ్యాయి. భర్తపెట్టే మానసిక,శారీరక బాధలు తాళలేక భార్య మరియమ్మ రెండు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. భర్త వెంకటేశం అతని బావ పాత రేపూడి గ్రామానికి వెళ్లి భార్య, అత్తమామలకు సర్ధిచెప్పి, కాపురానికి తీసుకువెళ్లారు. అక్కడకు వెళ్లిన 15 రోజుల తరువాత వారిరువురి మధ్య మళ్లీ గొడవలు చెలరేగాయి. ఆదివారం సాయంత్రం వెంకటేశం తన భార్యను కొట్టడంతో విరక్తి చెందిన ఆమె పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న అమెను తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పిం చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీ సులు తెలిపారు. తండ్రి శైలేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 498-ఎ రెడ్‌విత్ 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యోసోబు తెలిపారు.
నిందితుడిని అరెస్టు చేయాలని రాస్తారోకో
వెంకటేశంను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ బంధువులు, గ్రామస్తులు, దళితులు పోలీస్ స్టేషన్ ఎదుట విజయవాడ- తిరువూరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వెంకటేశాన్ని వెంటనే అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒకానొక దశలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాకపోవడంతో రాస్తారోకో చేస్తున్నామని, మాకు న్యాయం చేయాలని కోరారు. న్యాయం చేస్తామని ఎస్సై యోసోబు హామిఇవ్వడంతో రాస్తారోకో విరమిం చారు. ఎండ తీవ్రంగా ఉండటంతో మృతురాలి తల్లితో పాటు పలువురు సొమ్మసిల్లి పడిపోయారు.
అల్లుడే హతమార్చాడు -మరియమ్మ తల్లిదండ్రుల ఆరోపణ
మ్మాయి మరియమ్మను అల్లుడు వెంకటేశం చంపాడని తల్లి జామాయమ్మ, తండ్రి శైలేశ్ సోమవారం విలేకరులకు తెలిపారు. అల్లుడు మద్యానికి బానిసై రోజూ చిత్రహింసాలకు గురి చేస్తుండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. మంచితనంగా మా అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్లిన 10 రోజులకే మళ్లీ గొడవ పడి అమ్మాయిని కొట్టి పురుగు మందు బలవంతంగా తాగించారని ఆరోపించారు. తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందిన తర్వాత తమకు సమాచారం అందించారని కంటతడి పెట్టారు.