టెన్త్‌లో గ్రేడ్‌ పాయింట్లు లేవు | There are no grade points in Tenth Class Exam Results | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో గ్రేడ్‌ పాయింట్లు లేవు

Published Wed, Jul 15 2020 3:13 AM | Last Updated on Wed, Jul 15 2020 3:42 AM

There are no grade points in Tenth Class Exam Results - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్‌ (2019–20 బ్యాచ్‌) విద్యార్థుల మార్కుల మెమోల్లో గ్రేడ్‌ పాయింట్లు లేకుండా వాటి స్థానంలో సబ్జెక్టుల వారీగా ‘పాస్‌’ అని పేర్కొనాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ఒక్క ఏడాదికి మాత్రమే ఇది వర్తించేలా పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ మంగళవారం జీఓ 34ను విడుదల చేశారు. దీని ప్రకారం టెన్త్‌ పరీక్షలకు దరఖాస్తు చేసి హాల్‌ టికెట్లు జారీ అయిన విద్యార్థులందరూ గ్రేడ్‌ పాయింట్లు లేకుండా ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించారు. అయితే, ఈ బ్యాచ్‌ విద్యార్థులకు గ్రేడ్‌ పాయింట్లు కేటాయించనందున వీరిని పై కోర్సుల్లో చేర్చుకునేటప్పుడు మెరిట్‌ విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని జీఓలో పేర్కొన్నారు.  

కరోనాతో పరీక్షలు రద్దు 
► మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలవల్ల ఒకసారి.. ఆ తర్వాత కరోనా కారణంగా మరోసారి టెన్త్‌ పరీక్షలను వాయిదా వేశారు. చివరిగా జూలై 10–17 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. 
► కానీ, కరోనా ఉధృతితో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు.. ఇతర రాష్ట్రాల్లో అవలంబించిన విధానాల ఆధారంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చివరికి పరీక్షలను రద్దుచేసింది.  
► పరీక్షలు నిర్వహించకున్నా అంతర్గత మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్‌లు ఇవ్వాలని ముందు భావించారు.  
► ఫార్మేటివ్, సమ్మేటివ్‌ టెస్టులలో ఆయా విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్‌ పాయింట్లు ఇచ్చే అవకాశాలను పరిశీలించారు. 
► ఇంతలో అనేక ప్రైవేటు స్కూళ్లు అంతర్గత మార్కుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడుతున్నాయని.. విద్యార్థుల నుంచి భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లుగా పెద్దఎత్తున ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా సర్కారుకు వినతులు అందాయి. 
► అదే సమయంలో అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్‌ల నిర్ణయంవల్ల  ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది.  
► వీటన్నిటినీ పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ.. 2020 మార్చి పరీక్షలకు హాల్‌ టికెట్లు జారీ అయిన విద్యార్థులను గ్రేడ్‌ పాయింట్లు లేకుండా ఉత్తీర్ణులైనట్లుగా పరిగణిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అదే సమయంలో మెరిట్‌ విద్యార్థులు మంచి కాలేజీల్లో అవకాశాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

ట్రిపుల్‌ ఐటీలకు ఎంట్రన్స్‌?
సర్కారు తాజా నిర్ణయంతో నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఇప్పుడు ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే, టెన్త్‌ తరువాత ఎక్కువ మంది విద్యార్థులు చేరేది ఇంటర్‌లోనే. వీటికీ మెరిట్‌ ప్రాతిపదికన అడ్మిషన్లు జరపాలనుకుంటే ఎంట్రన్సు టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు.. టెన్త్‌లో మెరిట్‌ ఆధారంగా జరిగే ఉద్యోగాల నియామకాల్లో ఈ బ్యాచ్‌ అభ్యర్థులకు కొన్ని మినహాయింపులు ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement