tenth exams results
-
టెన్త్‌లో గ్రేడ్ పాయింట్లు లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ (2019–20 బ్యాచ్) విద్యార్థుల మార్కుల మెమోల్లో గ్రేడ్ పాయింట్లు లేకుండా వాటి స్థానంలో సబ్జెక్టుల వారీగా ‘పాస్’ అని పేర్కొనాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ఒక్క ఏడాదికి మాత్రమే ఇది వర్తించేలా పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం జీఓ 34ను విడుదల చేశారు. దీని ప్రకారం టెన్త్ పరీక్షలకు దరఖాస్తు చేసి హాల్ టికెట్లు జారీ అయిన విద్యార్థులందరూ గ్రేడ్ పాయింట్లు లేకుండా ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించారు. అయితే, ఈ బ్యాచ్ విద్యార్థులకు గ్రేడ్ పాయింట్లు కేటాయించనందున వీరిని పై కోర్సుల్లో చేర్చుకునేటప్పుడు మెరిట్ విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని జీఓలో పేర్కొన్నారు. కరోనాతో పరీక్షలు రద్దు ► మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలవల్ల ఒకసారి.. ఆ తర్వాత కరోనా కారణంగా మరోసారి టెన్త్ పరీక్షలను వాయిదా వేశారు. చివరిగా జూలై 10–17 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. ► కానీ, కరోనా ఉధృతితో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు.. ఇతర రాష్ట్రాల్లో అవలంబించిన విధానాల ఆధారంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చివరికి పరీక్షలను రద్దుచేసింది. ► పరీక్షలు నిర్వహించకున్నా అంతర్గత మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్‌లు ఇవ్వాలని ముందు భావించారు. ► ఫార్మేటివ్, సమ్మేటివ్ టెస్టులలో ఆయా విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్ పాయింట్లు ఇచ్చే అవకాశాలను పరిశీలించారు. ► ఇంతలో అనేక ప్రైవేటు స్కూళ్లు అంతర్గత మార్కుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడుతున్నాయని.. విద్యార్థుల నుంచి భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లుగా పెద్దఎత్తున ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా సర్కారుకు వినతులు అందాయి. ► అదే సమయంలో అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్ల నిర్ణయంవల్ల ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ► వీటన్నిటినీ పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ.. 2020 మార్చి పరీక్షలకు హాల్ టికెట్లు జారీ అయిన విద్యార్థులను గ్రేడ్ పాయింట్లు లేకుండా ఉత్తీర్ణులైనట్లుగా పరిగణిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అదే సమయంలో మెరిట్ విద్యార్థులు మంచి కాలేజీల్లో అవకాశాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ట్రిపుల్ ఐటీలకు ఎంట్రన్స్? సర్కారు తాజా నిర్ణయంతో నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఇప్పుడు ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే, టెన్త్ తరువాత ఎక్కువ మంది విద్యార్థులు చేరేది ఇంటర్‌లోనే. వీటికీ మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు జరపాలనుకుంటే ఎంట్రన్సు టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు.. టెన్త్‌లో మెరిట్ ఆధారంగా జరిగే ఉద్యోగాల నియామకాల్లో ఈ బ్యాచ్ అభ్యర్థులకు కొన్ని మినహాయింపులు ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
టాపర్‌గా కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు
పట్నా : చదువుకు డబ్బుతో సంబంధం లేదనే విషయం మరోసారి రుజువైంది. కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు బిహార్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టాపర్‌గా నిలిచాడు. ఓవైపు తండ్రికి సాయంగా ఉంటూనే.. మరోవైపు చదువులో మెరుగైన ఫలితాలు సాధించిన అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. బిహార్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ మంగళవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. ఈ పరీక్షలకు మొత్తం 15.29 లక్షల మంది హాజరవ్వగా.. 12.4 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్ష ఫలితాల్లో రోహ్తాస్ జిల్లాలోని జనతా హైస్కూల్‌కు చెందిన హిమాన్ష్ రాజ్ టాపర్‌గా నిలిచాడు. 500 మార్కులకు గానూ హిమాన్ష్ 482 మార్కులు సాధించాడు. కాగా, హిమాన్ష్ తండ్రి కూరగాయల అమ్మకం సాగిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో హిమాన్ష్ టాపర్‌గా నిలవడంతో.. అతని స్వగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అయితే హిమాన్ష్ రోజుకు 14 గంటల పాటు చదువుకుంటూనే.. కూరగాయల షాప్‌లో తన తండ్రికి సాయం కూడా చేసేవాడని తెలిసింది. హిమాన్ష్‌కు చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం ఉందని, చాలా తెలివైనవాడని అతని ఉపాధ్యాయులు తెలిపారు. కాగా, ఇంజనీర్ కావాలన్నదే తన లక్ష్యమని హిమాన్ష్ చెప్పాడు. -
ఫలితాలు ఓకే.. ప్రమాణాలేవీ?
సాక్షి, అమరావతి: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఏటేటా అనూహ్యంగా పెరుగుతోంది. ఆమేరకు విద్యార్థుల్లో సబ్జెక్టులపై పట్టు పెరగడంలేదు. ప్రమాణాలూ అంతంత మాత్రమే. పాస్ పర్సంటేజీ పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రమాణాల అభివృద్ధిపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, బోధకుల్లోనూ కనిపించడం లేదు. 1998–99 సంవత్సరంలో టెన్త్‌లో పాస్ పర్సంటేజీ 52.67 శాతం మాత్రమే ఉండగా అది నేడు 95 శాతం వరకు చేరుకోవడం గమనించదగ్గ అంశం. నాలుగైదు శాతం తేడాలో ప్రతి ఏటా ఇదేరకమైన ఉత్తీర్ణత శాతాలు నమోదు అవుతున్నాయి. తాజాగా మంగళవారం విడుదలయిన టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణత 94.88 శాతంగా నమోదైంది. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ల ఆవిర్భావంతోనే ఈ మార్పు 1998కి ముందు వరకు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం కచ్చితమైన నియమ, నిబంధనలను అమలు చేసేది. విద్యార్ధుల్లో నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవడంతోపాటు వారిలో ఏమేరకు విద్యాప్రమాణాలు అభివృద్ధి చెందాయనే అంశాలు తెలుసుకునేందుకు మూల్యాంకనం చేయడంలోనూ అంతే కచ్చితమైన విధానాలు పాటిం చేది. 1998–99 నుంచి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ప్రయివేటు స్కూళ్లకు, కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేయడం ప్రారంభించినప్పటినుంచి ఆనారోగ్యకర వాతావరణం ఏర్పడింది. విద్య వ్యాపారంగా మారింది. ప్రయివేటు కార్పొరేట్ సంస్థలు ఉత్తీర్ణత శాతాన్ని పెంచి చూపించుకోవడం ద్వారా ప్రవేశాలను గణనీయంగా పెంచుకొనే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందుకోసం వారు అడ్డదారులు తొక్కుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. లక్ష్యాల నిర్దేశంతో జిల్లాల మధ్య పోటాపోటీ సమీక్షల సందర్భంగా సీఎంనుంచి ఉన్నతాధికారుల వరకు ఉత్తీర్ణత శాతంపైనే ఎక్కువ దృష్టి సారించి వాటిని పెంచేలా అధికారులపై ఎత్తిడి పెంచారు. దీంతో జిల్లా మధ్య పోటీ పెరిగింది. ఇది మాస్ కాపీయింగ్‌కు, ఇతర అడ్డదారులకు దారితీసింది. 1998–99లో 52.67గా ఉన్న టెన్త్ ఉత్తీర్ణత శాతం 2003–04 నాటికి ఒక్కసారిగా 80.55కి పెరిగింది. అంటే 27.88 శాతం పెరిగిందన్న మాట. ఈ పెరుగుదల ప్రయివేటు స్కూళ్లలోనే కనిపించింది. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఉత్తీర్ణత శాతం 50నుంచి 55 శాతానికే పరిమితమైంది. దీంతో విద్యార్ధులు ప్రయివేటు స్కూళ్లవైపు ఆకర్శితులవుతూ వచ్చారు. అక్కడ అర్హులైన టీచర్లు లేకున్నా... సరైన బోధన, దానికి తగ్గ సదుపాయాలు లేకున్నా, ప్రమాణాలతో పనిలేకుండా బట్టీ పద్దతులకు శ్రీకారం చుట్టారు. తమకు అనుకూలమైన కేంద్రాల్లో తమ విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేలా పైరవీలు చేసేవారు. మాస్ కాపీయింగ్ తదితర మార్గాల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటూ పోయారు. ప్రభుత్వ స్కూళ్లలోనూ అదే సంస్కృతి... ప్రయివేటు స్కూళ్లతో సమానంగా పరుగులు పెట్టేందుకు ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇదే వాతావరణం తప్పనిసరైంది. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కలెక్టర్లు, డీఈఓలు, విద్యాధికారులు పరీక్షల సమయంలో, మూల్యాంకనం వేళ ఒకింత వెసులుబాటు కల్పిస్తూ సాధ్యమైనంత మేర ఆయా ప్రశ్నలకు సమాధానాల్లో సంపూర్ణత లేకున్నా పాస్‌మార్కులు వేసే సంప్రదాయానికి తెరతీశారు. మాస్ కాపీయింగ్ కూడా పెరిగింది. దీంతో ఉత్తీర్ణత శాతం అమాంతం పెరిగిపోతూ వస్తోంది. జంబ్లింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చినా పరిస్థితిలో మార్పులేదు. చివరకు మార్కుల పరుగులో విద్యార్ధులపై ఒత్తిడి పెరిగి అనారోగ్యకర వాతావరణం ఏర్పడడంతో ప్రభుత్వం మార్కులు తీసేసి గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. అయినా గ్రేడ్లతోనూ కార్పొరేట్ సంస్థలు ప్రచారాన్ని చేసుకుంటున్నాయి. సీసీఈ విధానంతో మరింతగా... విద్యాహక్కు చట్టం ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు దరిమిలా మూడేళ్ల నుంచి ఆ విధానంలో పరీక్షలు పెడుతున్నారు. అంతర్గత ప్రాజెక్టులు, ఇతర అంశాలకు 20 మార్కులు వేస్తూ, పబ్లిక్ పరీక్షల్లో 80 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తున్నారు. అయితే అంతర్గత మార్కుల కేటాయింపులో ప్రయివేటు పాఠశాలలు వందకు వందశాతం తమపిల్లలకు వేయిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. పెరిగిన డిమాండ్–చుక్కల్లో ఫీజులు టెన్త్‌లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుండడంతో ఆ తదుపరి ఇంటర్మీడియెట్ విద్యకు డిమాండ్ తలెత్తుతోంది. ఇదే అదునుగా ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు దీన్ని ఆసరా చేసుకొని కాలేజీ ఫీజులను అమాంతం పెంచేస్తున్నాయి. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కొంతమేర రాయితీ ఇస్తూ తక్కిన వారినుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,361 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు 1143. తక్కినవన్నీ ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీలే. టెన్త్‌లో ఉత్తీర్ణులు అవుతున్న విద్యార్ధుల సంఖ్య 2018–19లోనే చూసుకుంటే దాదాపు 6 లక్షల మంది వరకు ఉన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో కేవలం లక్ష సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. తక్కిన వారంతా ప్రయివేటు కార్పొరేట్ కాలేజీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్దులు 9.30 లక్షల మంది ఉండగా వీరిలో 2.30 లక్షల మంది ప్రభుత్వ కాలేజీల్లో చదువుతుండగా తక్కిన 7 లక్షల మందీ ప్రయివేటు కాలేజీల్లో చేరుతున్నారు. అప్పట్లో ఫస్ట్ క్లాస్ అంటే అదో పండగే... ఒకప్పుడు 60 నుంచి 70 శాతం మార్కులు సాధించడమంటే చాలా గొప్పవిషయంగా ఉండేది. ఫస్టుక్లాస్ వచ్చిందటే అదో పండగ. కానీ ఇప్పుడు 60 శాతం మార్కులు అంటే చాలా చిన్నచూపుగా మారింది. 80– 90కి పైగా మార్కులు సాధించిన వారే తెలివైన వారన్న ముద్రపడింది. విద్యార్ధుల్లో ప్రమాణాలతో సంబంధం లేకుండా మార్కులకోసం వక్రమార్గాల్లో పయనిస్తున్నాయి. ఇపుడు 70 నుంచి 90 శాతానికి పైగా మార్కులు సాధించిన వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. -
టెన్త్ ఫలితాలపై మంత్రి గంటా సంచలన వ్యాఖ్యలు
విశాఖ: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రైవేటు విద్యాసంస్థల్లో 10 జీపీఏ(గ్రేడింగ్ పాయింట్ యావరేజ్) అనూహ్యంగా మూడు రెట్లు పెరగడంపై దర్యాప్తు చేయిస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు. శనవారం విశాఖపట్నంలో ఫలితాలు విడుదల చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. టెన్త్ పేపర్ల లీకేజీలో టీడీపీ మంత్రుల ప్రమేయంపై పెద్ద స్థాయిలో విమర్శలు చెలరేగిన నేపథ్యంలో మంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి చెప్పినదాని ప్రకారం ఏ స్కూళ్లలో జీపీఏ గతంలోకంటే మూడు రెట్లు అదనంగా పెరిగాయో వాటిపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మంత్రి గంటా చేసిన ఈ ప్రకటన రాష్ట్రంలో పెను ధుమారం రేపే అవకాశం ఉంది. మంత్రులకు సంబంధించిన స్కూళ్లలోనే లీకేజీ జరిగిందని ఆధారాలతో సహా బయటపడిన నేపథ్యంలో.. విచారణ నిర్ణయంపై మిగిలిన ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఏ విధంగా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. (‘నారాయణ’ సంస్థల నుంచే టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ) మొన్నటికి మొన్న పదో తరగతి పరీక్ష పేపర్లు లీకులయ్యాయని వార్తలు హల్చల్ చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని దాదాపుగా ఈ అంశం కుదిపేసినంత పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నీడలు ఇంకా వీడకముందే పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కావడం వాటిని విడుదల చేస్తూనే ప్రైవేటు స్కూళ్లలో 10 జీపీఏ అమాంతం పెరగడంపై దర్యాప్తు చేయిస్తామంటూ మంత్రి ప్రకటన చేయడం ఇప్పుడు కలవరం రేపుతోంది. మొత్తం పరీక్ష జరిగిన తీరునే అనుమానించాల్సి వస్తోంది. పేపర్ లీకులయ్యాయనే విషయం నిజం కానుందా అని కూడా భావించాల్సి వస్తోంది. శనివారం సాయంత్రం 3.30గంటకు మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు మొత్తం 6,22,538మంది హాజరు కాగా, వారిలో 5,60,253 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 91.92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఇందులో బాలురు 91.87మంది, బాలికలు 91.97 శాతం ఉత్తర్ణత సాధించారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 97.97 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 80.55 శాతంతో చిత్తూరు జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. లీక్ కాదు, మాల్ ప్రాక్టీస్: చంద్రబాబు బినామీ కనుకే ‘నారాయణ’ను రక్షిస్తున్నారా?: వైఎస్ జగన్ ‘లీకేజీ’ దోషులను తప్పిద్దాం! -
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
విశాఖ: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,22,538మంది హాజరు కాగా, వారిలో 5,60,253 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 91.92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఇందులో బాలురు 91.87మంది, బాలికలు 91.97 శాతం ఉత్తర్ణత సాధించారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 97.97 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 80.55 శాతంతో చిత్తూరు జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది కన్నా 2.60 ఉత్తీర్ణతశాతం తగ్గినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 4,102 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించినట్లు చెప్పారు. రెండు ప్రయివేట్ స్కూళ్లలో జీరో శాతం ఫలితాలు వచ్చాయన్నారు. ఫలితాలను www.sakshi.com, www.sakshieducation.com వెబ్సైట్లో చూడవచ్చు.