ఆ పరీక్షలకు నెగిటివ్ మార్కులు లేవు: ఏపీపీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలలో నెగిటివ్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టే అంశంపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్జనభర్జన పడుతోంది. నెగిటివ్ మార్కుల విధానంపై న్యాయపరమైన సలహా కోసం నిపుణులను సంప్రదిస్తున్నామని, వారినుంచి సలహా సూచనలు వచ్చాక, ప్రభుత్వ అనుమతి తీసుకొన్నాకనే ముందుకు వెళ్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ మంగళవారం వివరించారు. ఇప్పటికే ఏపీపీఎస్సీ జారీచేసిన వివిధ నోటిఫికేషన్లలోని పరీక్షలకు ఈ నెగిటివ్ మార్కులు ఉండబోవని స్పష్టంచేశారు.
ఏపీపీఎస్సీ ఇంతకు ముందు వివిధ విభాగాల్లోని 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఆగస్టు 17న నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 30న వివిధ శాఖల్లో పలు పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చింది. గతంలోని నోటిఫికేషన్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియగా కొత్త నోటిఫికేషన్ల పోస్టుల భర్తీకి బుధవారం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటికి నిర్వహించే పరీక్షలకు నెగిటివ్ మార్కుల విధానం ఉండబోదని ఉదయభాస్కర్ చెప్పారు. ఈ నోటిఫికేషన్ల పరీక్షలకు నిర్వహించే ప్రిలిమనరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఓఎమ్మార్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని చైర్మన్ చెప్పారు. ఏఈఈ పోస్టులకు ఇప్పటికే 71వేల దరఖాస్తులు అందగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న మలివిడత నోటిఫికేషన్లకు కూడా భారీగానే దరఖాస్తులు వస్తాయని ఏపీపీఎస్సీ అంచనా వేస్తోంది.