
'తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎదురుండదు'
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిందంటూ విజయోత్సవ ర్యాలీ చేసే అర్హత లేదని ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య అన్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ టీడీపీ కేంద్రానికి లేఖ ఇచ్చిందని.... ఆతర్వాత తెలంగాణ ఏర్పాటు సహకరించలేదని వారు సోమవారమిక్కడ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు టీడీపీని పూర్తిగా అంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలు సోనియా గాంధీని ద్వేషించుకుంటున్నారని, అందువల్ల తెలంగాణ ప్రజలు ఆమెకు అండగా నిలవాలని పొన్నం, రాజయ్య కోరారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందున తెలంగాణలో వచ్చే ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని, కాంగ్రెస్కు ఎదురు ఉండదని పొన్నం, రాజయ్య ధీమా వ్యక్తం చేశారు.