
పేదలకు అందని వైద్యం
మన రాష్ట్రంలో ప్రజారోగ్యం ఆందోళనలో ఉందని, పేదలకు సరైన వైద్యం అందడం లేదు.
► ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎంవీ రమణయ్య
నెల్లూరు: మన రాష్ట్రంలో ప్రజారోగ్యం ఆందోళనలో ఉందని, పేదలకు సరైన వైద్యం అందడం లేదని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎంవీ రమణయ్య పేర్కొన్నారు. స్థానిక జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం పతనం అంచున ప్రజారోగ్యం అనే సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారి దేశాలైన ఇంగ్లాండ్, అమెరికాలో సైతం వైద్యం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తోందన్నారు.
ఎంత పెద్ద అధికారి అయినా, ప్రజాప్రతినిధులైనా అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. అయితే అందుకు విరుద్ధంగా మన దేశంలో వైద్యరంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను తగ్గిస్తున్నాయని ఆరోపించారు. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయకుండా, అత్యవసర మందులను ఏర్పాటు చేయకుండా, నాణ్యత కలిగిన వైద్యపరికరాలు అందుబాటులో ఉంచకుండా ప్రభుత్వ వైద్యాన్ని ప్రభుత్వమే నీరుగారుస్తోందని విమర్శించారు. కార్పొరేట్ వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ వారికి రా యితీలు ఇస్తున్నారని తెలిపారు.
ప్రజల్లో ప్రభుత్వ వైద్యశాలలు సరిగాలేవనే ప్రచారాన్ని ప్రభుత్వమే కల్పి స్తుందని విమర్శించారు. తద్వారా ప్రభుత్వ వైద్యశాలలను అపోలోలాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్నారు. ఇప్పటికైనా వైద్యం అనేది తమ హక్కు అని ప్రజలు డిమాండ్ చేయాలన్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, 24గంటల ఆస్పత్రులను బలోపేతం చేసి వైద్యరంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థూల జాతీయ ఉత్పత్తిలో 5 శాతం నిధులను వైద్యరంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
పారిశుద్ధ్యం పరిరక్షణ, స్వచ్ఛమైన తాగునీరు అందించడం, దోమల నిర్మూలన తదితర వాటి ద్వారా 90 శాతం జబ్బులను నిర్మూలించవచ్చన్నారు. సదస్సులో ఆ వేదిక జిల్లా కన్వీ నర్ శ్రీనివాసరావు, జనవిజ్ఞాన వేదిక, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా తదితర ప్రజాసంఘాలకు చెందిన నేతలు పాల్గొని వైద్యం ప్రభు త్వ ఆధీనంలోనే ఉండాలని, అప్పుడే పేదవారికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.