⇒ రాజధాని స్విస్ చాలెంజ్ టెండర్లకు స్పందన నిల్
⇒ సింగపూర్ కన్సార్టియంకు అనుకూల నిబంధనల ఫలితం.. ముగిసిన గడువు
సాక్షి, అమరావతి: అత్యంత వివాదాస్పదమైన రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం సీఆర్‌డీఏ పిలిచిన అంతర్జాతీయ టెండర్ నోటిఫికేషన్‌కు స్పందన కరువయ్యింది. మంగళవారం సాయంత్రం గడువు ముగిసే సమయానికి ఒక్క సంస్థా టెండర్ దాఖలు చేయలేదు. ఈ విషయాన్ని సీఆర్‌డీఏ అధికారికంగా ధ్రువీకరించలేదు. రాజ ధానిలో 6.84 చదరపు కిలోమీటర్లలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును చేపట్టే మాస్టర్ డెవలపర్ ఎంపిక కోసం గత నెల నాలుగో తేదీన సీఆర్‌డీఏ రెండోసారి టెండర్లు పిలిచింది. ఇందుకు సంబంధించి మధ్యలో ప్రీబిడ్ సమావేశం నిర్వహించగా ఆరు కంపెనీలు వచ్చినా టెండర్లు మాత్రం దాఖలు చేయలేదు. స్విస్ ఛాలెంజ్ విధానం లో నిబంధనలన్నీ సింగపూర్ కన్సార్టియంకు అనుకూలంగా ఉండడంతో టెండర్లు దాఖలు చేసినా ఉపయోగం ఉండదనే ఉద్ధేశంతో ఏ సంస్థా ముందుకు రాలేదని స్పష్టమవుతోంది.
లోపాలను చట్టబద్ధం చేసి..
6.84 చదరపు కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు అభివృద్ధికి అసెండాస్–సింగ్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్ లిమిటెడ్ కంపెనీలు కన్సార్టియంగా ఏర్పడి గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలిచ్చాయి. దీన్ని ఆమోదించిన ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానంలో అంతకంటే మెరుగైన ప్రతిపాదనల కోసం మొదట 5 నెలల క్రితం అంతర్జాతీయ టెండర్లు పిలిచింది. ప్రభుత్వానికి నష్టం కలిగేలా, దేశీయ కంపెనీలకు అవకాశం లేనివిధంగా ఉన్న టెండరు నిబంధనలను పలు కంపెనీలు హైకోర్టులో సవాల్ చేశాయి. హైకోర్టులో అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలో కీలకమైన ఆదాయ వాటాను ఎందుకు వెల్లడించలేదనే దానికి సమాధానం చెప్పలేకపోయింది.
తరావ్త ఏకంగా ఏపీఐడీఈ చట్టాన్నే మార్చేసింది. లోపాలను చట్టబద్ధం చేసింది. దానికనుగుణంగా జనవరి నాలుగో తేదీన సీఆర్‌డీఏ రెండోసారి స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండరు నోటిఫికేషన్ ఇచ్చింది. రెండు దశల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపింది. అయితే తొలి దశలోనే ఒక్క సంస్థ కూడా టెండరు దాఖలు చేయక పోవడం గమనార్హం. దీనిపై సీఆర్‌డీఏ అధికారులను ప్రశ్నించగా తమకు తెలియదని సమాధానమిచ్చారు. అదనపు కమిషనర్లు రామమనోహరరావు, మల్లికార్జున, టెండర్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న సీఆర్‌డీఏ ఆర్థిక విభాగం డైరెక్టర్ నాగిరెడ్డి వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.
ఒక్క టెండరూ రాలేదు!
Published Wed, Feb 22 2017 2:11 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
Advertisement
Advertisement