సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామాల్లో వలసలను నివారించేందుకు, అందరికీ బతుకుదెరువు కల్పించేందుకు ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం(ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్) పూర్తి భరోసా ఇవ్వలేకపోతోంది. జాబ్‌కార్డులు పొందిన కుటుంబాలన్నింటికి వందరోజుల పని దొరకడం లేదు.
ఉపాధిహామీ పథకం అమలులో జిల్లా రాష్ట్రస్థాయిలో ఐదోస్థానంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నా.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కూలీలందరికీ పని దొరకని పరిస్థితి. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 11నెలలు గడుస్తున్నా.. సరిపడే నిధులున్నా కూలీలందరికీ వందరోజుల పని కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. స్థానికంగా ‘ఉపాధి’లేక కూలీలు మళ్లీ వలసబాట పడుతున్నారు. జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల నుంచి బతుకదెరువు కోసం కూలీలు వలస వెళ్తుండటం ఈ పథకం అమలు తీరుకు అద్దంపడుతోంది.
పక్కా ప్రణాళికలు ఉన్నా..
ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి *557.62 కోట్లతో పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని 36 మండలాలకు చెందిన 719 పంచాయతీలు, 1,297 హాబిటేషన్లలో ఈ పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 4,45,117మంది కూలీలకు జాబ్‌కార్డులు అందజేసిన అధికారులు 25,653 ఎస్.ఎస్.ఎస్. గ్రూపుల ద్వారా ఉపాధి కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
కూలీలకు ఉపాధి కల్పించడం ద్వారా 557.62 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక వేశారు. అందులో ఇప్పటి వరకు 203.50 కోట్లు ఖర్చు చేసి 50,149 పనులు చేసినట్లు చెబుతున్నారు. అయితే 2,19,236 కుటుంబాల్లో కేవలం 14,578 కుటుంబాలకు మించి వందరోజుల పని కల్పించలేకపోయారు. అధికారులు ప్రణాళికలు బాగానే వేసుకుంటున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరించడం లేదు. ఇప్పటికీ 45 శాతం గ్రామాలలో ఉపాధి పనులు ఇంకా మొదలవలేదు.
శివారు గ్రామాల్లోనైతే ఉపాధి హామీ పనులను మొక్కుబడిగా ప్రారంభించారు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా జనవరి, ఫిబ్రవరి వరకు నిధులను ఖర్చు చేయకుండా మార్చిలో హడావుడి చేశారు.
50రోజుల్లో లక్ష్యం పూర్తయ్యేనా..
ఈ ఆర్థిక సంవత్సరానికి 2013 మార్చిలో *557.62 కోట్లతో ఉపాధి పనులను ప్రారంభించగా సుమారు పదిన్నర మాసాల్లో *203.50 కోట్లు ఖర్చు చేశారు. మిగతా *354.12 కోట్లు ఈ ఏడాది మార్చి మాసాంతానికి ఖర్చు చేస్తారా..? కూలీలందరికీ పనికల్పిస్తారా..? అసలు ఎంపిక చేసిన పనులన్నీ పూర్తి అవుతాయా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉపాధిహామీ పథకం కింద ఈ ఏడాది ప్రణాళికలో చేర్చిన నిధులు వచ్చే ఏడాదిలో ఖర్చు చేసే అవకాశం ఉంది. కానీ ఈ ఏడాదిలో కూలీల ఉపాధికి మాత్రం గండిపడినట్లే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఉపాధిహామీ పథకం అమలుపై మరింత దృష్టి సారించి, గ్రామాల్లో వలసలను నివార్సించాల్సిన అవసరముంది.
ఏదీ ఉపాధి!
Published Sat, Feb 8 2014 2:16 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement