నగదు బదిలీ పథకంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఆధార్ సంఖ్యకు, బ్యాంకు ఖాతాలకు కొన్నిచోట్ల అనుసంధానం పూర్తి కాలేదు. వినియోగదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తున్నాం. వంట గ్యాస్ రాయితీ సిలిండర్ల పరిమితిని ఏడాదికి 9 నుంచి 12కు పెంచాం. ఆధార్‌తో సంబంధం లేకుండా వినియోగదారులు గతంలో మాదిరే రాయితీపై వంటగ్యాస్ సిలిండర్లు పొందవచ్చు.
- వీరప్ప మొయిలీ,
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి
సాక్షి, కర్నూలు: వినియోగదారులతో కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు ఆడుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అర్ధరాత్రి నుంచే అమలు చేసే ఆయిల్ కంపెనీలు.. వంట గ్యాస్ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. విద్యార్థుల ఉపకార వేతనాలు, పింఛన్లు, రేషన్‌కార్డులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు.. ఇలా అన్ని పథకాలకు ప్రభుత్వం ఆధార్‌తో లంకె పెట్టింది.
ఈ కోవలోనే ఆధార్ నెంబర్లు అందజేయని వినియోగదారులకు రాయితీ సిలెండర్లు ఇవ్వబోమని భయపెట్టడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు క్యూ కట్టారు. జిల్లా మొత్తం మీద 5.04 లక్షల గ్యాస్ కనెక్షను ఉండగా దాదాపు 3 లక్షల కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం పూర్తయింది. వివిధ కారణాలతో ఇప్పటికీ 2 లక్షల మంది ఆధార్ నెంబర్లు అందజేయలేకపోయారు. అయితే ప్రభుత్వం 2014 జనవరి నుంచి నగదు బదిలీని ప్రారంభించింది.
దీంతో ఒక్కో వినియోగదారుడు గ్యాస్ సిలెండర్ కోసం రూ.1,235 చెల్లించాల్సి వచ్చింది. ఇలా చెల్లించిన వారి ఖాతాలో మొదట రూ.435.. ఆ తర్వాత మిగిలిన రాయితీ మొత్తం జమ అవుతుందని డీలర్లు చెబుతున్నా.. ఎప్పుడనే విషయంలో స్పష్టత కరువైంది. సిలెండర్ బుక్ చేసుకున్న నెల రోజులకు కూడా రాయితీ సొమ్ము జమ కాకపోవడంతో వినియోగదారులు తమ అవస్థలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తికమకపడుతున్నారు.
ఈ దృష్ట్యా గ్యాస్ సిలెండర్లకు ఆధార్ లింకును ఉపసంహరించుకున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పది రోజుల క్రితం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఇప్పటికీ ఆదేశాలు అమల్లోకి రాకపోవడంతో వినియోగదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఇదే సమయంలో అధికార యంత్రాంగం ఆధార్ అనుసంధానంపై ముందుకు సాగుతోంది. జిల్లాలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రాకపోవడం గందరగోళ పరిస్థితులకు కారణమవుతోంది.
అసలు రాయితీ గ్యాస్ సిలెండర్లు ఏడాదికి 12 ఇస్తారా, లేదా అనే విషయంపైనా స్పష్టత కరువైంది. జిల్లా గ్యాస్ డీలర్లు మాత్రం ఆయిల్ కంపెనీల ఆదేశాలతో ఆధార్ నమోదును వేగవంతం చేస్తున్నారు. ఈ విషయంలో గ్యాస్ ఏజెన్సీలు, వినియోగదారుల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా అమలు చేయకపోవడం ఏమిటని ప్రజలు నిలదీస్తున్నారు. ఇందుకు డీలర్లు తమకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని సమాధానమిస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఉత్తర్వులు అందలేదు: కె.కన్నబాబు, జేసీ, కర్నూలు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీడియా ద్వారానే తెలుసుకున్నాం. సిలెండర్లకు ఆధార్‌తో లింకు వద్దే విషయమై స్పష్టమైన ఉత్తర్వులు ఇప్పటి వరకు అందలేదు. ఉత్తర్వులు అందిన తర్వాత గ్యాస్ ఏజెన్సీలకు విషయాన్ని తెలియజేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
అంతా ‘గ్యాస్’
Published Mon, Feb 10 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement