సీలేరు , న్యూస్‌లైన్: విశాఖ జిల్లా సీలేరు, డొంకరాయి జల విద్యుత్ కేంద్రాలకు సమైక్యాంధ్ర ఉద్యమసెగ తగిలింది. దీంతో గంటపాటు విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్ర విభజనకు నోట్‌తో సమైక్యవాదులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఇందులో భాగంగా సీలేరు కాంప్లెక్స్‌లోని జల విద్యుత్ కేంద్రాలను శనివారం ముట్టడించారు. వెంటనే విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ నినాదాలతో హోరెత్తిం చారు. జెన్‌కో ఉద్యోగులు విధులు బహిష్కరించాలంటూ రెండు గంటలసేపు ఉద్యమకారులు బైఠాయించారు. ఆందోళనకారుల డిమాండ్‌ను మోతుగూడెం సీఈ కృష్ణయ్య దృష్టికి ఇంజినీరింగ్ సిబ్బంది తీసుకెళ్లారు.
ఆయన ఆదేశాల మేరకు గంటపాటు విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. దీంతో సీలేరు నాలుగు యూనిట్లలో 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇదే సమయంలో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా సుమారు వెయ్యి మంది ముట్టడించడంతో అక్కడ కూడా 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఈమేరకు గాజువాక, బొంగూరు సబ్‌స్టేషన్‌లకు 220 కేవీ విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్లీడర్‌ర్లు మొరాయించి సీలేరులో లోవోల్టేజి సమస్య తలెత్తింది. కొన్ని ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సీలేరు పోలీసులు విద్యుత్ కేంద్రాల వద్దకు చేరుకుని ఉద్యమకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. తాము శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని, సీమాంధ్ర అల్లకల్లోలం అవుతుంటే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి పంపడం సరికాదని, తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటలపాటు సమైక్యవాదులతో ఎస్‌ఐ కె.శ్రీనివాసరావు చర్చలు జరిపి వారిని ఒప్పించి బయటకు పంపారు
విద్యుదుత్పత్తికి ఉద్యమ సెగ
Published Sun, Oct 6 2013 6:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
Advertisement
Advertisement