ఏ వాస్తు తెలియని సింగపూర్ వారితో బ్రహ్మస్థానంలో వాస్తు పురుషుడు కూర్చున్నట్లు, దుర్గాదేవి శక్తి...
- ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
నరసరావుపేటవెస్ట్ : ఏ వాస్తు తెలియని సింగపూర్ వారితో బ్రహ్మస్థానంలో వాస్తు పురుషుడు కూర్చున్నట్లు, దుర్గాదేవి శక్తి ప్రసరిస్తున్నట్లు కలరింగ్ ఇప్పించుకుని వాస్తు నమ్మకాలతో ప్రజల మనోభావాలను తనకు అనుకూలంగా మార్చుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకోవడం చంద్రబాబు నాయుడి దురాలోచనని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ ఆదేశ ప్రభుత్వం స్వచ్ఛందంగానే రాజధాని మాస్టరు ప్లాన్ రూపొందిస్తుందని చెప్పే ముఖ్యమంత్రి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పి అనుమానాలను నివృత్తి చేయాలన్నారు.
మాస్టరు ప్లాన్ స్వచ్ఛందంగా ఇస్తే 1.50లక్షల డాలర్లు సింగపూర్ ప్రభుత్వానికి ట్రాన్స్‌ఫర్ చేస్తూ జీవో ఎందుకిచ్చారని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్‌కే పరిమితం అన్న ఈశ్వరన్ మాస్టర్ డెవలపర్‌గా ఎందుకు ఉండాలనుకుంటున్నారో, ఇద్దరి మధ్య జరిగిన రహస్య భేటీ ఒప్పందాలేమిటో బహిర్గతం చేయాలన్నారు. 65ఏళ్ల స్వతంత్ర దేశంలో నాసాకు సైతం సాంకేతికతను అందించే శక్తి ఉన్న దశలో మాస్టర్ ప్లాన్ ఇచ్చేవారు ఎవరూ లేనట్లు సింగపూర్‌పై అతిమక్కువ చూపడంతో రాష్ట్ర, దేశప్రతిష్టకు భంగం కలిగినట్లు ముఖ్యమంత్రికి తెలియడంలేదా అన్నారు. మేకిన్ ఇండియా అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలు నినదీస్తుంటే మేకిన్ సింగపూర్ అనడానికి చంద్రబాబుకు సిగ్గనిపించటంలేదా అంటూ ప్రశ్నించారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు.