గుండెల్లో.. రైళ్లు..! | Thieves loot Gold and Money in Chennai Express | Sakshi
Sakshi News home page

గుండెల్లో.. రైళ్లు..!

Published Wed, Apr 2 2014 3:51 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

Thieves loot Gold and Money in Chennai Express

సాక్షి, గుంటూరు :రైలు ప్రయాణం హాయిగా ఉంటుందనే ఉద్దేశంతో అధిక శాతం మంది ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే జిల్లాలో వరుసగా జరుగుతున్న రైలు దొంగతనాలతో రాత్రి పూట రైలు ఎక్కాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ దొంగతనాలు పల్నాడు ప్రాంతమైన పిడుగురాళ్ల, నడికుడి మధ్యే అధికంగా జరుగుతుండటం గమనార్హం. మంగళవారం తెల్లవారుజామున పిడుగురాళ్ల మండలం శ్రీనివాసపురం వద్ద  చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు పథకం ప్రకా రం దోపిడీ(ప్రధాన వార్త మెయిన్‌లో) కి తెగబడడంతో  జిల్లా ప్రజలు ఒక్కసారి గా ఉలిక్కిపడ్డారు. సుమారు 20 మంది దుండగులు రైలును ఆపి 45 నిమిషాల పాటు యథేచ్ఛగా దోపిడికి పాల్పడ్డారంటే రైళ్లలో రక్షణ ఎంత అధ్వానస్థితిలో వుందో అర్థమవుతోం ది.

 
 రైళ్లల్లో ప్రయాణమంటే ధన, మా న, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుం దని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అవి బుట్టదాఖలు కావడం తప్ప రైల్వే పోలీసులు అప్రమత్తమైన సంఘటన లు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. గతంలో దొంగతనాలు జరిగిన సంఘటనలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ రైళ్ళల్లో రాత్రి వేళల్లో కనీసం ఒక్క రైల్వే పోలీసు అయినా లేకుండా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండి పడుతున్నారు. రాత్రి వేళ కన్ను మూయాలంటే ఎక్కడా  ఏ సంఘటన జరుగుతుందోనని భయంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. రైల్వే దొంగతనాలు ఎక్కువగా వేసవి కాలంలో జరుగుతాయని తెలిసి కూడా రైల్వే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
 సిబ్బంది కొరత వల్లే రక్షణ కల్పించలేకపోతున్నాం ..
 జిల్లాలో సుమారు 82 రైల్వే స్టేషన్లు ఉండగా కేవలం నాలుగు రైల్వే పోలీసు స్టేషన్‌లు మాత్రమే ఉన్నాయి. ఆ నాలుగు పోలీసు స్టేషన్‌లలో కూడా ఉండాల్సిన దాని కంటే 80 శాతం సిబ్బంది తక్కువగా ఉండటంతో కనీసం రైలులో ఒక్కరిద్దరు పోలీసులు మాత్రమే బందోబస్తు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. నరసరావుపేట రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో నల్లపాడు నుంచి ప్రకాశం జిల్లా గజ్జల కొండ వరకు 16 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి మధ్యలో తిరిగే రైళ్ళకు ఇక్కడ పోలీసు స్టేషన్‌ల నుంచి సిబ్బంది రక్షణగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రైల్వేస్టేషన్‌లో ఒక ఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్ళు, 18 మంది కానిస్టేబుళ్ళు ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎస్సైతోపాటు ఒక హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే ఉండాల్సిన దానికంటే 18 మంది సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఇలా గుంటూరు, తెనాలి, నడికుడి రైల్వేస్టేషన్‌లలో కూడా సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైల్వే పోలీసులు వాపోతున్నారు. ప్రస్తుతం దోపిడి జరిగిన పిడుగురాళ్ళ మండలం శ్రీనివాసపురం నడికుడి రైల్వేస్టేషన్ పరిధిలో ఉంది. అక్కడ ఎస్సై ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఇప్పటికైనా సిబ్బందిని నియమించి దొంగతనాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. 
 
 టీసీల కాసుల కక్కుర్తే 
 దొంగతనాలకు కారణం... రైల్వే టీసీలు కాసులకు కక్కుర్తిపడి ఎవరిని బడితే వారిని రిజర్వేషన్ బోగీల్లో ఎక్కించి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు దండుకుంటున్నారు. దీంతో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ రిజర్వేషన్‌లో  ప్రయాణించింది ఎవరో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని రైల్వే పోలీసులే చెబుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన రైలు దోపిడీలో కూడా గుర్తుతెలియని వ్యక్తులు రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించి అదను చూసి దోపిడీకి పాల్పడ్డారని తేలింది.  డబ్బులు తీసుకుని రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కిస్తున్న టీసీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement