కాంట్రాక్టు ఉద్యోగుల గురించి ఆలోచిస్తాం | Think about the contract employees | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు ఉద్యోగుల గురించి ఆలోచిస్తాం

Published Fri, Jul 27 2018 3:30 AM | Last Updated on Fri, Jul 27 2018 3:30 AM

Think about the contract employees - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్‌ పథకాల విలీనం కారణంగా ఉద్యోగాలు కోల్పోయే వారి గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ హామీ ఇచ్చారు. ఈ అంశంపై రాజ్యసభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. సర్వశిక్షాభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్న టీచర్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాలను విలీనం చేస్తూ ప్రభుత్వం సమగ్ర శిక్షాభియాన్‌ అనే కొత్త పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నందున, ఇప్పటివరకు ఈ మూడు పథకాల కింద కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారి భవిష్యత్తు గురించి ప్రభుత్వం ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించిందా? విలీనంవల్ల వారంతా ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అని అడిగారు.

దీనికి మంత్రి జవదేకర్‌ జవాబిస్తూ.. విజయసాయిరెడ్డి కొత్త సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై ప్రభుత్వం ఆలోచిస్తుందని జవాబిచ్చారు. సమగ్ర శిక్షా అభియాన్‌ పథకం ప్రీ స్కూల్‌ నుంచి 12వ తరగతి వరకు స్కూల్‌ విద్యా వ్యవస్థకు పునరుజ్జీవం కల్పిస్తుందని మంత్రి చెప్పారు. ఈ పథకం అమలుకోసం రూ.75 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు.

మంత్రికి విజయసాయిరెడ్డి మరో ప్రశ్న వేస్తూ.. కేంద్రం ప్రవేశపెడుతున్న సమగ్ర శిక్షాభియాన్‌ పథకం కింద ఖర్చుచేసే నిధులలో కేంద్ర ప్రభుత్వ వాటా 60, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతంగా నిర్ణయించారని, అయితే ఏపీని ప్రత్యేక దృష్టితో చూస్తామని, అందులో వివిధ పథకాల అమలుకోసం కేంద్రం రాష్ట్రానికి చేసే సాయంలో 90 శాతం కేంద్రం భరిస్తే, 10 శాతం మాత్రమే రాష్ట్రం భరించాల్సి ఉంటుందని ప్రధాని, ఆర్థికమంత్రి, హోంమంత్రి వరకు అందరూ సభలో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. సమగ్రశిక్షా అభియాన్‌ పథకం కింద ఏపీకి 90 : 10 దామాషాలోనే ఆర్థిక సహాయం అందిస్తుందా అని ప్రశ్నించగా, దీనికి మంత్రి జవదేకర్‌ సూటిగా సమాధానం చెప్పలేదు. గతంలో ఏ విధంగా ఈ పథకానికి కేంద్రం సాయం చేస్తున్నదో అదే పద్ధతి కొనసాగుతుందన్నారు.

వెనుకబడిన జిల్లాలకురూ.1,050 కోట్లు విడుదల
ఏపీ విభజన చట్టంలో నిర్దేశించిన విధంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద గడచిన మూడేళ్లలో రూ.1,050 కోట్లు విడుదల చేసినట్లు ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్‌ గురువారం రాజ్యసభలో తెలిపారు.

విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 2014–17 మధ్య కాలంలో ఈ ప్యాకేజి కింద మొత్తం రూ1,050 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ నిధులతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఏడు జిల్లాలలో 18,766 పనులు చేపట్టారన్నారు. అందులో 14,160 పనులు పూర్తయ్యాయని, 4,606 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement