మూడో రోజూ చాంబర్‌లోనే
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం కూడా శాసనసభలోని తన చాంబర్‌కే పరిమితమయ్యారు. సభలో అడుగు పెట్టలేదు. సోమవారం విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టే సమయంలో చంద్రబాబు లేరు. మంగళవారం ఉదయం సభ వాయిదా పడిన తరువాతనే చంద్రబాబు సభకు చేరుకున్నారు. బుధవారం కూడా అదే పంథా అనుసరించారు. మధ్యలో ఒకటి, రెండుసార్లు సభ ఇలా సమావేశమై అలా వాయిదా పడుతున్నా ఆయన మాత్రం సభలోకి అడుగు పెట్టలేదు. లాబీలోని తన చాంబర్‌లో కూర్చొని తెలంగాణ, సీమాంధ్ర ఎమ్మెల్యేలకు ఎవరి ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారు వ్యవహరించుకోవాల్సిందిగా చెప్పారు.
చంద్రబాబు సూచనలకు అనుగుణంగా శాసనసభ కార్యకలాపాలను సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు అడ్డుకుంటుంటే.. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు బిల్లును వెంటనే చర్చకు చేపట్టాలని ఇతర పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్‌ను కలవటంతోపాటు ఆయన చాంబర్ ముందు ధర్నా చేశారు. వీరి నిరసనలు ఇలా కొనసాగుతున్న సమయంలోనే తన చాంబర్‌లో జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమవుతున్నారు. బుధవారం ఆయన విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల వారితో భేటీ అయ్యారు. గతం కంటే మన పరిస్థితి ఏమైనా మెరుగైందా? పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ మీరు సమైక్య ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారా, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? అన్న వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ బిల్లుపై సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వెల్లడించాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అఫిడవిట్లు దాఖలు చేస్తున్నట్టు తెలుస్తోందని, మీరు కూడా వారిని అనుసరించాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలకు చె ప్పారు.