ఈ ఏడాది పాత పుస్తకమే!
కొత్తవి లేవంటున్న ప్రభుత్వం
► పాతవాటిని విద్యార్థులనుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు
► ఇప్పటి వరకు ఇండెంట్ పంపని వైనం
► కళాశాలలు తెరచుకునేలోపువచ్చేది అనుమానమే
► ఇంటర్ విద్యార్థులకు తప్పని కష్టాలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఇంటర్మీడియట్ ఉచిత పుస్తకాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. గత సంవత్సరం విద్యార్థులకు ఇచ్చిన పాత పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలా వసూలైన పాత పుస్తకాలనే ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఇవ్వాలని, ఆపైన తక్కువ వచ్చిన వాటికి మాత్రమే ఇండెంట్‌ను పంపాలని ఇంటర్ బోర్డు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కళాశాలలు తెరచేనాటికి ఉచిత ఇంటర్ పుస్తకాలు పంపిణీకి నోచుకునేది కష్టంగా కనిపిస్తోంది.
సర్దుబాటు చేసుకోవాలని ఆదేశాలు..
ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందజేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2015-16 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లకు కలిపి మొత్తం 21850 మంది విద్యార్థులకుగాను 1.48 లక్షల పుస్తకాలను కేటాయించారు. ఇందులో 5181 పుస్తకాలు మిగిలాయి. వీటికితోడు ప్రస్తుతం సెకండియర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల నుంచి పాత పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన, పాత పుస్తకాలతో సర్దుబాటు చేయగా ఏమైనా తక్కువ పడితే మళ్లీ ఇండెంట్ పంపాలని ఇంటర్ బోర్డు కోరింది.
జూన్ ఒకటి నుంచి జూనియర్ కళాశాలల పునఃప్రారంభం
జూనియర్ కళాశాలల పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు ఉచిత పుస్తకాలను పంపిణీ చేయాలన్నది ఇంటర్ బోర్డు ఆలోచన. జూన్ ఒకటో తేదీ నుంచి కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేది అనుమానంగా కనిపిస్తోంది. విద్యార్థుల నుంచి పాత పుస్తకాలను వసూలు చేయాలంటే కనీసం నెలన్నర సమయం పట్టే అవకాశం ఉంది. అనుకున్నట్లుగా కొన్ని పుస్తకాలైన వెనక్కి వస్తే కొందరికి
పంపిణీ చేయవచ్చు. మిగిలిన విద్యార్థుల కోసం ఆ సమయంలో ప్రభుత్వానికి ఇండెంట్ పంపితే ఎప్పుడు వస్తాయనేది అర్థంకావడం లేదు.
పుస్తకాలను వెనక్కి తీసుకోవడం కొంచెం కష్టమే: గత సంవత్సరం విద్యార్థులకు ఇంటర్ ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. ఇప్పుడు వాటిని విద్యార్థుల నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫస్టియర్ విద్యార్థుల నుంచి తీసుకోవచ్చు. ఇంటర్ పూర్తై విద్యార్థుల నుంచి వెనక్కి తీసుకోవడం కొంచెం కష్టం. టీసీ, మార్కుల జాబితాలు ఇవ్వమని బలవంతం చేయాల్సి వస్తుంది.
- లాలెప్ప, కేవీఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్
పాత పుస్తకాలను వెనక్కి ఇస్తారా?
విద్యార్థులను తీసుకున్న పుస్తకాలను పూర్తిస్థాయిలో వెనక్కి ఇస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఫెయిల్ అయిన వారికి పుస్తకాలు అవసరం కాగా, పాసైన వారు వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంటర్ బోర్డు పుస్తకాలకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, మెడిసిన్ ఎంట్రెన్స్‌ల కోసం నిర్వహించే ఎంసెట్/నీట్ పరీక్షల కోసం వీటిలోని పాఠ్యాంశాలనే చదవాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సెకండియర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల నుంచి పుస్తకాలను ఎలా వసూలు చేసుకోవాలో తెలియడం లేదని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు వాపోతున్నారు.