
ఏజెన్సీలో భారీ వర్షం
పాడేరు, న్యూస్‌లైన్ : ఏజెన్సీలోని వివిధ ప్రాంతాలతోపాటు, సరిహద్దులోని మైదాన మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడిన పాడేరు వాసులకు మధ్యాహ్నం కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు. గత రెండు మూడు రోజుల్లా ఉదయం పూట మంచు తీవ్రత లేనప్పటికీ, మధ్యాహ్నం ఒంటిగంటవరకు చుర్రుమంది. అనంతరం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని భారీ వర్షం పడింది. అరకులోయలో 26.6 మిల్లీమీటర్లు నమోదయింది. సుమారు గంటన్నపాటు భారీ వర్షానికి ఈదురుగాలులు తోడయ్యాయి.
అరకులోయలో ఏకధాటిగా...
అరకులోయ: అరకులోయ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడినవానకు ఈదురుగాలులు తోడయ్యాయి. కొద్దిసేపు జనం బెంబేలెత్తి పోయారు. సుమారు గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహన చోదకులు, అరకులోయకు సమీపంలోని సుంకరమెట్టలో వారపు సంతదారులు ఇబ్బందులకు గురయ్యారు.
ఈ ఏడాది భారీ వర్షం ఇదే మొదటిసారి. మామిడి పూతరాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీ వరికి కొంత ఉపకరించినా, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదముందని అంటున్నారు. క్యాబేజీ పురుగు పట్టేస్తుందని రైతులు వాపోతున్నారు. అరకులోయలో 26.6 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదయినట్టు డిప్యూటీ తహశీల్దారు శివ సత్యనారాయణమూర్తి తెలిపారు.
గొలుగొండ ప్రాంతంలో ఊరట
గొలుగొండ : వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించింది. సుమారు అరగంటపాటు కురిసింది. ఎండవేడి మి నుంచి జనం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని చిన్నయ్యపాలెం, గొలుగొండ, దారపాలెం, పోలవరం, కొత్తపాలెం, జోగుంపేట, పాతమల్లంపేట పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా కాసినా.. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. ఈ వర్షం కొమ్ముశనగ, కూరగాయలు, జీడితోటలకు ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు.