మహారాణిపేట(విశాఖపట్నం): ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేసే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) ఆదిలోనే ఇక్కట్ల పాల్జేస్తోంది. ప్రారంభానికి ముందే మిషన్లు మొరాయిస్తున్నాయి. సెల్‌నెట్‌వర్క్‌లు సరిగా పనిచేయడం లేదు. తరచూ సర్వర్లు డౌన్ అయిపోతున్నాయి. ఏప్రిల్1వ తేదీ నుంచి అమలు చేయనున్న ఈ విధానం అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతుంది. జిల్లాలో 2063 రేషన్ దుకాణాలుండగా తొలిదశలో జీవీఎంసీతో పాటు భీమిలి, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచలి మున్సిపాల్టీల పరిధిలో ఉన్న 686 షాపుల్లో అమలు చేయాలని సంకల్పించారు.
కానీ తొలి విడతలో 430 మిషన్లు మాత్రమే కేటాయించడంతో వాటిలో జీవీఎంసీ పరిధిలో 290, ఇతర మున్సిపాల్టీల్లో 90 షాపులకు కేటాయించారు. మిగిలినవి రిజర్వుగా ఉంచారు. ఆ తర్వాత దశల వారీగా జిల్లాలోని గ్రామీణ, ఏజెన్సీప్రాంతాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. కేటాయించిన మిషన్ల ద్వారా ఆయా షాపుల పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి క్రమం తప్పకుండా రేషన్ తీసుకునేందుకు వచ్చే కుటుంబసభ్యుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్యమొదలవుతోంది. వేలిముద్రలుతీసుకునే సమయంలో ఈ మిషన్లు సరిగాపనిచేయకపోవడం...సర్వర్లు డౌన్‌వడం..నెట్‌వర్క్‌లు పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
‘ఈ పాస్’ పనిచేసే తీరు ఇలా..!
రేషన్‌కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే హైదరాబాద్‌లోని సెంట్రల్ సివిల్ సప్లయిస్ సర్వర్‌తోనూ, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే బెంగుళూరులోని ఆధార్ సర్వర్‌తోను కనెక్ట్ అవుతుంది. వేలిముద్రలుతీసుకోగానే కార్డు తీసుకున్నప్పుడు సేకరించిన వేలి ముద్ర లతో సెంట్రల్ సర్వర్ నుంచి సరిపోల్చుకుంటుంది. అలా ఈ మూడు సర్వర్ల నుంచి క్షణాల్లో మిషన్‌కు సంకేతాలొస్తాయి. అన్నీ సరిపోతే ఆరేషన్‌కార్డులో ఎంతమంది సభ్యులున్నారు? వారికి ఏ సరుకులు ఎంత కేటాయించారు? దరఎంత? అనేవివరాలు మిషన్‌లో చూపిస్తాయి. కానీ ఇప్పుడు వేలిముద్రలు సేకరించే సమయంలోనే మిషన్లు మొరాయిస్తుండడం అధికారులకు తలనొప్పిగా మారింది.
నెట్‌వర్కింగ్ అసలు సమస్య..!
ఈ-పాస్ మిషన్లు పని చేయకపోవడానికి ప్రభుత్వం ఇచ్చిన సిమ్‌కార్డులే ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. 1జీబీ కెపాసిటీ గల సిమ్‌కార్డులు ఇవ్వడంతో వాటి ద్వారా సిగ్నల్స్ రాక నెట్‌వర్క్ (ఇంటర్నెట్)కనెక్ట్ కాకపోవడంతో రోజంతా సమయం వృధా అవుతోంది.విశాలంగా ఉన్న ప్రాంతాల్లో పని చేస్తున్నాయని, ఇరుకుగా, చిన్నచిన్న సందుగొందులుగా ఉన్న ప్రాంతాల్లో అసలు పనిచేయడంలేదని సిబ్బంది వాపోతున్నారు. మిషన్లలో నాణ్యత లేకపోవడమా లేక సిమ్‌కార్డులే పనిచేయడం లేదా అనేది అధికారులు చెప్పలేక పోతున్నారు.
వేలిముద్రలకు నరకయాతనే:
రేషన్ తీసుకోవాలంటే లబ్ధిదారులు రేషన్ దుకాణాల్లో ముందుగా ఈ పాస్ మిషన్లులో వేలిముద్రలు నమోదు చేయించుకోవాలి. అలా చేస్తేనే రేషన్ వస్తోంది. దీనికోసం లబ్ధిదారులు రేషన్‌దుకాణాల ఎదుట రోజంతా బారులు తీరి ఉంటున్నారు. మిషన్లు పని చేయకపోవడం, సిమ్‌లు పనిచేయకపోవడం వంటి కారణాలతో రోజంతా క్యూలో ఉన్న లబ్ధిదారులు ఉస్సూరంటూ ఇంటిబాట పడుతున్నారు. మరుసటి రోజు మళ్లీ క్యూ కడుతున్నారు.
త్వరలో ఐరిష్‌తో సరుకులిస్తాంః జేసీ
సిమ్‌లు చాలా ఏరియాల్లో పనిచేయయడం లేదని ఫిర్యాదులొస్తున్నాయి.ప్రత్యామ్నాయంగా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌లు ఇస్తున్నాం. భవిష్యత్‌లో ఇలాంటి ఇబ్బందులుతలెత్తకుండా ఉండేందుకు ప్రతీరేషన్‌షాపునకు బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంటికి వచ్చే సిబ్బందికి కుటుంబంలో ఎవరో ఒకరి వేలిముద్రల ఇస్తే సరిపోతుంది. అందరి వేలిముద్రలు ఒకేసారి ఇవ్వనసరం లేదు. ఒకటి రెండు నెలల్లోఐరిష్‌తో అనుసంధానం చేయనున్నాం. ఒకటో తేదీ నుంచి ఈ పాస్ మిషన్లను ఉపయోగించి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ల ద్వారానే సరుకులు ఇస్తాం.
- నివాస్ జనార్ధనన్, జిల్లా జాయింట్ కలెక్టర్
‘ఈ-పాస్’ ఇక్కట్లు
Published Sun, Mar 22 2015 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM
Advertisement
Advertisement