- మూడున్నరేళ్లుగా యథేచ్ఛగా తరలింపు
- రూ.వేల కోట్లు మింగిన టీడీపీ నేతలు
- ఇవన్నీ తెలియనట్లు కఠిన చర్యలంటూ ఇప్పుడు సీఎం చంద్రబాబు బిల్డప్
రాష్ట్రంలో ఇసుక మాఫియా పేట్రేగిపోవడానికి ఊతమిచ్చిందెవరు? మూడున్నరేళ్లుగా నదులు, వాగులు, వంకల్లో రేయింబవళ్లు జేసీబీలు, పొక్లెయినర్లతో ఇసుకను తవ్విపోసి సరిహద్దులు దాటించిందెవరు? అడ్డుచెప్పిన అధికారులను.. మహిళలని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చి పడేస్తే చోద్యం చూసిందెవరు? పైగా పంచాయితీ పెట్టి నిందితుడి తప్పే లేదని తేల్చి చెప్పిందెవరు? నదులను గుల్ల చేసి.. కింది నుంచి పైదాకా జేబులు నింపుకొందెవరు? ప్రభుత్వ పెద్దకు తెలియకుండానే, ఆయన ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరిగాయా? జనం చెవుల్లో పూలు పెట్టడానికి ఇప్పుడు హూంకరిస్తే అక్రమాలు సక్రమం అయిపోతాయా?
సాక్షి ప్రతినిధి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక మాఫియాను అణచి వేయడానికి కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం చూస్తుంటే దొంగే ‘దొంగ.. దొంగ’ అని అరచినట్లుందన్న సామెత గుర్తుకొస్తోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నాటకీయంగా ఇసుక అక్రమ తరలింపు వ్యవహారం చర్చకు వచ్చినపుడు ముఖ్యమంత్రి స్పందించిన తీరు వారిని విస్తుపోయేలా చేసింది. ఇసుక మాఫియాను కంట్రోల్ చేయడానికి కఠినంగా వ్యవహరించాలని, పీడీ కేసులు పెట్టాలని చెప్పడం చూస్తుంటే ఇసుక అక్రమంగా తరలివెళ్తోందన్న విషయం ఇప్పుడే తెలిసినట్లు.. ఇన్నాళ్లూ సాగిన వ్యవహారం తనకేమీ తెలియనట్లు.. ప్రజల దృష్టిలో బిల్డప్ ఇచ్చుకోవడానికే తప్ప మరోటి కాదని స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది చివరలో ఎన్నికలొస్తాయని, అందుకు సన్నద్ధం కావాలని ఇటీవల పార్టీ శ్రేణులకు సూచించిన చంద్రబాబు.. ఆ దిశగా జనం దృష్టిలో మంచి అయ్యేలా కొత్త నాటకానికి తెర తీశారు.
టీడీపీ నేతల జేబుల్లోకి వేల కోట్లు
రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కన్ను ఇసుకపై పడింది. ఎక్కడికక్కడ నదులు, వంకలు, వాగుల పరిధిలోని ఇసుక రేవులను టీడీపీ నేతలకు అప్పగించింది. మహిళా సంఘాలకు ఇసుక రేవులను అప్పగిస్తున్నట్లు బయటకు చెప్పినా, వారి ముసుగులో టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఎడాపెడా ఇసుక వ్యాపారం సాగించారు. రెండేళ్లుగా మరీ బరితెగించి ఉచిత ఇసుక ముసుగులో మాఫియాగా అవతరించారు. ఉచిత ఇసుక విధానాన్ని ఖరారు చేస్తూ 2016 ఫిబ్రవరి 15న చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. ఇదే అదనుగా రాష్ట్రంలోని 383 ఇసుక రేవులను పార్టీ నేతల చేతుల్లో పెట్టింది.
పర్యవసానంగా రేయింబవళ్లు పొక్లెయిన్లు, జేసీబీలతో ఇసుక తవ్విపోసి.. ఇష్టానుసారం రేటు కట్టి జిల్లాలు, రాష్ట్ర సరిహద్దులు దాటించారు. ఇందులో కింది నుంచి పైదాకా పార్టీ పెద్దలకు వాటాలందాయన్నది బహిరంగ రహస్యం. గడిచిన మూడున్నరేళ్లలో ఏకంగా రూ.4 వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమంగా గడించారంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర లేదు. ఇందులో సింహభాగం ముఖ్యమంత్రికి, ఆయన కుమారుడు లోకేశ్‌కు అందిందని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ బట్టబయలు చేసింది.
ఇప్పుడే తెలిసినట్లు హూంకరింపులు?
అటు కోస్తా నుంచి.. ఇటు రాయలసీమ వరకు ప్రతి జిల్లాలోనూ ఇసుక మాఫియా ఏ విధంగా పేట్రేగిపోయిందో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియంది కాదు. ఏ మేరకు ఇసుక తరలింపు జరిగిందో అధికారులు ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా లెక్కలు కట్టి మరీ నివేదికలు ఇచ్చారు. ఇన్నాళ్లూ సాగిన ఈ దందా తనకేమాత్రం తెలియనట్లు, ప్రభుత్వ కనుసన్నల్లో ఇదేదీ జరగనట్లు ఇపుడు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం నూటికి నూరు శాతం ‘హైడ్రామా’నే అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
పోల్ మేనేజ్‌మెంట్, పొలిటికల్ మేనేజ్‌మెంట్ అంటూ రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్న ముఖ్యమంత్రి.. ప్రజల దృష్టిలో మరింత పలుచన కాకుండా ఉండేందుకే ఇసుక అక్రమాలను ఉపేక్షించమని కొత్త నాటకానికి తెర తీశారు. తవ్విపోసుకోవాల్సిన దానికంటే వంద రెట్లు ఎక్కువగానే తరలించి, జేబులు నింపుకున్నాక ఇపుడు చేసేదేం ఉంటుందని రెవెన్యూ శాఖకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మినిబమ్మి చేయడంలో ఆరితేరిన ముఖ్యమంత్రి.. భ్రష్టు పట్టిన తన పాలన పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఈ డ్రామాను రక్తి కట్టించడానికి పూనుకొన్నారన్నారు.
ప్రశ్నిస్తే దాడులే
నిబంధనలకు విరుద్ధంగా, నీటి వనరులు స్వరూపం కోల్పోయే విధంగా టీడీపీ నేతలు ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారని ఫిర్యాదులందని ప్రాంతమంటూ లేదు. టీడీపీ నేతలు మరీ హద్దులు దాటడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించగానే బెదిరింపులతో బెంబేలెత్తించారు. ‘ఇది మా ప్రభుత్వం.. మేం చెప్పినట్లు వినాలి. కాదు కూడదంటే ఇక్కట్లు తప్పవు’ అని హెచ్చరికలు చేసి ఆందోళనకు గురిచేశారు. కొన్ని చోట్ల ఏకంగా దాడులకు దిగారు.
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేశారు. అందరూ చూస్తుండగానే జుట్టు పట్టుకుని ఈడ్చేశారు. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి.. బాధిత ఎమ్మార్వో వనజాక్షిని పిలిపించుకుని ఆమెదే తప్పు అని తేల్చారు. అంటే దోపిడీని అడ్డుకోవడమే తప్పు అన్నట్లు వ్యవహరించారు. ఇసుక అక్రమాలపై వార్తలు రాసిన మీడియా ప్రతినిధులపై టీడీపీ నేతలు దాడులు చేశారు. వంతెనలు, రహదారులకు ముప్పు వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.