తెలుగు తమ్ముళ్ల రౌడీ రాజ్యం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తెలుగు తమ్ముళ్లు ఇసుకాసురుల అవతారమెత్తి లక్షలు కొల్లగొడుతున్నారు. అడ్డువచ్చిన వారిపై ఆటవిక చర్యలకు పాల్పడుతున్నారు. అయినా రెవెన్యూ, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారు. జరుగుతున్న అక్రమాలను కళ్లకు కట్టినట్టు చూపించినా ప్రభుత్వ యంత్రాంగంలో చలనం ఉండడం లేదు. ఇవన్నీ అమాత్యులు, ఇతర అధికారపార్టీ ముఖ్య నేతల ప్రోద్బలంతోనే జరుగుతున్నాయి. తమ దారికి అడ్డువస్తే సామాన్యులైనా.. చివరకు ఎమ్మెల్యే అయినా తెలుగు తమ్ముళ్లు దాడికి తెగబడుతున్నారు. అధికారం చేతిలో ఉందికదా అని, తుని నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఓ ముఖ్యనేత అండ చూసుకుని అడ్డగోలుగా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారు.
రౌడీ రాజ్యాన్ని తలపింపజేస్తున్నారు. గత ఏప్రిల్ 18న ఇదే నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరంలో కొండలు, గుట్టలు మాటున లక్షలు విలువచేసే ఇసుకను నిల్వ చేసిన తెలుగుతమ్ముళ్ల అక్రమాలను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఎమ్మెల్యే ఇసుక నిల్వల వద్ద మకాం వేసి మరీ ఇసుక సీజ్ చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేసినా.. రెవెన్యూ, పోలీసు, మైన్‌స అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేశారు. దీనికి అమాత్యుల ఒత్తిళ్లే కారణమని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ అక్రమ ఇసుక నిల్వలను ప్రభుత్వానికి అప్పగించే వరకు పట్టువీడని ఎమ్మెల్యే రాజా.. తాజాగా ఆదివారం తుని రూరల్ మండలం డీ పోలవరంలో ఇసుకాసురుల ఆగడాలను ప్రతిఘటించేందుకూ వెనుకాడ లేదు.
తాండవ నదిని ఆనుకుని అనుమతి లేకున్నా అధికారపార్టీ ముఖ్య నేతల దన్ను చూసుకుని కొందరు ఇసుక తరలించి లక్షలు వెనకేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా హద్దులు దాటి వచ్చి సామాన్య రైతుల పొలంలోని ఇసుకనూ ఎడాపెడా తవ్వేస్తున్నారు. బొద్దవరం గ్రామానికి చెందిన మళ్ల నరసారావు, అతని సోదరుడు సత్యనారాయణ పొలంలో ఇసుకనూ తవ్వేస్తుండడంతో భూ యజమాని నరసారావు అడ్డుకున్నారు. దీంతో ఇసుకాసురులు రెచ్చిపోయారు. పార, పలుగులతో నరసారావు రెక్కలు వెనక్కుకట్టి మరీ దాడిచేసి గాయపర్చారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా బాధితులకు ధైర్యం చెప్పారు. నకిలీ వేబిల్లులతో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 13 ట్రాక్టర్ల ఇసుక తరలిపోకుండా అడ్డుకున్నారు. ఇది ఇసుక మాఫియాకు రుచించ లేదు. దీంతో ఆయనపైనా, ఆయన గన్‌మన్‌పైనా తెలుగుతమ్ముళ్లు దాడికి తెగబడ్డారు.
దీంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు, ఆయన గన్‌మన్‌కు గాయాలయ్యాయి. తుని నియోజకవర్గంలోని కోటనందూరు, బొద్దవరం, పోలవరం, ఉప్పరగూడెం ర్యాంపుల్లో ఇసుక మాఫియా చెలరేగిపోయి తవ్వేస్తోంది. దాదాపు ఈ ర్యాంపులన్నీ తెలుగు తమ్ముళ్ల అజమాయిషీలోనే నడుస్తున్నాయి. గడచిన ఆరు నెలలుగా ఇక్కడి నుంచి లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించి కోట్లు కొల్లగొట్టేశారు. ఆ ఇసుకతో నెలకు రూ.45 లక్షల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. దీంతో డీపోలవరంలో ఇసుక అక్రమాలను అడ్డుకోవడానికి ఎమ్మెల్యే వెళ్లారు. ఆయనపై ఇసుకాసురులు నిర్భయంగా దాడి చేయడం వెనుక అధికార పార్టీ అండదండలున్నాయి.. తమకేమీ కాదన్న పొగరే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.
అప్పుడు బొద్దవరంలో మాదిరిగానే ఇప్పుడు డీ పోలవరం ఘటనలోనూ పోలీసుల తీరు మరోసారివిమర్శలపాలైంది. ఈ ఘటనపై నేరుగా ఎమ్మెల్యే అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చినప్పుడైనా పోలీసులు స్పందించాల్సింది. ఎమ్మెల్యే రాజాపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్టీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ హుటాహుటిన తుని వెళ్లారు. ఎమ్మెల్యేను, దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు. పార్టీ వెన్నంటి ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. నెహ్రూ వెంట ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు ఉన్నారు.