13న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహణ
అర్ధరాత్రి దాటాకే ఫలితాలు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : స్థానిక ఎన్నికల ఫలితాల ముహూర్తం సమీపిస్తోంది. జిల్లా, మండల పరిషత్ పీఠాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో మరో మూడు రోజుల్లో తేలిపోనుంది. ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 13న జరగనుంది. రెవెన్యూ డివిజన్ల వారీగా కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు రెండు దశల్లో గత నెల 6, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 14 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఏకగ్రీవమయ్యాయి. జెడ్పీటీసీ స్థానాలకు 188 మంది, ఎంపీటీసీ స్థానాలకు 1974 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 16,50,329 మందికి 13,05,268 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడకుండా ఈ నెల 13 లెక్కింపు చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రౌండ్‌లో బ్యాలెట్‌బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను బయటకు తీసి వేరు చేసి 25 చొప్పున కట్టలు కడతారు. తర్వాత రౌండ్‌లో ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చిందీ లెక్కిస్తారు.
ఇలా చేయడం వల్ల ఏ ప్రాంతంలో ఎవరికి ఎక్కువ, తక్కువ ఓట్లు వచ్చాయో తెలుసుకొనే అవకాశముండదు. కౌంటింగ్‌కేంద్రంలోకి అభ్యర్థితోపాటు, వారి తరపున జనరల్ ఏజెంటు, కౌంటింగ్ ఏజెంట్‌ను మాత్రమే అనుమతిస్తారు. సెల్‌ఫోన్లు, కెమెరాలు కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకురావడానికి వీలులేదు.
అర్ధరాత్రి దాటాకే ఫలితాలు
నాలుగు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును చేపడుతున్నారు. ఆయా కేంద్రాల్లో గది విస్తీర్ణాన్ని బట్టి 8 నుంచి 12 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, 3 లేదా 4గురు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. ప్రాథమిక కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాలెట్ పత్రాలను కలిపి కట్టలు కట్టడం పూర్తయ్యే సరికి మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కొరూమ్‌లో 5 టేబుళ్లలో జెడ్పీటీసీ, 5 టేబుళ్లలో ఎంపీటీసీ ఓట్లు లెక్కిస్తారు. యలమంచిలి, నర్సీపట్నం వంటి చిన్న సెగ్మెంట్ల ఫలితం సాయంత్రం 6, 7 గంటలకు వస్తుంది. అనకాపల్లి, పాయకరావుపేట, చోడవరం, ఎస్.రాయవరం, నక్కపల్లి వంటి పెద్ద స్థానాల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి అర్ధరాత్రి దాటుతుందని అధికారులు చెబుతున్నారు. ఫలితాలను ఆయా కేంద్రాల్లో ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన ప్రత్యేక మీడియా ప్రతినిధి ద్వారా వెల్లడిస్తారు.
కౌంటింగ్ కేంద్రాలు
మొదటి విడతలో గత నెల 6న జరిగిన విశాఖ డివిజన్‌లోని ఆనందపురం, పెందుర్తి, భీమిలి, పరవాడ, సబ్బవరం, పద్మనాభం మండలాలకు విశాఖ పోతినమల్లయ్యపాలెంలోని సిమ్స్ లా కాలేజి క్యాంపస్‌లో లెక్కింపు చేపట్టనున్నారు.
అనకాపల్లి డివిజన్‌లోని అనకాపల్లి, అచ్యుతాపురం, బుచ్చెయ్యపేట, మునగపాక, కశింకోట, చోడవరం, చీడికాడ, యలమంచిలి, రాంబిల్లి, కె.కోటపాడు మండలాలకు అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో లెక్కిస్తారు.
నర్సీపట్నం డివిజన్‌కు సంబంధించి నర్సీపట్నం, మాకవరపాలెం, కోటవురట్ల, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలకు నర్సీపట్నం పెదబొడ్డేపల్లిలోని డాన్‌బాస్కో కాలేజిలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
రెండో విడతగా గత నెల 11న జరిగిన అనకాపల్లి డివిజన్‌కు సంబంధించి దేవరాపల్లి, వి.మాడుగుల మండలాలకు అనకాపల్లి ఏఎంఏఎల్ కాలేజిలో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది.
నర్సీపట్నం డివిజన్‌కు సంబంధించి రావికమతం, రోలుగుంట, నాతవరం, గొలుగొండ మండలాలతో పాటు పాడేరు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి కొయ్యూరు, చింతపల్లి మండలాలకు నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో నిర్వహిస్తారు.
పాడేరు రెవెన్యూ డివిజన్‌లో మిగిలిన మండలాలు జి.కె.వీధి, డుంబ్రిగుడ, అనంతగిరి, జి.మాడుగుల, హుకుంపేట, అరకువ్యాలీ, ముంచింగ్‌పుట్టు, పాడేరు, పెదబయలు ఓట్ల లెక్కింపు పాడేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో జరుగుతుంది.
మూడు రోజుల్లో ‘స్థానిక’ తీర్పు
Published Sat, May 10 2014 12:16 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement