హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు | Three judges to the AP High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు

Published Tue, Apr 21 2020 3:56 AM | Last Updated on Tue, Apr 21 2020 3:59 AM

Three judges to the AP High Court - Sakshi

కె.సురేష్‌రెడ్డి, బి.కృష్ణమోహన్, కె.లలితకుమారి

సాక్షి,అమరావతి: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. న్యాయవాదులు.. బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్‌ రెడ్డి, కన్నెగంటి లలితకుమారిల పేర్లకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదముద్ర వేసింది. వీరి ముగ్గురి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. మొత్తం ఆరుగురి పేర్లను హైకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ జాబితాలో కృష్ణమోహన్, సురేష్‌ రెడ్డి, లలితకుమారి, వి.మహేశ్వర్‌రెడ్డి, జీఎల్‌ నర్సింహారావు, కె.మన్మథరావు ఉన్నారు. ఈ జాబితాపై చర్చించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు.. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలతో కూడిన కొలీజియం ముగ్గురి పేర్లను కేంద్రానికి పంపింది. 

బొప్పూడి కృష్ణమోహన్‌
గుంటూరులో 1965, ఫిబ్రవరి 5న జన్మించారు. తల్లి.. సావిత్రి. తండ్రి.. బీఎస్‌ఆర్‌ ఆంజనేయులు జిల్లా జడ్జిగా పనిచేశారు. భార్య.. వసంత లక్ష్మి కూడా హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. కృష్ణమోహన్‌ 1988లో ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. గుంటూరు జిల్లా కోర్టులో కొద్ది నెలల పాటు ప్రాక్టీస్‌ చేశారు. సీనియర్‌ న్యాయవాది కృష్ణ కిషోర్‌ వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. అదే ఏడాది హైకోర్టుకు ప్రాక్టీస్‌ మార్చారు. సీనియర్‌ న్యాయవాది త్రివిక్రమరావు వద్ద జూనియర్‌గా చేరారు. 1994లో సొంతంగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌గా పనిచేశారు. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. తర్వాత హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ ప్యానెల్‌ అడ్వొకేట్లలో ఒకరిగా ఉన్నారు. ఈయనకు నాటకాలంటే ఆసక్తి. చిన్నతనంలో పలు నాటకాలు వేశారు. 2019, జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు తొలి అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఈయన.

కంచిరెడ్డి సురేష్‌రెడ్డి
అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెలలో 1964, డిసెంబర్‌ 7న జన్మించారు. తండ్రి శంకర్‌రెడ్డి. తల్లి లక్ష్మీదేవమ్మ. అనంతపురం ప్రభుత్వ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. కర్ణాటకలోని గుల్బర్గా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989 సెప్టెంబర్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ప్రముఖ సీనియర్‌ న్యాయవాది టి.బాల్‌రెడ్డి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. కొన్నేళ్ల తర్వాత సొంతంగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. క్రిమినల్‌ లాలో మంచి పట్టు సాధించారు. హైకోర్టులో ఉన్న అతి తక్కువ మంది ఉత్తమ క్రిమినల్‌ న్యాయవాదుల్లో ఈయన కూడా ఒకరు. ముఖ్యంగా మరణశిక్ష కేసులను వాదించడంలో దిట్ట. సివిల్, రాజ్యాంగపరమైన కేసులను కూడా వాదించారు.

కన్నెగంటి లలితకుమారి
లలిత కుమారి స్వగ్రామం.. గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువు జములపాళెం. 1971, మే 5న జన్మించారు. తల్లి.. కె.అమరేశ్వరి, తండ్రి.. అంకమ్మ చౌదరి. 10వ తరగతి నుంచి మిగిలిన విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లో సాగింది. పడాల రామిరెడ్డి లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1994 డిసెంబర్‌ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సీనియర్‌ న్యాయవాది ఎంఆర్‌కే చౌదరి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. ఆ తర్వాత న్యాయవాదులు.. కె.హరినాథ్, ఒ.మనోహర్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశాక సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ, దేవదాయ శాఖ, టీటీడీ, వేంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైస్సెస్‌ తదితర సంస్థలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement