‘ఎర్ర’బారిన శేషాచలం
- ఎర్రదొంగల దాడి
- పోలీసుల కాల్పుల్లో ముగ్గురి మృతి
- అడవంతా పాగా వేసిన ఎర్రచందనం కూలీలు
నిత్యం శ్రీవారి గోవింద నామాలు ధ్వనించే శేషాచలంలో ఎర్రచందనం స్మగ్లర్ల కారణంగా మరోసారి టెన్షన్ నెలకొంది. శేషాచల అడవిలో వందల సంఖ్యలో తిష్టవేసిన ఎర్రదుండగులను బుధ, గురువారాల్లో పోలీసు కూంబింగ్ పార్టీ సిబ్బంది నిలువరించే ప్రయత్నం చేసింది. దుండగులు దాడికి దిగడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు చనిపోయినప్పటికీ ఎర్ర దుండగులు అడవిని వదిలి వెళ్లలేదు. ఒక దశలో వీరు పాత్రికేయులను చుట్టుముట్టడంతో పోలీసులు కాపాడారు. దీంతో ఇక్కడ టెన్షన్ నెలకొంది. వీరికోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు.
సాక్షి, తిరుమల: శేషాచలం అడవిలో వందల సంఖ్యలో ఎర్రదొంగలు తిష్ట వేశారన్నదానికి గురువారం వెలుగుచూసిన ఎన్‌కౌంటర్ ఘటనే నిదర్శనం. సంఘటన జరిగిన గుడ్డెద్దుబండ దట్టమైన అటవీప్రాంతంలో ఉంది. అక్కడున్న అపారమైన ఎర్ర చందనం కలపను కొల్లగొట్టేందుకు వందల సంఖ్యలో స్మగ్లర్లు, కూలీలు అక్కడే తిష్ట వేశారు.
ఇందుకోసం పదుల సంఖ్యలో గుడారాలు నిర్మించుకున్నారు. అక్కడే గోతులు తీసి కిలోల కొద్దీ బియ్యం, పప్పులు, నూనెలు, దుంపలు నిల్వ చేసుకున్నారు. లారీ ట్యూబ్‌లలో తాగునీటిని నిల్వ చేసుకున్నారు. గురువారం వెలుగుచూసిన ఎన్‌కౌంటర్ సంఘటన తర్వాత కూంబింగ్ నిర్వహించిన పోలీసులు గుడారాల్లో తిష్టవేసిన దుండగులను గుర్తించారు. పరిస్థితిని గమనించిన దుండగులు చాకచక్యంగా తప్పించుకున్నారు. అయినా కూంబింగ్ యథావిధిగా సాగుతోంది.
ఒకవైపు పోలీసుల కూంబింగ్, మరోవైపు వందల సంఖ్యలో ఎర్రచందనం దుండగుల తిష్టతో శేషాచలంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే స్మగ్లర్, కూలీల్లో ఎవ్వరినీ వదలబోమని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్‌పీ రాజశేఖరబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే, వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన శేషాచల అడవుల్లో తిష్టవేసిన దుండగుల్ని ఏరివేయటం సాధ్యమేనా? అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.
విలేకరులను చుట్టుముట్టిన ఎర్రదొంగలు..
ముగ్గురు స్మగ్లర్లు మృతి చెందిన ఘటన కవరేజీ కోసం తిరుమల, తిరుపతికి చెందిన సుమారు 50 మందికిపైగా విలేకరులు, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు సిద్ధమయ్యారు. ఎస్‌టీఎఫ్ దళాల భద్రతలో వారంతా ఉత్సాహంగా సుమారు ఏడు కిలోమీటర్ల మేర నడచుకుంటూ మధ్యాహ్నం 12 గంటలకు సంఘటన స్థలానికి వెళ్లారు. ఘటన స్థలాన్ని చిత్రీకరించారు. తిరిగి మధ్యాహ్నం 1.20 గంటలకు నలుగురు ఎస్‌టీఎఫ్ సిబ్బంది భద్రతలో తిరుగుప్రయాణం అయ్యారు. వెళ్లిన మార్గంలో తిరిగి వచ్చేందుకు ఇబ్బందిగా ఉందని మరో మార్గంలో తిరుగుప్రయాణం అయ్యారు.
ఆ మార్గంలో వందల సంఖ్యలో ఎర్రచందనం స్మగ్లర్లు మాటు వేశారు. ఎక్కడ చూసినా వారు బస చేసేందుకు పదుల సంఖ్యలో ఈతాకుతో, గడ్డితో ఏర్పాటు చేసిన గుడారాలు, అప్పుడే వండిన వేడి చల్లారని వంట, లారీ ట్యూబుల్లో దాచిన తాగునీరు కనిపించాయి. వాటిని చీత్రీకరించేందుకు అక్కడికి పెద్ద ఎత్తున మీడియా సిబ్బంది రావడాన్ని గుర్తించిన స్మగ్లర్లు బృందాలుగా విడిపోయి దిగువ ప్రాంతాలకు వెళ్లారు. దీంతో అక్కడికి మీడియా సిబ్బంది వెళ్లడానికి వెనుకడుగు వేసి మరోదారిలో మరో గుట్టపైకి వచ్చారు.
అదే సందర్భంలో మరికొందరు ఎర్రచందనం దుండగులు సుమారు 20 మంది దాకా హఠాత్తుగా 50 మీటర్ల దూరంలోని చెట్ల పొదల్లోంచి ఎదురుపడ్డారు. పెద్ద ఎత్తున మీడియా సిబ్బందిని చూడటంతో వారు ఒక్కసారిగా వీరిని చుట్టుముట్టారు. కొందరు విలేకరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వారికి రక్షణగా వచ్చిన ఎస్‌టీఎఫ్ సిబ్బంది ఆయుధాలను లోడ్‌చేసి సిద్ధమయ్యారు.
ఎదురుపడిన వారిపై కాల్పులు చేయాలా? వద్దా? అన్నదానిపై ఎస్‌టీఎఫ్ డీఎస్‌పీ ఇయాజ్ బాషాను అనుమతి కోరారు. దీన్ని గుర్తించిన స్మగ్లర్లు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. పోలీసు రక్షణలో విలేకరులు మరో రెండు గంటల తర్వాత క్షేమంగా రేడియోస్టేషన్‌కు చేరుకున్నారు. అలాగే, ఏడు కిలోమీటర్లు ఏకధాటిగా నడవటంతో మంచినీరు, ఆహారం కోసం తీవ్ర ఇబ్బంది పడటంతోపాటు ఊహించని విధంగా స్మగ్లర్లు ఎదురుపడిన ఘటనపై కొందరు విలేకరులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.
ఘటనాస్థలంలో అస్వస్థతకు గురైన అర్బన్ జిల్లా ఎస్‌పీ
ఎన్‌కౌంటర్ స్థలాన్ని గురువారం ఉదయం తిరుపతి అర్బన్ జిల్లా ఎస్‌పీ రాజశేఖరబాబు పరిశీలించారు. ఆయనతోపాటు డీఎస్‌పీలు ఇయాజ్ బాషా, రవిశంకర్‌రెడ్డి, శ్రీనివాసులు, సీఐలు రాజశేఖర్ ఉన్నారు. దట్టమైన అటవీమార్గంలోని కొండలు, బండల మీద సుమారు రెండు గంటలపాటు నడక సాగించి ఉదయం 11 గంటలకు చేరుకున్నారు.
ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సంఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. తర్వాత మధ్యాహ్నం 12.40 గంటలకు తిరుగుప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్లూకోజ్, ఇతర పానీయాలు సేవిస్తూ విరామం తీసుకుంటూ మధ్యాహ్నం 4 గంటలకు రేడియో స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడే సిద్ధంగా ఉంచిన ఆస్పత్రి సిబ్బంది సాయంతో సెలైన్ ఎక్కించుకున్నారు.