జడ్చర్ల, న్యూస్‌లైన్: క్షణికావేశం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. కాళ్లకు పట్టా గొలుసుల విషయంలో కూతుళ్లు గొడవపడటంతో తల్లి చెరువులోకి దూకింది. రక్షించే క్రమంలో ఊపిరాడక ఇద్దరు కూతుళ్లతో పాటు తల్లికూడా మృత్యువాతపడింది. ఈ విషాదకర సంఘటన శనివారం జడ్చర్ల మండలంలోని గోప్లాపూర్ గ్రామంలో జరిగింది. బాధితులు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సాకలి రాములమ్మ(55)కు ముగ్గురు కుమార్తెలు.. భర్త మూడేళ్లక్రితం అనారోగ్యంతో మృతిచెందడంతో తల్లే కూతుళ్లకు పెద్దదిక్కుగా మారింది.
వీరిలో పెద్దకూతురు యాదమ్మ(38)ను నసరుల్లాబాద్‌కు చెందిన కృష్ణయ్య వివాహం చేసుకున్నాడు. రెండో కూతురు మంగమ్మ(32)గోప్లాపూర్‌ను చెందిన భీమయ్య పెళ్లి చేసుకున్నాడు. కాగా, కుమార్తె భీమమ్మ మానసిక వికలాంగురాలు కావడంతో అతనికే ఇచ్చి పెళ్లిచేశారు. ఇదిలాఉండగా పెద్దల పండగ (పెత్రమాస) కోసం ఈనెల 3న ముగ్గురు కూతుళ్లు పుట్టింటికి వచ్చారు. పండగరోజున విందు ఏర్పాటు చేసుకున్నారు.
శనివారం ఉదయం కాళ్లకు వెండి పట్టా గొలుసులు చేయించమని కూతుళ్లు యాదమ్మ, మంగమ్మలు తల్లితో గొడవపడ్డారు. ఇది కాస్త చిలికిచికిలి గాలివానగా మారింది. దీంతో మనస్తాపం చెందిన తల్లి తాను చనిపోతానని కుమార్తెలను బెదిరించేందుకు గ్రామశివారులో ఉన్న చెరువులోకి దూకింది. ఆమెను రక్షించేందుకు పెద్ద కూతురు, రెండో కూతురు ఆ వెనువెంటనే చెరువులోకి దూకారు. తల్లిని ఒడ్డుకు చేర్చేక్రమంలో నీటమునిగారు. మృత్యువుతో పోరాడి చివరికి తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా ప్రాణాలు విడిచారు. వారి వెంట వచ్చిన కొడుకులు అంజి, చెన్నయ్య ఇదిచూసి చుట్టుపక్కల వారికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చి మృతదేహాలను వెలికితీశారు. సంఘటన స్థలాన్ని సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ సాయికుమార్ పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెద్దలపండగ రోజున ఈ ఘటనతో చేసుకోవడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రాణం తీసిన క్షణికావేశం
Published Sun, Oct 6 2013 3:38 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement
Advertisement