గుంతకల్లు అర్బన్ సర్కిల్ పరిధిలోని రెండు పోలీస్‌స్టేషన్లలో నమోదైన 11 చోరీ కేసుల్లో ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ గుంతకల్లు జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎంఎవీస్.ప్రభాకర్ తీర్పునిచ్చారు.
గుంతకల్లు టౌన్(అనంతపురం): గుంతకల్లు అర్బన్ సర్కిల్ పరిధిలోని రెండు పోలీస్‌స్టేషన్లలో నమోదైన 11 చోరీ కేసుల్లో ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ గుంతకల్లు జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎంఎవీస్.ప్రభాకర్ తీర్పునిచ్చారు. వివరాలు..గుంతకల్లు పట్టణం మోదినాబాద్‌కి చెందిన షేక్ రహంతుల్లా అలియాస్ రహిమాన్, కర్నూల్ జిల్లా గోస్పాడు మండలానికి చెందిన బొల్లేపల్లి శివకుమార్, బొల్లేపల్లి శేషఫణి ముగ్గురూ కలిసి పట్టణంలో 11 చోట్ల చోరీలకు పాల్పడ్డారు. దీంతో వారిపై చోరీ కేసు నమోదైంది. గుంతకల్లు డీఎస్పీ రవికుమార్, అప్పటి వన్‌టౌన్ ఎస్సై క్రాంతికుమార్‌లు 2014 జూన్ 20వ తేదీన ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి సబ్ డివిజన్‌లో ఎన్నడూ లేని విధంగా సుమారు 60 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ముగ్గురు నిందితులపై నమోదైన 11 కేసులపై నిందితులను కోర్టు విచారించింది. నేరం రుజువు కావడంతో ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి ఏడాది పాటు జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.