ముంబై: శివసేన(ఉద్దవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో సంజయ్‌రౌత్‌కు ముంబై కోర్టు 15 రోజులు జైలు శిక్ష విధించింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయనకు 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద రౌత్‌ను దోషిగా నిర్ధారిస్తూ.. ఆయనకు రూ.25 వేలు జరిమానా కూడా విధిస్తున్నట్లు వెల్లడించింది.
మేధ సోమయ్య ముంబైలోని రుయా కళాశాలలో ఆర్గానిక్ కెమెస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె యువ ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థ నడుపుతున్నారు. అయితే తన ఎన్జీవతో కలిసి ఆమె రూ.100 కోట్ల మరుగుదొడ్ల కుంభకోణానికి పాల్పడినట్లు రౌత్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలు మీడియాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి.
చదవండి: ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?.. ఈడీకి సుప్రీం కోర్టు మందలింపు
వీటిని ఖండించిన కిరీట్ సోమయ్య సతీమణి మేధ.. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టును ఆశ్రయించారు. 2022 నుంచి రౌత్ తనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని, అవి పలు పత్రికలు, ఎలక్ట్రానిక్‌తోపాటు సోషల్ మీడియాలోనూ ప్రచురితమయ్యాయని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనతోపాటు తన భర్తపై సంజయ్ రౌత్ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారని చెబుతూ.. పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు సంజయ్ రౌత్ న్యాయవాది, ఆయన సోదరుడు సునీల్ రౌత్ మాట్లడుతూ.. బెయిల్ పిటిషన్ వేస్తామని తెలిపారు. అలాగే ఈ ఉత్తర్వులపై ముంబై సెషన్స్ కోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment