విరమణపై ఉత్కంఠ
తుని ఘటనలో మరో ముగ్గురికి బెయిల్ మంజూరు
పత్రాల రాక ఆలస్యంతోనేడు విడుదలయ్యే అవకాశం
12వ రోజూ కొనసాగినముద్రగడ దీక్ష
డిమాండ్ నెరవేరడంతోనేడు విరమించే అవకాశం
జిల్లాలో కొనసాగిన ఆందోళనలు, ధర్నాలు
ఆమరణ దీక్ష చేస్తున్న ఉద్యమసారథి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుండగా.. ఆ కలవరపాటుకు తెరపడి, ఆయన దీక్ష విరమించడానికి మార్గం సుగమమయ్యే పరిణామం సోమవారం జరిగింది. తునిలో కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన ఘటనల కేసులో అరెస్టయిన 13 మందిలో పదిమంది ఇప్పటికే విడుదల కాగా.. మిగిలిన ముగ్గురికీ బెయిల్ మంజూరైంది. దీంతో ముద్రగడ దీక్ష విరమిస్తారని అంతా ఆశించినా.. పూచీకత్తుల సమర్పణలో జరిగిన జాప్యం వల్ల ఆ ముగ్గురూ మంగళవారం విడుదల కానున్నారు. అది జరిగిన అనంతరం ముద్రగడ దీక్ష విరమించే అవకాశం ఉంది.
సాక్షి, రాజమహేంద్రవరం : తుని ఘటన సందర్భంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం 12వ రోజూ కొనసాగింది. సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన 13 మందిలో 10 మందికి శనివారమే బెయిల్ రాగా ఎనిమిది మంది అదేరోజు విడుదలయ్యారు. బెయిల్ పత్రాల్లో సాంకేతిక కారణాలతో ఒకరు, సీఐడీ కస్టడీకి తీసుకోవడంతో మరొకరి విడుదల ఆలస్యమైంది. వీరిద్దరూ సోమవారం రాత్రి విడుదలయ్యారు.
కాగా ముఖ్యనేతలైన ఆకుల రామకృష్ణ, వి.వై దాసు, నల్లా విష్ణుమూర్తిలకు సోమవారం సాయంత్రం కాకినాడ నాల్గవ అదనపు జిల్లా జడ్జి, పిఠాపురం ఇన్‌చార్జి అదనపు జిల్లా జడ్జి బి.గాయత్రి బెరుుల్ మంజూరు చేశారు. దీంతో ముద్రగడ దీక్ష విరమిస్తారని అంతా ఎదురుచూశారు. అరుుతే బెరుుల్ మంజూరుకు సంబంధించిన పత్రాలు రాజమహేంద్రవరం కేంద్రకారాగారానికి సకాలంలో రాకపోవడంతో ఆకుల, దాసు, నల్లా మంగళవారం విడుదల కానున్నారు. దీంతో ముద్రగడ మంగళవారమే దీక్ష విరమించే అవకాశముంది.
కీ టోన్స్ బాడీస్‌లో హెచ్చుతగ్గులు
కాగా, ముద్రగ డ ఆరోగ్య పరిస్థితి ఆదివారం ఉదయం విషమంగానే ఉందన్న రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ టి .రమేష్‌కిషోర్ రాత్రి వైద్యానికి సహకరించడంతో ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. సోమవారం ఉదయం వైద్య పరీక్షలు చేశామని చెప్పారు. ఆయన కీటోన్స్ బాడీస్‌లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయని, అవి ఆదివారం 1+గా ఉండగా, సోమవారం 2+కు పెరిగాయని, ముద్రగడ భార్యకు కూడా కీటోన్స్ బాడీస్ 3+గా ఉన్నాయని చెప్పారు.
ముద్రగడకు గుండె సంబంధిత పరీక్షలు చేశామని, అంతా బాగుందని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌లకు తెలియజేస్తున్నామని, అవసరమైతే వేరే ఆస్పత్రికి తరలించేoదుకు అన్ని ఏర్పాట్లూ చేశామని పేర్కొన్నారు. వైద్యానికి సహకరిస్తుండడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. గుండెకు సంబంధించిన వైద్యం కోసం ఇక్కడ నుంచి తరలించేందుకు ముద్రగడ సుముఖత వ్యక్తం చేయలేదని చెప్పారు. ఇంకా ఎక్కువ రోజులు దీక్ష కొనసాగించడం మంచిది కాదని బంధువులు, కుటుంబసభ్యులకు తెలిపామన్నారు.
ఏరువాకను అడ్డుకున్న కాపునేతలు
ముద్రగడకు మద్దతుగా జిల్లాలో సోమవారం కూడా కాపులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఏలేశ్వరంలో వందలాది మంది ధర్నా నిర్వహించారు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో బంద్ నిర్వహించి, అర్ధనగ్నప్రదర్శన చేశారు. కాపుల విషయంలో సీఎం చంద్రబాబు నిరంకుశ వైఖరిని విడనాడాలని కోరుతూ పసుపల్లిలో ఏరువాక కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అంబాజీపేట మండల టీబీకే జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల సెంటర్‌లో ఖాళీ కంచాలతో నిరసన వ్యక్తం చేశారు. ముద్రగడ దీక్ష విరమింపజేయాలని ధవళేశ్వరంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
విడుదలైన లగుడు, కూరాకుల
రాజమహేంద్రవరం క్రైం : తుని ఘటనలో అరెస్టయి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న లగుడు శ్రీనివాస్, కూరాకుల పుల్లయ్య సోమవారం రాత్రి విడుదలయ్యూరు. వాస్తవానికి వీరికి శనివారమే బెయిల్ మంజూరు కాగా శ్రీనివాస్‌ను సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బెయిల్ పత్రాల్లో సాంకేతికపరమైన లోపాల కారణంగా పుల్లయ్య విడుదల కాలేదు. వీరి విడుదలతో అరెస్టయిన 13 మందిలో పదిమంది విడుదలైనట్టయింది.
పూచీకత్తుల్లో జాప్యంతో నిలిచిన విడుదల
కాకినాడ లీగల్ : తుని కేసులో విడుదల కావలసిన ఆకుల రామకృష్ణ, వి.వై దాసు, నల్లా విష్ణుమూర్తిలకు సోమవారం సాయంత్రం బెయిల్ మంజూరయినప్పటికీ, ష్యూరిటీలు (పూచీకత్తులు) సమర్పించే సమయం మించిపోవడంతో విడుదల మంగళవారానికి వాయిదా పడింది. ఈ ముగ్గురికీ జిల్లా కోర్టులో బెయిల్ మంజూరు కాగా కాకినాడ ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ష్యూరిటీలు సమర్పించేందుకు వ్యవధి చాలలేదు. మంగళవారం ఆ ప్రక్రియ పూర్తరుున అనంతరం వారు విడుదలవుతారు.