జల సమాధి | Three women buried in water | Sakshi
Sakshi News home page

జల సమాధి

Published Sun, Oct 19 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

జల సమాధి

జల సమాధి

దుస్తులు శుభ్రం చేయడానికి వెళ్లిన ముగ్గురు మహిళలు జలసమాధి అయ్యారు. వారు ముగ్గురూ ఒకే వీధివాసులు... కూలి చేస్తేగాని పూట గడవని పరిస్థితి వారి కుటుంబాలది. వారిలో ఇద్దరికి వివాహం జరిగింది. ఇద్దరు చొప్పునచిన్న పిల్లలు ఉన్నారు. మరో యువతి ఇంటర్మీడియెట్ చదువుతోంది. చెరువుకు కలిసి వెళ్లిన వీరు....మృత్యువులోనూ అదే బాటపట్టారు.
 
 విజయనగరం క్రైం: చెరువు ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. కలిసి దుస్తులు ఉతకడానికి వెళ్లిన వారు  కలిసే విగతజీవులయ్యారు. ఒకరిని రక్షించబోయి మరో ఇద్దరు మృత్యుకోరల్లో చిక్కుకున్నారు. ఈ హృదయ విదారక సంఘటన విజయనగరం మండలం గుంకలాం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షి  అందించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..విజయనగరం మండ లం గుంకలాం గ్రామంలో మెయిన్ వీధిలో నివాసముంటున్న లెంక వెంకన్న కుమార్తె లెంక దేవి ఇంటర్మీడియెట్ చదువుతోంది. అదే వీధిలో  కలిశెట్టి రాంబాబు, అతని  భార్య కృష్ణవేణి, కునుకు గోవింద, అతని భార్య లక్ష్మి నివాసం ఉంటున్నారు. ఇటీవల హుదూద్ తుపాను రావడంతో ఇంట్లో మాసిన దుస్తులు ఎక్కువగా పేరుకుపోయాయి. దీంతో శనివారం లెంక దేవి (17), కలిశెట్టి కృష్ణవేణి (26), కునుకు లక్ష్మి (24)తో పాటు కోరాడ నారాయణమ్మ దుస్తులు ఉతికేందుకు సమీపంలోని  పెద్దరం గ చెరువు వద్దకు వెళ్లారు. ఉతికిన దుస్తులను జాడిస్తున్న సమయంలో కాలుజారి కలిశెట్టి కృష్ణవేణి చెరువులో పడిపోయింది.   రక్షిం చాలని ఆమె కేకలు  వేయడంతో ఉతికిన చీరను చెరువులోకి విసిరి ఆమెను కాపాడబోయారు. కృష్ణవేణి తనను రక్షించుకొనే ప్రయ త్నంలో చీరను గట్టిగా లాగడంతో  రెండో చివర పట్టుకున్న లెంక దేవి, కునుక లక్ష్మి కూడా చెరువులో పడిపోయారు. ముగ్గురూ   కేకలు వేయడంతో సమీపంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి కోరాడ నారాయణమ్మ భయంతో గ్రామంలోకి పరుగులు తీసి సమాచారం అం దించింది.
 
 వెంటనే గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని చెరువులోకి దిగి వారిని రక్షించే ప్రయత్నం చేశారు.  అప్పటికే ముగ్గు రూ మృతి చెందారు. లెంక దేవి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్  (సీఈసీ) చదువుతోంది. లెంక దేవికి తండ్రి వెంకన్న, తల్లి కుమారి, తమ్ముడు మణికంఠ ఉన్నారు. వెంకన్న కూలిపని చేసుకుని పిల్లలను పోషిస్తున్నాడు.  కలిశెట్టి కృష్ణవేణికి భర్త రాంబాబు, కుమార్తెలు దీపిక (7), సాయి (3), కునుకు లక్ష్మికి భర్త గోవింద, కుమార్తెలు అనూష (5), మానస (2) ఉన్నారు. వీరి భర్తలు ఇద్దరూ కూలిపనిచేసి కుటుంబాల్ని పోషిస్తున్నారు.  భర్తలకు చేదోడుగా వీరూ పనులకు వెళ్లేవారు. రూరల్ ఎస్ ఐ ఎస్.కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకొని  వివరాలు సేకరించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
 
 దుఃఖ సాగరంలో బంధువులు
 మృతుల బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. సంఘటన స్థలం వద్ద వారి రోధనలు మిన్నంటాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెను చెరువు కబళించేసిందని దేవి తల్లిద ండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోజు కూలీ పని చేసి క ష్టపడి సంపాధించిన డబ్బులతో తన కుమార్తెను  ఉన్నత విద్య అందించాలని  ఎంతో ఆశపడితే ఇలా  మృత్యువు కాటేసిందని ఏడుస్తున్నారు. చిన్న పిల్లలను ఎలా సాకాలని, వారు అమ్మకావాలని అడిగితే ఏమని సమాధానం చెప్పాలంటూ కలిశెట్టి కృష్ణవేణి భర్త  రాంబాబు, కునుకు లక్ష్మి భర్త గోవిందుతో పాటు వారి కుటుంబ సభ్యులు  గుండెలు బాధుకుంటూ రోదిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది.
 
 ఇద్దరికీ చిన్నపిల్లలు
 చెరువులో  పడి మృతి చెందిన కృష్ణవేణి, కునుకు లక్ష్మికీ ఇద్దరేసి ఆడపిల్లలున్నారు. చిన్న పిల్లలను చూసైనా కనికరం చూడకుండా దేవుడు వారిని తీసుకుపోయాడని,  పిల్లలేం పాపం చేశారని, తల్లులు లేని పిల్లలనుచేసి   అన్యాయం చేశాడని స్థానికులు కన్నీరు పెట్టారు.
 
 బాధితులను పరామర్శించిన  నాయకులు
 వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి  జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను ఓదార్చారు. అలాగే జిల్లా పరిషత్ చైర్‌పర్సన్  శోభ స్వాతీరాణి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి  ఐ.వి.పి.రాజు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు వెంకట నర్సింగరావు, జెడ్పీటీసీ తుంపల్లి రమణ గ్రామ సర్పంచ్ కర్రో రమణమ్మ,  వైఎస్‌ఆర్  సీపీ నాయకులు  బోగి రమణ, సత్యనారాయణ బాధితులను  పరామర్శించారు.
 
 ప్రమాదభరితంగా చెరువు
 పెద చెరువు ప్రమాదభరితంగా మారింది. చెరువు వద్ద పెద్ద రాయబండ ఉంది.  ఆ రాయి మీద కాలు జారితే చెరువులో పడి మృతి చెందవలసిందే.  సుమారు ఎనిమిదేళ్ల  కిందట ఇదే చెరువులో పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. వారు  స్నానం చేస్తుండగా  ఈతరాక చెరువులోకి  పడి  మృతిచెందారు.  ఇప్పుడు కూడా   ముగ్గురు మహిళలు  మృతి చెందడంతో ముగ్గురేసి చొప్పున చెరువు బలితీసుకుంటోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదభరితంగా ఉన్న  ప్రాంతంలో బట్టలు ఉతకడాన్ని గ్రామస్తులు నిషేధించడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement