- చెన్నైలో చికిత్సపొందుతూ మహిళ మృతి
- అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ
- డోర్ టూ డోర్ సర్వేకు శ్రీకారం
నెల్లూరు (అర్బన్): స్వైన్‌ఫ్లూపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వెంకటాచలం మండలానికి చెందిన మాధవీలత స్వైన్‌ఫ్లూ సోకి చెన్నైలో చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందింది. అలాగే ఇటీవల నెల్లూరు నగరానికి చెందిన మహిళ కూడా ఫ్లూ లక్షణాలు కనపడటంతో చెన్నైలో చికిత్స చేయించుకొని నయం చేసుకొని వచ్చారు. అయితే సోమవారం జిల్లాకు చెందిన మహిళ మృతిచెందడంతో అధికారులు జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు.
మహిళ చనిపోయిన ప్రాంతంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ ఇంకా ఎవరికైనా ఫ్లూ లక్షణాలు ఉన్నాయో లేదో పరిశీలించాలని మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ భారతిరెడ్డి తెలిపారు. తాను ఆ ప్రాంతానికి వెళ్లి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో మాట్లాడానన్నారు. కాగా మృతి విషయమై జిల్లా కలెక్టర్ జానకి ఆరాతీసినట్లు తెలిసింది. డీఎంహెచ్‌ఓ ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తదితర విషయాలు అడిగి తెలుసుకున్నట్లు, ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో విస్త్రతంగా అవగాహన తీసుకురావాలని చెప్పినట్లు సమాచారం.
డోర్ టూ డోర్ సర్వే.. : జిల్లావ్యాప్తంగా డోర్ టూ డోర్ సర్వే చేయించే ప్రయత్నంలో వైద్యశాఖ అధికారులు ఉన్నట్లు తెలిసింది. ప్రతి ఇంటికి తమ సిబ్బందిని పంపించి నాలుగైదు రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుంటే వారికి చికిత్స చేయించాలని, నయం కాకపోతే స్వైన్‌ఫ్లూ పరీక్ష జరపాలని భావిస్తున్నారు. మెడికల్ అధికారులతో దీనిపై డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. డోర్ టూ డోర్ సర్వే పెద్ద అంశం కాబట్టి సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నారు. అంతా కుదిరితే సర్వే మంగళవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కరపత్రాలను విస్త్రృతంగా పంపిణీ చేయాలని, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని, ఫ్లూపై నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆమె క్షేత్రస్థాయికి ఆదేశాలు ఇచ్చారు.
చెన్నైకు ఫ్లూ అనుమానితుడు..: ఇదిలాఉండగా నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గత మూడు, నాలుగు రోజులుగా జ్వరం కారణంగా చికిత్సపొందుతున్న వ్యక్తిని ఫ్లూ అనుమానంతో చెన్నైకు తరలించినట్లు సమాచారం. ఆస్పత్రి వైద్యు ల సూచన మేరకు ఫ్లూ పరీక్ష చేయించేం దుకు అతడిని తీసుకెళ్లారు. ఫ్లూ అనుమానితులు ఎవ్వరూ నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకొనేందు కు ఇష్టపడటం లేదు. నాలుగైదురోజులుగా జ్వరంతో బాధపడుతున్న పలువురు ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్ల సలహా మేరకు ఫ్లూ నిర్ధారణ పరీక్ష చేయించుకొనేందుకు చెన్నై బాట పడుతున్నారు.