సాక్షి, నల్లగొండ: రాష్ట్రంలో నెలకొన్న సున్నిత పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి అవాంతరం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ ప్రసాదరావు తెలిపారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంటీన్‌ను మంగళవారం ప్రారంభించారు. జిల్లా పోలీసు అధికారులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ఎస్‌ఐ రాత పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని ఆయనీ సందర్భంగా చెప్పారు.
విధి నిర్వహణలో చనిపోయిన హోంగార్డులకు సంబంధించి... వారి కుటుంబ సభ్యులకు హోంగార్డు ఉద్యోగాలివ్వడంపై పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆర్థికశాఖ ఆమోదం రాగానే హోంగార్డులకు వేతనాల పెంపును వర్తింపజేస్తామని డీజీపీ తెలిపారు.