కలపకు కాళ్లు !
తాడేపల్లి రూరల్ : అక్రమంగా కలప తరలింపు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్న వారి దందా అధికమైంది. అడిగే వారు లేకపోవడంతో యథేచ్ఛగా దోచుకుంటున్నారు.
తాడేపల్లి మండలం గుండిమెడలో జరుగుతున్న అక్రమ కలప తరలింపు వ్యవహారం ఇది.. వివరాల్లోకి వెళితే... గ్రామంలోని ఇసుక క్వారీ సమీపంలో కృష్ణానదీ చెంత దాదాపు 300 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇక్కడ ఇంగ్లిషు కంప చెట్లు ఇతర చెట్లు భారీగానే ఉన్నాయి. అక్రమార్కుల కన్ను వీటిపై పడింది. ఇంకేముంది వెనుకా ముందు ఆలోచించకుండా పర్యవరణానికి మేలు చేసే చెట్లను విక్షణారహితంగా నరికివేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీని కోసం కూలీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిత్యం గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాలకు ట్రాక్టర్లు, లారీల్లో తరలిస్తున్నారు. పెద్ద పెద్ద దుంగలను నరికి గుట్టలుగా పేర్చి అమ్ముకుంటున్నారు.
అయితే, ఊరికి దూరంగా ఎక్కడో లోపల ఇసుక క్వారీకి అవతల ఈ తతంగం అంతా జరుగుతుండడంతో, బాహ్య ప్రపంచానికి కలప అక్రమ తరలింపు గురించి తెలియడం లే దు. అక్రమ ఆదాయానికి అలవాటు పడ్డ కొందరు ఈ చెట్లతో వ్యాపారం సాగిస్తున్నారు. రోజు కూలికి ఆశపడి వచ్చే కూలీలు ఇవేమీ తెలియక చెట్లు నరికే పనిలో నిమగ్నమైపోతున్నారు.
అసైన్డ్ భూమిలోకి అందునా పంచాయతీ లంక భూముల్లోకి ప్రవేశించాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పని సరిగా ఉండాలి. కానీ, అక్రమార్కులు ఇవేమీ లేకుండానే చెట్లను నరుకుతూ, పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. మరో వైపు లక్షలు సంపాదిస్తున్నారు. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సైతం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. లక్షల విలువ చేసే ప్రభుత్వ సంపద అక్రమంగా తరలి పోతుంటే ఏ అధికారి స్పందించక పోవడంపై పలువురు మండిపడుతున్నారు. ఇకనైనా అక్రమార్కుల ఆగడాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు.