
తిరుమలలో విదేశీ భక్తుల సందడి
తిరుమల: తిరుమలలో బుధవారం విదేశీయులు సందడి చేశారు. సుమారు 32 దేశాలకు చెందిన సుమారు 200 మంది ఇస్కాన్ భక్తులు సమూహంగా వచ్చారు. అందరూ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. పలువురు తలనీలాలు సమర్పించారు. ఇక్కడి క్షేత్ర సంప్రదాయంగా పుష్కరిణిలో స్నానంచేశారు. పుష్కరిణిలో స్నానం చేసిన ఇతర భక్తులతో ముచ్చటించారు. ఒకరికొకరు కరచాలనం చేస్తూ ఆనందం పంచుకున్నారు. తర్వాత ఇక్కడే ఉన్న భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల పర్యటన తమకు సరికొత్త అనుభూతిచ్చిందని ఇస్కాన్ భక్తులు తెలిపారు. టీటీడీ ఏర్పాట్లు బాగా చేసిందని వారు కితాబిచ్చారు.