శ్రీవారి ఆదాయం రూ. 4.45 కోట్లు
దర్శనానికి 30 గంటలు
కాలిబాట క్యూలో తోపులాట
తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామికి ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ. 4.45 కోట్ల హుండీ కానుకలు సమకూరాయి. ఇటీవల మూడేళ్ల కాలంలో ఆలయ లెక్కల ప్రకారం ఇదే రికార్డు. శనివారం ఆలయ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను ఆదివారం లెక్కించారు. అజ్ఞాత భక్తులు కొందరు భారీ స్థాయిలో వేయి రూపాయల నోట్ల బండిళ్లను సమర్పించినట్లు తేలింది. 2012 జనవరి 3న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రూ. 4.25 కోట్లు లభించాయి. అంతకు ముందు ఒకే రోజున రూ. 5.5 కోట్లు లభించడం ఇప్పటి వరకు రికార్డుగా ఉంది.
పెరిగిన రద్దీ...
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. గదుల కోసం, తలనీలాలు సమర్పించుకునేందుకు, స్వామి దర్శనానికి భక్తులు క్యూలలో బారులుతీరారు. సాయంత్రం 6 గంటల వరకు 44,832 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల కిలోమీటరు వరకు క్యూ కట్టారు. వీరికి 30 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. కాలిబాట క్యూలలో భక్తులు కిక్కిరిశారు. క్యూల్లో స్పల్ప తోపులాట చోటు చేసుకుంది. వర్షాలు విస్తారంగా కురవాలని తిరుమలలో చేపట్టిన వరుణయాగం ఆదివారం కూడా శాస్త్రోక్తంగా కొనసాగింది.