సైక్లింగ్ సక్సెస్
తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ ఓటింగ్ శాతం పెంచుకోవడానికి కొత్త అవతారం ఎత్తింది. ఉదయం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఎవరూ రాకపోవడంతో పోలింగ్ కేంద్రా లు వెలవెలపోయాయి. ఓటర్ల అనాసక్తతను పసిగట్టిన దేశం అధినేత చంద్రబాబునాయుడు పోలింగ్ శాతం పెంచేం దుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. బయట ప్రాంతాల నుంచి జనాలను తీసుకుని వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయించారు. జీవకోన, ఎన్‌జీవో కాలనీ, ఎమ్మార్‌పల్లి, బైరాగిపట్టెడ, ఐఎస్ మహల్ వంటి ప్రాంతాల్లో సైక్లింగ్ ద్వారా ఏకపక్షంగా ఓట్లు వేయించుకున్నారు. ముఖ్యంగా వైస్‌చాన్స్‌లర్ స్థాయి అధికారుల ఓట్లను సైతం దొంగ ఓటర్లు వేయడంతో అది చూసిన వారు తెల్లబోయారు. తిరుపతిలో అందరికీ సుపరిచుతులైన డాక్టర్లు, ప్రముఖ వ్యక్తుల ఓట్లను సైతం ముందే దేశం శ్రేణులు దొంగ ఓట్ల వేయడంతో నివ్వెరపోయారు. ముఖ్యమంత్రి ఒత్తిడితో అధికార యంత్రాంగం , ఎన్నికల సిబ్బంది, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి దేశం పార్టీకి పూర్తి అనుకూలంగా వ్యవహరించారు. దగ్గరుండి వారే ఓట్లు వేయించడం గమనార్హం. కొంత మంది వ్యక్తులు నాలుగైదు ఓట్లు వేయడం గమనార్హం. దొంగ ఓట్లను వేయడం కోసం స్కూల్ విద్యార్థులను వినియోగించారు. నగరంలోని పలు బూతులను సందర్శించి పోలింగ్ సరళిని దేశం అభ్యర్థి సుగుణమ్మ పరిశీలించారు.
ధర్నాలతో దద్దరిల్లిన తిరుపతి
దొంగ ఓట్లు వేయిస్తున్నారని, అదుపు చేయించాలని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి బైరాగిపట్టెడ ప్రాంతంలోని స్కూల్‌లో పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారు చర్యలు తీసుకోకపోవడంతో ధర్నాకు ఉపక్రమించింది. ఓరియంటెల్ కాలేజీ సమీపంలో టీడీపీ యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడుతుందని, రీపోలింగ్ జరపాలంటూ కాంగ్రెస్ అభ్యర్థితో పాటు ఇండిపెండెంట్లు బైఠాయించారు. ఎన్‌జీవో కాలనీలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి కళ్లకు గంతలు కట్టుకుని నోరు మూసుకుని ధర్నాకు దిగింది. దీని కి ప్రతిగా అదే పోలింగ్ బూత్ వద్ద టీఎన్‌టీయూసీ జిల్లా కార్యదర్శి అంబూరి సింధూజ కాంగ్రెస్ అభ్యర్థిని బయటకు పంపించపోతే మేం కూడా ఇక్కడ నుంచి వెళ్ళమని ధర్నాకు దిగారు. మాజీ మంత్రి గల్లా అరుణ పోలింగ్ కేంద్రాల వద్ద హల్‌చల్ చేశారు. దొంగ ఓట్లును వేసి వెళుతున్న వారిని అడ్డుకుని ఎస్వీ మెడికల్ కాలేజీ సమీపంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్నా చేశారు. బస్సులోని వారు సైతం మేము ఓట్లు వేశామని చెబుతున్నా పక్కనున్న ఏఎస్పీ పట్టించుకోకపోవడం గమనార్హం. బస్సును సీజ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరినా పోలీసులు పట్టించుకోలేదు. ముఖ్యంగా నగరి, రేణిగుంట, అద్దగిరి ప్రాంతాల నుంచి జనాలను తరలించి దొంగ ఓట్లను వేయించారు. అశోక్‌నగర్ ప్రాంతాల్లో పాండిచ్చేరి నుంచి దాదాపు 20 మంది వ్యక్తులను తెప్పించి ఓట్లు వేయించడం గమనార్హం. మొత్తం మీద పోలింగ్ 49.92 శాతం అంటే 1,47,153 పోలైనా ఎక్కువ శాతం టీడీపీ కార్యకర్తలు వేసినవే ఉంటాయని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశం పార్టీ అన్ని అవకాశాలను వినియోగించుకుని పోలింగ్ శాతం పెంచుకోవడంలో విజయవంతమైంది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష పోలింగ్‌ను నిలువరించలేక చతికలపడింది.
టీడీపీ నగర అధ్యక్షుడి ధర్నా
కాంగ్రెస్ పార్టీ ఓటర్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుందంటూ అభ్యర్థి వెళ్లిన ప్రతి చోటా అధికారులతో పోలీసులతో వాగ్వివాదాలకు దిగుతూ ఏజెంట్లును భయభ్రాంతులు చేస్తుందని నిరసనగా ఖాదీ కాలనీ సర్కిల్ టీడీపీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ తన అనుచరులతో రోడ్డు పై బైఠాయించారు. దాదాపు గంటపాటు రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఇక్కడ కూడా పోలీసులు ఏమాత్రం స్పందించకుండా ప్రేక్షకపాత్ర వహించారు.