రుణమాఫీ జరిగేవరకూ పోరాటం : సీపీఐ | Runamaphi jarigevara fight: CPI | Sakshi
Sakshi News home page

రుణమాఫీ జరిగేవరకూ పోరాటం : సీపీఐ

Published Tue, Jul 22 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

Runamaphi jarigevara fight: CPI

తిరుపతి కల్చరల్:  ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన  రుణ మాఫీ హామీ జరిగే వరకూ రాజీలేని పోరాటం చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ పీజే.చంద్రశేఖర్ పిలుపు నిచ్చారు. బైరాగిపట్టెడలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చారన్నారు.

రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల పంట రుణాలుండగా, ఒక్కొక్క రైతు రెండు, మూడు రుణాలు తీసుకున్న సంఘటనలున్నాయని తెలిపారు. అయితే బంగారు, సాధారణ, వ్యవసాయ రుణాలకు లేనిపోని నిబంధనలు పెడుతున్నాడని విమర్శించారు. కేవలం రూ.25 వేల కోట్లకు మాత్రమే రీషెడ్యూల్‌కు ప్రయత్నించడం దారుణమన్నారు. వ్యవసాయపరంగా సుమారు 45 శాతం మంది కౌలు రైతులుండగా, రుణమాఫీ అంశం వారికి ఉపయోగపడే విధంగా లేదన్నారు. కేవలం పొలం యజమానులకు మాత్రమే ఈ రుణమాఫీ పథకం వర్తించే అవకాశాలున్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఇటు రైతు సంఘాలు, అటు వ్యసాయ కార్మిక సంఘాలు ఒక్కటై ఐక్య ఉద్యమాలకు రూపకల్పన చేసి, రుణమాఫీ చేపట్టేందుకు రాజీలేని పోరాటాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. ప్రజా సంఘాలను వామపక్ష రాజకీయ దృక్పథంవైపు నడిపేందుకు కార్యాచరణకు పూనుకున్నట్లు తెలిపారు. ఆగస్టు 11న సీఆర్ శతజయంతి ఉత్సవాల ముగింపు సమావేశం సందర్భంగా వేలాది మందితో హైదరాబాద్‌లో బహిరంగ సభ, రెడ్‌షర్ట్ వలంటీర్ల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

చిత్తూరు జిల్లా నుంచి 500 మంది సీపీఐ కార్యకర్తలు, ప్రజలు, వంద రెడ్‌షర్ట్ వలంటీర్లు తరలిరావాలని పిలుపు నిచ్చారు.  అనంతరం జిల్లా కార్యదర్శి రామానాయుడు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. ఆగస్టు 1, 2, 3 తేదీల్లో వరదయ్యపాళెంలో రాజకీయ శిక్షణ, రాష్ట్ర స్థాయి శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు, సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement