వేగంగా జరుతున్నగరుడ వారధి పనులు
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గరుడ వారధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాత్రింబవళ్లు పనిచేస్తూ, పైవంతెన (ఫ్లైఓవర్)ను సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, స్మార్ట్ సిటీ కమిటీ, ఆప్కాన్ సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి. తిరుచానూరు మార్కెట్ యార్డు నుంచి కపిలతీర్థం (నంది సర్కిల్) వరకు 6.7 కిలోమీటర్ల పరిధిలో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు.
సాక్షి, తిరుపతి తుడా : తిరుపతి నగర చరిత్రలోనే భారీ ప్రాజెక్టుగా ఎలివేటెడ్ స్మార్ట్ కారిడార్ (గరుడ వారధి) పట్టాలెక్కింది. ఈ ప్రాజెక్టును 2021 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. గడువు లోగా పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. రూ.684 కోట్ల అంచనాల వ్యయంతో ఈ ఏడాది మార్చి 5వ తేదీన ప్రారంభం అయిన ఈ ప్రాజెక్టు పనులు ఆది నుంచి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. అయితే సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం గరుడ వారధి పనులు జరుగుతున్న రోడ్డు పూర్తిగా టీటీడీ పరిధి కావడంతో 67 శాతం నిధులను ఖర్చు చేసేందుకు టీటీడీ ముందుకొచ్చింది. మిగిలిన 33 శాతం నిధులను స్మార్ట్ సిటీ సమకూరుస్తోంది.
భారీ యంత్రాలు
గరుడ వారధి పనులను సకాలంలో పూర్తిచేసేందుకు భారీ యంత్రాలను వినియోగిస్తున్నారు. గతంలో ఒక డ్రిల్లింగ్ యంత్రం పనిచేస్తుండగా ప్రస్తుతం అదనంగా మరో భారీ డ్రిల్లింగ్ యంత్రాన్ని తెప్పించారు. ఇప్పటికీ తిరుచానూరు మార్కెట్ యార్డు నుంచి రామానుజ సర్కిల్ వరకు 31 భారీ పిల్లర్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం లీలామహల్ సర్కిల్ నుంచి అలిపిరి పోలీస్టేషన్ వరకు బేస్ మట్టానికి పిల్లర్లు నిర్మిస్తున్నారు. లీలామహల్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు పిల్లర్లు వేసేందుకు భారీ డ్రిల్లింగ్ యంత్రాల ద్వారా పనులు చేపడుతున్నారు.
రాత్రింబవళ్లు సాగుతున్న పనులు
గరుడ వారధి మార్గంలో ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని పనులను రాత్రింబవళ్లు చేపడుతున్నారు. నిత్యం తిరుచానూరు నుంచి ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్, కపిలతీర్థం మీదుగా తిరుమలకు విఐపీల రాకపోకలు ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైన ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆప్కాన్ సంస్థ సిబ్బంది రాత్రి సమయంలోనూ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందుకోసం 2 భారీ డ్రిల్లింగ్ మిషన్లు, 6 భారీ ప్రొక్లెయిన్లు, 8 జేసీబీలు, 10 టిప్పర్లు, 12 ట్రాక్టర్లు, 4 కాంక్రీట్ మిక్చర్లను వినయోగిస్తున్నారు. పిల్లర్లపై ఏర్పాటు చేసే క్యాస్టింగ్ సెగ్మెంట్ నిర్మాణ పనులను జాతీయ రహదారి సమీపంలోని 18 ఎకరాల ఖాళీ స్థలంలో చేపడుతున్నారు. మొత్తం 680 సెగ్మెంట్లు సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 76 సెగ్మెంట్‌లను పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. ఇక్కడే నిర్మాణాలకు కావాల్సిన టన్నుల కొద్దీ ఐరెన్, గుల్ల, ఇసుక తదితర ముఖ్యమైన వస్తువులను సిద్ధం చేసుకున్నారు.
సకాలంలో గరుడ వారధిని తీసుకొస్తాం
తిరుపతి పుణ్యక్షేత్రంలో గరుడ వారధి నిర్మాణాన్ని సకాలంలో అందుబాటులోకి తీసుకొస్తాం. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తాం. గరుడ వారధి నిర్మాణం జరుగుతున్న మార్గం యాత్రికులు, స్థానికులతో నిత్యం రద్దీగా ఉంటోంది. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకే ఈ గరుడ వారధిని నిర్మిస్తున్నాం. ఇది పూర్తయితే యాత్రికులు, శ్రీవారి భక్తులు సులువుగా అలిపిరి మార్గం నుంచి తిరుమలకు చేరుకోవచ్చు. నగర ప్రజల సౌకర్యం కోసం నిర్మిస్తున్న గరుడ వారధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– పీఎస్ గిరిషా, కమిషనర్, తిరుపతి నగరపాలక సంస్థ
Comments
Please login to add a commentAdd a comment