మరో మోసం! | To deprive the unemployed, chief Chandrababu | Sakshi
Sakshi News home page

మరో మోసం!

Published Tue, Jan 5 2016 12:43 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

మరో మోసం! - Sakshi

మరో మోసం!

నిరుద్యోగులను వంచించిన సీఎం చంద్రబాబు
నాడు ఉద్యోగాలు అన్నారు....శిక్షణ ఇచ్చారు
నెలలు గడుస్తున్నా పిలుపూ లేదు...కొలువూ లేదు
ఘొల్లుమంటున్న రాజధాని ప్రాంత యువతీయువకులు

 
గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు హామీలకు రైతులు, రైతు కూలీలే కాదు నిరుద్యోగ యువకులు కూడా బోల్తా పడ్డారు. భూ సమీకరణ సమయంలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతు కుటుంబాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం తెలిసిన కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. అయితే ఆ కుటుంబాల్లోని నిరుద్యోగ యువతీ యువకులు సీఎం మాటల గారడీకి పడిపోయారు. భూములు ఇప్పించేందుకు తల్లిదండ్రులు అంగీకరించే విధంగా చేశారు. కొందరు యువకులైతే తల్లిదండ్రులను బెదిరించారు కూడా. భూములు ఇస్తే, దానికి ప్రతిఫలంగా నివేశన స్థలం, ఐదు సంవత్సరాల పాటు కౌలు చెక్కులు, తమకు మంచి  ఉద్యోగాలు  వస్తాయని, ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఎందుకు భూములు ఇవ్వరని తల్లిదండ్రులను కొందరు యువకులు నిలదీశారు. వీరి ఒత్తిడికి తలొగ్గి  భూములు ఇస్తే, తీరా భూములకు తగిన విధంగా సొంత గ్రామంలో స్థలం ఇవ్వడం లేదు. నిరుద్యోగులకు శిక్షణ కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీ నెరవేరకపోవడంతో యువతీ యువకులు ఆందోళన చెందుతున్నారు. సుక్షేత్రమైన మాగాణి ఉండి ఉంటే వ్యవసాయం అయినా చేసుకునే వారమని, లేకుంటే అమ్ముకుని వ్యాపారం అయినా చేసుకునే వారమని, బాబును నమ్మి నట్టేట మునిగి పోయాయని, తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
ఉన్న ఉద్యోగాలు వదిలి ....
 భూ సమీకరణకు ముందు రాజధాని గ్రామాల్లోని యువతీయువకులు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు. సుమారు 110 మంది వరకు బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులకు సీఆర్‌డీఏ పరిధిలో ఉద్యోగాలు ఇస్తామని, ముందుగా వారికి మంచి శిక్షణ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఇతర ప్రాంతాల్లో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జీతాలు తీసుకుంటున్న వారు ఆ ఉద్యోగాలకు రాజీనామా చేసి స్వగ్రామాలకు చేరుకున్నారు.  వీరందరికీ ప్రభుత్వం ఐదునెలల క్రితం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో  శిక్షణ ఇచ్చింది. వర్సిటీ హాస్టల్‌లో ఉంటున్న ఈ నిరుద్యోగులను విద్యార్థిని రిషితేశ్వరీ కేసు నేపథ్యంలో అక్కడి నుంచి పంపి వేశారు. ఇంటికి చేరుకుని రెండు నెలలు గడిచినా అధికారుల నుంచి పిలుపు రావడం లేదు. చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదిలి, స్వగ్రామానికి వచ్చిన వీరికి ఇక్కడా ప్రభుత్వం ఉపాధి కల్పించకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర మానసిక వ్యధకు గురవుతున్నారు.

ఉపాధి అవకాశాల కోసం సీఆర్‌డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులను కలిసి తమ గోడు వినిపించుకుంటున్నారు. అయినా సమస్య కొలిక్కి రావడంలేదు. మూడు రోజుల క్రితం సీఆర్‌డీఏ స్కిల్ డెవలప్‌మెంట్ డెరైక్టర్ జయదీప్‌ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. అయితే శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలంటే కనీసం రెండేళ్లు  పడుతుందని అధికారుల కథనం. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు స్థాపించకుండా ఉపాధి కల్పించే అవకాశాలు లేవని చెబుతున్నారు. అలాగే డిగ్రీ, పీజీ చేసిన నిరుద్యోగులు నాలుగు వేల మంది వరకు ఉంటే వారి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. దీంతో నిరుద్యోగులు  ఉపాధి కోసం మళ్లీ ఇతర నగరాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.
 
ఉద్యోగం రాలేదు..
సీఎం చంద్రబాబు మా  ఊరిలో ఉద్యోగం ఇస్తామన్నారు. ఎంతో ఆశపడ్డాను. వారు ఇచ్చిన శిక్షణ తీసుకున్నాను. మొదట సీఆర్‌డీఏలోనే ఉద్యోగం ఇస్తామని చెప్పారు.  ఉద్యోగం మాత్రం రాలేదు.
 - బండి రోశయ్య, అబ్బురాజుపాలెం
 
ఆశ పడ్డాం ...

రాజధానిలోనే ఉద్యోగం అంటే ఎంతో ఆశపడ్డాం. సొంత ఊరిలోనే ఉద్యోగం కల్పిస్తామని సంబరపడ్డాం. వారు చెప్పిన విధంగా శిక్షణ తీసుకున్నాం. రెండునెలలుగా ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నాం.
 - మేకల దివ్య, తుళ్ళూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement