ఉపకారం | to Intermediate students relaxation of the aadhaar rules with students protests | Sakshi
Sakshi News home page

ఉపకారం

Published Thu, Jan 23 2014 5:11 AM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM

to Intermediate students relaxation of the aadhaar rules with students protests

ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విద్యార్థుల పాలిట శాపంలా పరిణమిస్తోంది. ప్రభుత్వం రోజుకో నిబంధన మారుస్తూ ఉన్నపళంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉపకార వేతనాలందక ఆందోళనకు గురవుతున్నారు. విద్యా సంవత్సరం ముగింపు దశకు వస్తున్నా..ప్రభుత్వం వీటిని మంజూరు చేయకపోవడం, కొత్త విధానాలు ప్రవేశపెడుతుండటంతో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తూ విద్యార్థులను ఇక్కట్లపాలు చేస్తున్నాయి.

  ఆధార్‌తో పాటు బయోమెట్రిక్ పరికరాలు వినియోగించుకోని విద్యార్థుల హాజరు నమోదు చేయాలని, వాటి ఆధారంగానే దరఖాస్తులు పంపాలని కళాశాలలను ఆదేశించడంతో వేలాది దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. విద్యార్థుల దరఖాస్తుల మీద  బార్‌కోడ్ ఉంటుంది. దాన్ని బార్‌కోడ్ స్కానర్ ఎదుట స్వైప్ చేస్తే వారి వివరాలు ప్రత్యక్షమవుతాయి. అన్ని ధ్రువపత్రాలు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకొని బార్‌కోడ్‌ను స్వైప్ చేసి పంపించాలి. వేలాది మంది విద్యార్థుల దరఖాస్తులపై ఉన్న బార్‌కోడ్‌ను స్వైప్ చేసేందుకు చాలా సమయం పడుతుంది.

విద్యా సంవత్సరంలో మిగిలి ఉంది రెండు నెలలే కావడంతో కోర్సు పూర్తయ్యే లోపు విద్యార్థులకు ఉపకార వేతనం అందే పరిస్థితి లేదు. జిల్లాలో 490 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కళాశాలలున్నాయి. వీటిలో 160 వరకూ ఇంటర్మీడియెట్ కాలేజీలున్నాయి. జిల్లాలోని 60 శాతానికి పైగా కళాశాలల్లో ఇంత వరకు బయోమెట్రిక్ యంత్రాలను యాజమాన్యాలు ఏర్పాటు చేయలేదు. ఎప్పుడు ఏర్పాటు చేస్తారో కూడా తెలియదు. దీంతో వేలాది మంది విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు సమర్పించలేక ఉపకార వేతనాలకు దూరం కానున్నారు.

  జిల్లాలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు 11,163 మంది ఉండగా వీరిలో రెన్యువల్‌కు 10,558 మంది, నూతనంగా 7300 మంది దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్డ్ తెగలకు చెందిన 1351 మంది విద్యార్థులుండగా 1294 మంది రెన్యువల్‌కు, నూతనంగా 9,444 మంది దరఖాస్తు చేసుకున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన 15,015 మంది విద్యార్థులుండగా 13,575 మంది రెన్యువల్‌కు, నూతనంగా 5,774 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారు 12,495 మంది ఉండగా 11,125 మంది రెన్యువల్‌కు, 2,927 మంది నూతనంగా దరఖాస్తు చేసుకున్నారు. అల్ప సంఖ్యాకవర్గాలకు చెందిన 4814 మంది విద్యార్థులుండగా 4,300 మంది రెన్యువల్‌కు, నూతనంగా 367 మంది దరఖాస్తు చేసుకున్నారు.

 రోజుకో నిబంధన:
 బోగస్ లబ్ధిదారులను అరికడుతూ ఉపకార వేతనాలు, రుసుం రాయితీలను అర్హులైన వారికి అందజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రెండేళ్ల క్రితం విద్యార్థులను గుర్తించేందుకు సొంత శాఖలతో పాటు, ఇతర శాఖల అధికారులను ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. వారు ఒక్కో రోజు, ఒక్కో విద్యా సంస్థను సందర్శించి అతను వాస్తవ విద్యార్థా, కాదా అని పరిశీలించాలి. ఉపకార వేతనాలు పొందగోరు విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాల సంఖ్య అధికారులకు అందజేయడం, వాటిని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయడంలో జాప్యం చోటుచేసుకుంటోంది.

అనేక మంది విద్యార్థులకు ఆధార్ కార్డుల్లేవు. కార్డుల మంజూరుకు ఆధార్ శిబిరాలను ఏర్పాటు చేస్తామన్న అధికారులు పత్తాలేరు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో నెల రోజుల సమయం పడుతుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్న 79,739 మంది విద్యార్థుల వేలిముద్రలు సేకరించి పూర్తి వివరాలు పంపేందుకు మరో రెండు నెలలు పడుతుంది.  

 ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం
 సగం మంది విద్యార్థులకు పైగా ఆధార్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వం ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఆధార్ లేకపోయినా పర్వాలేదు అనే నిబంధనను జనవరి 21న సడలించింది. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని సంక్షేమ అధికారులకు ఉత్తర్వులందాయి.

 ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన విద్యా సంవత్సరం చివరికి కూడా విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందేలా లేవు. సకాలంలో ఉపకార వేతనాలు అందకపోతే వీటిపై ఆధారపడి చదువులు సాగించే వేలాది మంది విద్యార్థులు తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే పరిస్థితి. ప్రభుత్వం స్పందించి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని అధికారులు సైతం కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement