పునరావాస కార్యక్రమాలు వేగవంతం
కొరిటెపాడు(గుంటూరు)
పులిచింతల ప్రాజెక్టు ముంపునకు గురయ్యే గ్రామాలలో సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం డీఆర్సీ సమావేశ మందిరంలో పునరావాస కేంద్రాలలో జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. పులిచింతల ప్రాజెక్ట్‌లో నీరు నిల్వ చేసినప్పుడు ముంపునకు గురయ్యే గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపట్టాలని జేసీ సూచించారు. చౌటపాపాయపాలెంలో తాగునీటి సమస్య ఉందని, అక్కడే ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అదనంగా బోర్లు కావాలంటే వేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. వీధిదీపాల నిర్వహణ సక్రమంగా చేట్టాలని, అవసరమైన శ్మశాన స్థలాలను గుర్తించాలని సూచించారు. కరాలపాడు ఒకటి నుంచి 11 అప్రౌచ్ రోడ్డుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. ప్రత్యేక కలెక్టర్, మండల అభివృద్ధి అధికారులు, తహశీల్దార్లు, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీ కార్యదర్శులు పునరావాస కేంద్రాలను పర్యవేక్షించి, అక్కడ చేపట్టవలసిని పనులను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సహాయ పునరవాస కేంద్రాల లే అవుట్లను ఆయన పరిశీలించారు. కొండమోడు, రెడ్డిగూడెం, రాజుపాలెం, మాచాయపాలెంలలో ఉన్న సమస్యలను అడిగి తెల్సుకున్నారు. బెల్లంకొండ, రాజుపాలెం పునరావాస కేంద్రాల్లో మైనార్టీలు ఎక్కువగా ఉన్నారని, అర్హత కల్గినవారికి బ్యాంకర్ల ద్వారా రుణాలు అందించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మాచవరం, దాచేపల్లి, బెల్లంకొండ, రాజుపాలెం, ఆర్‌అండ్‌ఆర్ కేంద్రాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గుర్తించిన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా కార్యాచరణ ప్రణాళికలు తయారుచేసి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. అలసత్వం చూపినట్లైతే సహించేదిలేదని హెచ్చరించారు. ఏఒక్కరినీ వదిలిపెట్టకుండా అందరికీ జీవనస్థితిగతులు మెరుగుపరిచేలా సహాయ సహకారాలు అందించాలన్నారు. కేంద్రాల్లో రోడ్లు, పాఠశాల, అంగన్‌వాడీ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల భవన నిర్మాణాలు, ఎలక్ట్రిక్ పోల్స్, సర్వీసు మీటర్లు, ఉపాధి కల్పన, దేవాలయాలు, పాఠశాలల తరలింపు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డ్వామా ప్రాజెక్ట్ డెరైక్టర్ ఢిల్లీరావు, గురజాల ఆర్డీవో మురళి, జిల్లా పంచాయతీ అధికారి గ్లోరియా, డీఈవో ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.