జిల్లావ్యాప్తంగా 20 వేల ఎకరాల చెరువు స్థలాలు కబ్జా
పట్టణ ప్రాంతాల్లోనూ విలువైన భూముల ఆక్రమణ
{పతి చెరువులో 15 నుంచి 20 ఎకరాలు కబ్జా
కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణం, రియల్ వ్యాపారం
మరికొన్ని చోట్ల బోర్లు వేసి పంటల సాగు
మితిమీరిన అధికార పార్టీ నేతల ఆగడాలు
చిత్తూరు: అధికార పార్టీ నేతల చూపు చెరువులపై పడింది. జిల్లాలో చెరువు స్థలాలను వారు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుంగనూ రు, కుప్పం పట్టణ ప్రాంతాల్లో విలువైన విలువైన స్థలాలను అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఆక్రమించారు. ఈ ఆక్రమణల పర్వంలో ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఉన్నారు. ఆక్రమిత స్థలాల్లో కొందరు రియల్ వ్యాపారాలు చేస్తుండగా, మరికొందరు ఏకంగా ఇళ్లే నిర్మించి, విక్రయించి, కోట్లు దండుకుంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించిన కొందరు నేతలు బోర్లు వేసి పంటలు సైతం సాగు చేస్తున్నారు.
తిరుపతి పరిధిలో ఆక్రమణల వివా దం మరింత ముదిరింది. తాజాగా అధికార పార్టీ ప్రజాప్రతినిధి, బంధువులు కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఆక్రమించడంపై పెద్ద వివాదమే రేగింది. అంతకుముందు చిన్నగొట్టిగల్లు చెరువులో స్థానిక అధికార పార్టీ నేత 20 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి సాగు చేశా డు. ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నించిన తహశీల్దార్ నారాయణమ్మపై ఏకంగా దాడికే ప్రయత్నించాడు. ఇదే మండలంలో 70 ఎకరాలకు పైగా చెరువు స్థలా లు ఆక్రమణకు గురైనట్లు తహశీల్దార్ నారాయణమ్మ అప్పట్లో ప్రకటించారు.
తిరుపతి రూరల్ మండలంలోని ఓటేరు చెరువు 18 ఎకరాల విలువైన స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఓ నేత కబ్జా చేశాడు. దీంతోపాటు వినాయకసాగర్ చెరువు, మంగళం చెరువు, దామినీడు చెరువు రేణిగుంట పరిధిలోని వెంకటాపురం, కరకంబాడి చెరువు లు సైతం పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలోని చెరువుల్లో 90 శాతం చెరువులు ఆక్రమణకు గురయ్యాయి.
జిల్లాలో పంచాయతీరాజ్, చిన్ననీటి పారుదల శాఖల పరిధిలో 8,063 చెరువులున్నాయి. వీటిలో 100 ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చెరువులు 7,395, నూరు ఎకరాల ఆయకట్టుకు మించి ఉన్న చెరువులు 668 ఉన్నాయి. వీటి పరిధిలో 3.03 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక్కొక్క చెరువులో 15 నుంచి 20 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లోని చెరువుల్లో 60 శాతానికి పైగా కబ్జా అయినట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా చెరువుల పరిధిలో 20వేల ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్లు నీటిపారుదల, రెవెన్యూ అధికారులు చెబుతున్నా వాస్తవానికి ఈలెక్క మరింత ఎక్కువగా ఉంది. కొందరు రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతలకు సహకరిస్తూ లక్షల్లో దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. చెరువుల ఆక్రమణలు తొలగించి, సరిహద్దులను ఏర్పాటు చేసి, ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది అమలు కాలేదు. జిల్లావ్యాప్తంగా 8,063 చెరువులుండగా కేవలం 300 చెరువులు మాత్రమే సర్వే చేసినట్లు అధికారులు చెప్పడం చూస్తే ఆక్రమణల తొలగింపులో వారి చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే బోధపడుతుంది.
చిత్తూరులో గంగినేని చెరువు, కట్టమంచి చెరువు, కాజూరు చెరువుతోపాటు దాదాపు 22 చెరువులు పెద్దఎత్తున కబ్జాకు గురయ్యాయి.
గిరింపేట గంగినేని చెరువులో 4.5 ఎకరాలు, అన్పుపల్లె పెద్ద చెరువు 8 ఎకరాలు, కట్టమంచి చెరువు 2 ఎకరాలు. మురకంబట్టు అగ్రహారం చెరువు 4 ఎకరాలు, నరిగిపల్లె పెద్ద చెరువు 4.8 ఎకరాలు, తేనెబండలోని కొత్త చెరువు పరిధిలో 4 ఎకరా లు కబ్జా అయ్యింది. మొత్తంగా నగర పరిధిలోని 22 చెరువల పరిధిలో దాదాపు 70 ఎకరాలకు పైగా చెరువు స్థలాలు ఆక్రమణలకు గురైనట్లు రెవెన్యూ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
చెరువులనూ మింగేశారు
Published Sat, Nov 7 2015 2:08 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement