చెరువులను చెరబట్టారు
జిల్లాలోని చెరువులను అధికార పార్టీ నేతలు చెరబట్టారు. ప్రభుత్వ భూములు అయిపోయాయేమో.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులను పోటీలుపడి ఆక్రమిస్తున్నారు. వాటిల్లో బోర్లువేసి, మోటార్లు బిగించి పంటలు సాగుచేస్తున్నారు. అధికారులు సైతం వారిని అడ్డుకునేందుకు సాహసించలేకపోతున్నారు.
- శ్రుతిమించుతున్న అధికార పార్టీ నేతల ఆగడాలు
- బోర్లు వేసి పంటలు సాగుచేస్తున్న వైనం
- జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో 5వేల ఎకరాల ఆక్రమణ
సాక్షి,చిత్తూరు : జిల్లాలో ఆక్రమణల పరంపర కొనసాగుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. చిన్నగొట్టిగల్లు మండలంలోనే 72 ఎకరాల చెరువు భూములు ఆక్రమణలకు గురయ్యాయని తహశీల్దార్ నారాయణమ్మ చెప్పడం చూస్తే ఆక్రమణలు ఏ స్థాయిలో జరిగాయో తెలుస్తోంది. ఒక్క చిన్నగొట్టిగల్లు చెరువులోనే అధికార పార్టీ నేతలు 15 ఎకరాల భూమిని ఆక్రమించి సాగుచేస్తున్నారు. ఆక్రమణలను తొలగించేందుకు పూనుకుంటే అధికారపార్టీ నేతలు దాడులకు దిగుతున్నారని, ఇటాంటి పరిస్థితిలో ఉద్యోగాలు చేయడమే కష్టంగా ఉందని తహశీల్దార్ నారాయణమ్మ శనివారం కలెక్టరేట్ వద్ద విలేకరులతో వాపోయారు. జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ నేతలది ఇదే తీరు.
జిల్లాలో పంచాయతీరాజ్, చిన్ననీటి పారుదల శాఖల పరిధిలో 8,083 చెరువులున్నాయి. వీటిలో వంద ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చెరువులు 7,395 ఉండగా, వంద ఎకరాల పైబడి ఆయకట్టు ఉన్న చెరువులు 683 ఉన్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, చిత్తూరు, చంద్రగిరి, పూతలపట్టు, జీడీనెల్లూరుతోపాటు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో చెరువులు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. 66 మండలాల పరిధిలో 5 వేల ఎకరాలకు పైనే ఆక్రమణకు గురయ్యాయి.
కొన్ని ప్రాంతాల్లో ఆక్రమిత చెరువుల్లో పంటలు సాగు చేస్తుండగా తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, మదనపల్లె తదితర నగర, పట్టణ ప్రాంతాల చెరువులను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. కొందరు రెవెన్యూ అధికారులు సైతం అధికారపార్టీ నేతలకు సహకరిస్తూ లక్షల్లో దండుకంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలోని అన్ని చెరువుల ఆక్రమణలు తొలగించి ఆధునికీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో అమలుకు నోచుకోలేదు. ఏ ఒక్క చెరువులోనూ ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు ముందుకు రాలేదు. మరోవైపు చెరువుల ఆధునికీకరణ ముందుకు సాగలేదు. వేసవి ప్రారంభం నుంచే పనులు మొదలు పెట్టి చేయా ల్సి ఉన్నా, వేసవి ముగింపు సమయంలో 3,715 చెరువులు, చిన్న కుంటల్లో మాత్రమే అధికారులు పనులు చేపట్టడంపై విమర్శలు ఉన్నాయి.
ఇప్పటికీ 60 శాతానికి పైగా చెరువుల్లో పనులు మొదలు కాలేదు. ఆధునికీకరణ పనులు పూర్తికాకపోతే చెరువుల్లో వాననీరు పూర్తి స్థాయిలో నిలిచే పరిస్థితి ఉండదు. అదే జరిగితే రైతులకు వ్యవసాయ పనులకేకాక భూగర్భ జలాల పెరుగుదలకూ నష్టమే. జిల్లా వ్యాప్తంగా దాదాపు 90 శాతానికి పైగా చెరువుల కట్టలు, తూములు, పంటకాలువలు ఇప్పటికే దెబ్బతిన్నాయి.