హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు, హెచ్‌ఎండీఏ కమిషనర్‌పై లోకాయుక్త ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘‘నగరం (హైదరాబాద్) నడిబొడ్డున ఉండే నాగమయ్య కుంట, బతుకుమ్మ కుంట ఏమయ్యాయి? మంచినీటిని అందించే దుర్గం చెరువు చుట్టూ అక్రమ కట్టాడాలు ఎలా వెలిశాయి? నగరంలోని కుంటలన్నీ కబ్జాలతో కనుమరుగవుతున్నా... కళ్ల ముందే కబ్జాలు జరుగుతున్నా చర్యలు చేపట్టరా?’’ అంటూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, హెచ్‌ఎండీఏ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెచ్‌ఎండీఏ పరిధిలోని కుంటలు, చెరువులు కబ్జాకు గురవుతున్నాయంటూ చెరువుల పరిరక్షణ సమితి, సోల్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. వాదనల సందర్భంగా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి స్పందిస్తూ తాను తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో కబ్జాదారులపై గూండా, బూట్‌లెగ్గర్ యాక్టుల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించానని, తన ఆదేశాలకు అనుగుణంగా దాదాపు 4 వేల కేసులు నమోదు చేసి కబ్జాలను అక్కడి ప్రభుత్వం నియంత్రించిందన్నారు.
ఇక్కడ ఆ తరహా కేసులు ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఏం చేస్తోందని నిలదీశారు. కిందిస్థాయి నుంచి మంచి అధికార యంత్రాంగంతో కూడిన నెట్‌వర్క్ ఉన్నా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతో కబ్జాలను నియంత్రించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇప్పటికే చెరువులు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిన వారి జాబితాను సమర్పించడంతోపాటు చెరువులు, కుంటల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పూర్తిస్థాయి నీటి మట్టానికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను రూపొందించి హెచ్‌ఎండీఏకు అందజేయాలని హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లకు సూచించారు.
చెరువుల కబ్జాదారులపై చర్యలేవీ?
Published Sun, Mar 6 2016 1:57 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement