HMDA Commissioner
-
మా ముందు హాజరై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఓ భవన నిర్మాణ అనుమతికి సంబంధించి తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదో చెప్పాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ కె.విద్యాధర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేసింది. నవంబర్ 22న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దుండిగల్ మున్సిపాలిటీలోని దొమ్మరపోచంపల్లి గ్రామంలో 40 అడుగుల వెడల్పుతో లోపలి రహదారికి ఆనుకొని నిర్మిస్తున్న భవన నిర్మాణ అనుమతులను పునః పరిశీలించాలని గతంలో కోర్టు ఆదేశించినా అధికారులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదంటూ అక్షయ డెవలపర్స్ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. తదుపరి విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
‘జనార్దన్‌రెడ్డి బదిలీ సందేహాలకు తావిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆకస్మిక బదిలీ అనేక అనుమానాలు, సందేహాలకు తావిస్తోం దని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ గౌతమ్‌కుమార్‌ను, ఇప్పుడు జనార్దన్‌రెడ్డిని అదే తరహాలో బదిలీ చేయడం సరికాదన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసే అధికారులను ప్రభు త్వం బదిలీ చేయడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. -
కమిషనర్ జనార్ధన్‌రెడ్డిపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్ : హెచ్ఎండీఏ కమిషనర్ బి. జనార్ధన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. సోమవారం ఉదయం జనార్ధన్‌రెడ్డిని హెచ్ఎండీఏ కమిషనర్ బాధ్యతలనుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోస్టింగ్ ఇవ్వకుండా ప్రస్తుతానికి వెయిటింగ్లో పెట్టింది ప్రభుత్వం. హెచ్ఎండీఏ కమిషనర్‌గా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. విదేశీ పర్యటనలో ఉండగానే జనార్ధన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని జనార్ధన్ రెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది. -
మనకూ హైటెక్ బస్టాండ్
‘ఐసీబీటీ’కి లైన్ క్లియర్ - మియాపూర్‌లో 50 ఎకరాల్లో అంతర్జాతీయ హంగులతో ఏర్పాటు - ప్రయాణ సౌకర్యాలతో పాటు వినోదం, షాపింగ్ - సుప్రీం రీకాల్, అడ్వకేట్ జనరల్ గ్రీన్‌సిగ్నల్‌తో హెచ్ఎండీఏ పనుల్లో వేగం సాక్షి, హైదరాబాద్: బాలారిష్టాలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రతిష్టాత్మకమైన ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ ప్రాజెక్ట్ (ఐసీబీటీ) పనులు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. 2011లో ప్రారంభం కావల్సిన ఈ ప్రాజెక్టు పనులను దక్కించుకున్న కేఆర్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ ఇన్‌కమ్‌ట్యాక్స్ సమస్యలతో కొన్ని నెలలు ఆలస్యం కాగా, అంతలోనే ఐసీబీటీ ప్రాజెక్టు పనులు చేయాలనుకున్న మియాపూర్ విలేజ్ సర్వే నంబర్ 20 (పీ), 28లోని 55 ఎకరాల భూమి విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో మరింత ఆలస్యమైంది. ఈ భూమిని అమ్మేందుకు వీల్లేదని, ఇప్పటికే భవనాలు కట్టామని మరికొంత మంది ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో అంతకుముందు అమ్ముకోవ చ్చంటూ సుప్రీం ఇచ్చిన ఆదేశాలను రీకాల్ చేసింది. దీంతో ఐసీబీటీ ప్రాజెక్టు పనులకు మార్గం సుగమమైంది. ‘మియాపూర్ సర్వే నంబర్ 20, 28 నిజాం కాలంలో జాగీర్లకు చెందినది. అయితే 1358 ఎఫ్ జాగీర్ రద్దు చట్టం ప్రకారం ఆ భూములు ప్రభుత్వానికి బదలాయింపు అయ్యాయి. జాగీర్ వారసులకు కమ్యూటేషన్ కూడా చెల్లించింది. మియాపూర్‌లో ఐసీబీటీ పనులు నిరభ్యంతరంగా చేపట్టవచ్చ’ని హెచ్ఎండీఏ రాసిన లేఖకు అడ్వొకేట్ జనరల్ సమాధానమిచ్చారు. మియాపూరే ఎందుకంటే... ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరానికి వందలాది ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. దీనికితోడు సిటీ బస్సులు కూడా వేలల్లో ట్రిప్పులు తిరుగుతుండటంతో నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికమయింది. ఎంజీబీఎస్‌లో రోజురోజుకు బస్సుల తాకిడి పెరిగిపోతుండటంతో... ప్రత్యామ్నాయంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సులు హాల్ట్ చేసేందుకు శివారు ప్రాంతంలోనే ఓ భారీ బస్టాండ్‌ను నిర్మించాలని 2011లో అప్పటి ప్రభుత్వం ఆలోచించింది. ఇందుకనుగుణంగా మియా పూర్లో 55 ఎకరాల విస్తీర్ణంలో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ ప్రాజెక్ట్ పనులను చేపట్టాలని నిర్ణయించింది. జాతీయ రహదారికి దగ్గర కావడం, అవుటర్ రింగ్ రోడ్డు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఏ ప్రాంతం నుంచైనా బస్సులు వచ్చివెళ్లే అవకాశం కలుగుతుంది. అలాగే... అక్కడి నుంచి ప్రయాణికులు నగరంలోకి వచ్చి వెళ్లేందుకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయన్న ఆలోచనతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. షాపింగ్ చేయొచ్చు... సినిమా చూడొచ్చు తమిళనాడులో 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఐసీబీటీని తలదన్నేలా దేశంలోనే నంబర్‌వన్‌గా మియాపూర్‌లో ఐసీబీటీని నిర్మించనున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులూ ఇక్కడ నిలపొచ్చు. వైద్యం నుంచి వినోదం వరకు అన్ని వసతులు కల్పించనున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు డార్మెటరీలు, వినోదం కోసం సినిమా థియేటర్ నిర్మించనున్నారు. ఫుడ్‌కోర్ట్స్, సెలూన్స్ ఏర్పాటు చేస్తారు. ఖాళీ సమయంలో షాపింగ్ చేసుకునేలా షాపింగ్ మాల్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు ఉండటంతో రూ.100 కోట్ల వ్యయంతో కేఆర్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ ఈ పనులు చేపడుతోంది. సగం ట్రాఫిక్ తగ్గినట్టే... ఐసీబీటీ అందు బాటులోకి వస్తే నగ రంలోకి వచ్చే దాదా పు వెయ్యి నుంచి రెండు వేల ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను నియంత్రించవచ్చు. తద్వారా బస్టాండులకు వెళ్లే ప్రయాణికుల వాహనాల రద్దీ కూడా నగరంలో తగ్గుతుంది. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ జామ్‌లు సగం వరకు తగ్గినట్టే అవుతుంది. – టి.చిరంజీవులు, హెచ్ఎండీఏ కమిషనర్ -
చెరువుల కబ్జాదారులపై చర్యలేవీ?
హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు, హెచ్ఎండీఏ కమిషనర్‌పై లోకాయుక్త ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘‘నగరం (హైదరాబాద్) నడిబొడ్డున ఉండే నాగమయ్య కుంట, బతుకుమ్మ కుంట ఏమయ్యాయి? మంచినీటిని అందించే దుర్గం చెరువు చుట్టూ అక్రమ కట్టాడాలు ఎలా వెలిశాయి? నగరంలోని కుంటలన్నీ కబ్జాలతో కనుమరుగవుతున్నా... కళ్ల ముందే కబ్జాలు జరుగుతున్నా చర్యలు చేపట్టరా?’’ అంటూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, హెచ్ఎండీఏ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలోని కుంటలు, చెరువులు కబ్జాకు గురవుతున్నాయంటూ చెరువుల పరిరక్షణ సమితి, సోల్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. వాదనల సందర్భంగా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి స్పందిస్తూ తాను తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో కబ్జాదారులపై గూండా, బూట్లెగ్గర్ యాక్టుల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించానని, తన ఆదేశాలకు అనుగుణంగా దాదాపు 4 వేల కేసులు నమోదు చేసి కబ్జాలను అక్కడి ప్రభుత్వం నియంత్రించిందన్నారు. ఇక్కడ ఆ తరహా కేసులు ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఏం చేస్తోందని నిలదీశారు. కిందిస్థాయి నుంచి మంచి అధికార యంత్రాంగంతో కూడిన నెట్వర్క్ ఉన్నా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతో కబ్జాలను నియంత్రించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే చెరువులు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిన వారి జాబితాను సమర్పించడంతోపాటు చెరువులు, కుంటల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పూర్తిస్థాయి నీటి మట్టానికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను రూపొందించి హెచ్ఎండీఏకు అందజేయాలని హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లకు సూచించారు. -
పేరుకుపోయిన ‘అద్దె'
- హెచ్ఎండీఏ వాణిజ్య భవనాలపై కమిషనర్ నజర్ - 12లోగా అద్దె బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ - గడువు ముగిశాక షాపుల సీజ్‌కు నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో: హెచ్ఎండీఏ వాణిజ్య సముదాయాల్లో అద్దె చెల్లించకుండా కొనసాగుతోన్న కిరాయిదారులపై కమిషనర్ శాలిని మిశ్రా కొరడా ఝుళిపించారు. ఈ నెల 12లోగా అద్దె బకాయిలు చెల్లించకపోతే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ హుకుం జారీ చేశారు. ఈ మేరకు అమీర్‌పేటలోని మైత్రివనం, మైత్రి విహార్, స్వర్ణజయంతి, ఆదర్శనగర్‌లోని హెర్మిటేజ్ బిల్డింగ్, తార్నాక కాంప్లెక్స్‌ల్లోని పలువురు లీజు దారులకు తాజాగా నోటీసులు అందాయి. నిర్దేశిత గడువులోగా అద్దె బకాయిలు హెచ్ఎండీఏ అకౌంట్‌కు జమచేయకుంటే ఆయా షాపులను సీజ్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. వారం రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ పీకలపై కత్తిపెట్టడంతో కిరాయిదారుల్లో కలవరం మొదలైంది. కొందరు తట్టాబుట్టా సర్దుకునేందుకు సిద్ధమయ్యారు. హెచ్ఎండీఏ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడంతో నెలవారీగా కమర్షియల్ కాంప్లెక్స్‌ల నుంచి వచ్చే అద్దెల ఆదాయంపై కమిషనర్ ఆరా తీశారు. నెలకు సుమారు రూ.1.5 కోట్లకుపైగా ఆదాయం రావాల్సి ఉండగా అందులో సగం కూడా వసూలు కావట్లేదని, ఇప్పటికే రూ.9 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయినట్లు తేలింది. దీంతో ఆగ్రహానికి గురైన కమిషనర్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆర్అండ్డీ సెక్షన్‌లోని సిబ్బందికి ఛార్జి మెమోలు జారీ చేశారు. హెచ్ఎండీఏ వద్ద ఉన్న డిపాజిట్ సొమ్ముకంటే వారు చెల్లించాల్సిన అద్దె బకాయిలే అదనంగా ఉండటంతో కమిషనర్ అధికారులపై కన్నెర్ర జేశారు. అయితే, కొందరు సిబ్బంది అద్దె బకాయిదారులతో కుమ్మక్కై నెలవారీగా మామూళ్లు పుచ్చుకొంటూ సంస్థ ఆదాయానికి గండికొట్టిన విషయం బహిరంగ రహస్యమే. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడంతో రూ.9 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లో గతంలో పార్కింగ్ లాట్ తీసుకొన్న ఓ వ్యక్తి హెచ్ఎండీఏకు లీజు మొత్తం చెల్లించకుండా దర్జాగా వ్యాపారం చేసుకొని తీరా వత్తిడి తేవడంతో ఉడాయించాడు. ఇందుకు ఓ అధికారి సహకరించాడన్న పుకార్లు అప్పట్లో దుమారం రేపాయి. అయితే, ఆ అధికారి పదవీవిరమణ చేయడంతో ఆయన హయాంలో జరిగిన అక్రమాలకు అధికారులు సమాధి కట్టేశారు. ఇలా పలువురు అధికారులు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వండంతో సంస్థకు అద్దె బకాయిలు భారీగా పెరిగిపోయాయి. వసూళ్లకు ప్రత్యేక బృందాలు.. అద్దె బకాయిల వసూలును సీరియస్‌గా తీసుకొన్న హెచ్ఎండీఏ కమిషనర్ ఇం దుకోసం ప్రత్యేక బృందాలను నియమించారు. ఒక తహశీల్దార్/ఏఓ, ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించి వారికి వసూలు బాధ్యతను అప్పగిం చారు. ఒక్కో కాంప్లెక్స్‌కు ఒక బృం దాన్ని నియమించి ఈనెల 12లోగా బకాయిలు మొత్తం వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అప్పటికీ స్పందించకపోతే గడువు తీరాక, ఆయా షాపులను సీజ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈమేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి బకాయిదారులపై వత్తిడి తెచ్చారు. గతంలో సకల జనుల సమ్మె సందర్భంగా 45 రోజుల పాటు తాము షాపులను మూసుకోవాల్సి వచ్చిందనీ, వ్యాపారాలు సాగకపోవడంతో అప్పట్లో అద్దె చెల్లించలేకపోయామే తప్పా ఎగ్గొట్టాలనే ఆలోచన తమకు లేదని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. ఒకేసారి కాకుండా రెండు మూడు వాయిదాల్లో అద్దె బకాయిలు చెల్లించే విధంగా తమకు వెసులుబాటు కల్పించాలని వారు కోరుతున్నారు, -
హెచ్ఎండీఏకు షాక్!
- అధికారాల కుదింపుపై సర్కార్ దృష్టి - కొత్త పరిశ్రమలకు ఇకపై నేరుగా అనుమతులు - సింగిల్ విండ్ విధానంపై ప్రభుత్వం కసరత్తు సాక్షి, సిటీబ్యూరో: అక్రమాల పుట్టగా అపకీర్తిని మూటగట్టుకున్న మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) అధికారాలకు కోత విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అక్రమార్కుల చర్యల వల్ల నగర శివార్లలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాకుండా పోతున్నాయని పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల హెచ్ఎండీఏ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్‌పై బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్త పరిశ్రమలను ప్రోత్సహించాలని, త్వరితగతిన అనుమతులిచ్చే విధానాన్ని అమల్లోకి తేవాలని ఆయన యోచిస్తున్నారు. వారం, పది రోజుల్లో అనుమతులిచ్చే విధానాన్ని అమల్లోకి తేవాలని ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు. కొత్త పరిశ్రమలకు సంబంధించి భూ వినియోగం, బిల్డింగ్ ప్లాన్లు, రోడ్లు తదితరాలకు అనుమతులిచ్చే అధికారాన్ని హెచ్ఎండీఏ నుంచి తప్పించి... పరిశ్రమల శాఖకు కట్టబెట్టాలని ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు వినికిడి. హెచ్ఎండీఏ అధికారాల కుదింపులో సాంకేతిక ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై ఉన్నత స్థాయిలో అధ్యయనం సాగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త వాటికి పరిశ్రమల శాఖ అనుమతులిస్తుంది గనుక భవనాల ప్లాన్లు, భూ వినియోగం వంటి వాటికీ ఆ శాఖే అనుమతులిస్తే కాలం, ఖర్చు కలిసి వస్తుందని అధికారుల యోచన. సమస్యలు ఎదురైన అక్కడే పరిష్కరించుకొనే అవకాశం ఉంటుందని వారి అభిప్రాయం. సింగిల్ విండో విధానం హెచ్ఎండీఏలో ఏ అనుమతి కావాలన్నా చేయి తడపనిదే ఫైల్ కదలదన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు సింగిల్ విండో విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అనుమతులిచ్చేందుకు నిర్దిష్ట గడువు నిర్దేశించి, పక్కాగా అమలుకు కసరత్తు చేస్తోంది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశ్రమల శాఖలోనే పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే సత్వరం అనుమతులు ఇవ్వాలనుకుంటోంది. దీని వల్ల పరిశ్రమల స్థాపన వేగవంతమై, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు చెబుతున్నారు. సాధ్యమేనా? హెచ్ఎండీఏ అధికారాలను కుదింపు అనుకున్నంత సులభం కాదన్న వాదన వినిపిస్తోంది. ‘హెచ్ఎండీఏ యాక్టు’ను సవరించకుండా అధికారాల కుదింపు, బదలాయింపు సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా హెచ్ఎండీఏ అనుమతి తప్పనిసరి చేస్తూ గతంలో చట్టం చేశారు. పరిశ్రమల జోన్లోనే కొత్త వాటికి అనుమతిచ్చేలా నిబంధన పెట్టారు. ఆ అధికారం పరిశ్రమల శాఖకు ఇచ్చినా... భూ వినియోగానికి ఆ ఫైల్ విధిగా హెచ్ఎండీఏకు వెళ్లాల్సిందే. లేదంటే ఎవరి ఇష్టమొచ్చిన చోట వారు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కాలుష్యం పెరిగి, ప్రజా జీవనమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తలుచుకొంటే చట్టాన్ని సవరించి అధికారాలను కుదించడం పెద్ద సమస్య కాదన్న మరో వాదన కూడా ఉంది. ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి. -
హెచ్ఎండీఏలో అనిశ్చితి
- వెంటాడుతున్న బదిలీ భయం - ఫైళ్ల కియరెన్స్కు కమిషనర్ విముఖత - అటకెక్కిన అనుమతుల జారీ సాక్షి, హైదరాబాద్: ‘మహా’ నగరాభివృద్ధి సంస్థలో ప్రస్తుతం అనిశ్చితి రాజ్యమేలుతోంది. కొత్త లేఅవుట్లు, భవనాలు, భూ వినియోగ మార్పిడికి సంబంధించిన ఫైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడమే ఇందుకు నిదర్శనం. హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్‌ను త్వరలో బదిలీ చేస్తారన్న సంకేతాలు రావడంతో ఆ ప్రభావం ఫైళ్ల క్లియరెన్స్‌పై పడిందని సిబ్బంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రొటీన్ ఫైళ్లు తప్ప వివిధ కొత్త పర్మిషన్లు, పాలసీ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ల ఆయా సెక్షన్లలోనే మగ్గుతుండటం ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది. ప్రత్యేకించి ప్లానింగ్ విభాగానికి చెందిన ఫైళ్లు తనకు పంపవద్దని ఇటీవల కమిషనర్ ఆదేశించడం కింది స్థాయి అధికారులను విస్మయానికి గురిచేసింది. స్వయంగా ఉన్నతాధికారి వద్దనడంతో కిందిస్థాయిలో ప్రాసెస్ జరిగిన ఫైళ్లు కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. 15 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఏం చేయాలో తెలియక కిందిస్థాయి అధికారులు తల పట్టుకొంటున్నారు. నగరాభివృద్ధిలో కీలక భూమిక పోషించే హెచ్ఎండీఏలో అవినీతి వేళ్లూనుకొందని, దీన్ని సంస్కరించేందుకు తొలుత కమిషనర్‌ను తప్పించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందన్న ఊహాగానాలు ఇప్పుడు హెచ్ఎండీఏలో జోరందుకొన్నాయి. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్న తరుణంలో దేనికి అనుమతి ఇచ్చినా... ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి ప్లానింగ్ ఫైళ్ల విషయంలో ఏదైనా పొరపాట్లు జరిగితే భవిష్యత్‌లో అవి మెడకు చుట్టుకొనే ప్రమాదం ఉండటంతో కమిషనర్ కావాలనే ఆ ఫైళ్లను పక్కకు పెట్టేశారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అయితే... కొందరు అధికారుల వాదన మరోలా ఉంది. నిత్యం సచివాలయంలో మీటింగ్‌లకు హాజరవుతున్న కారణంగా కమిషనర్ కొన్ని ఫైళ్లను చూడలేక పోతున్నారని, రొటీన్ ఫైళ్లు ఏరోజుకారోజు క్లియర్ అవుతున్నాయని చెబుతున్నారు. పడిపోయిన ఆదాయం... వివిధ అనుమతులకు సంబంధించిన ఫైళ్లు క్లియర్ కాకపోవడంతో ఫీజుల రూపంలో హెచ్ఎండీఏకు రావాల్సిన ఆదాయం గణనీయంగా పడిపోయింది. గతంలో తక్కువలో తక్కువ అంటే కొత్త లేఅవుట్స్ కోసం నెలకు 10-15 దరఖాస్తులు, నూతన భవనాల అనుమతులు కోరుతూ 25-30, భూ వినియోగ మార్పిడి కోరుతూ 5-10 దరఖాస్తులు హెచ్ఎండీఏకు వచ్చేవి. నిబంధనల మేరకున్న దరఖాస్తులను క్లియర్ చేసి అనుమతులిస్తే ఫీజుల రూపంలో నెలకు రూ.12-15 కోట్ల మేర ఆదాయం వచ్చేది. అయితే... ఇప్పుడు ఆ ఆదాయం రూ.2కోట్లకు పడిపోయింది. కొత్త దరఖాస్తులు రాకపోవడంతో పనిలేక ఖాళీగా కూర్చోవాల్సి వస్తోందని సిబ్బంది అంటున్నారు. నగరంలోని పార్కులు, కాంప్లెక్స్‌ల అద్దె, లీజ్‌ల రూపంలో నెలవారీగా వచ్చే రూ.12కోట్లు ఆదాయంతోనే హెచ్ఎండీఏ మనుగడ సాగిస్తోంది. ఈ తరుణంలో కీలక ఫైళ్లను పరిష్కరించకుండా పక్కన పెట్టేసి సంస్థను అనిశ్చితిలోకి నెట్టేసిన ఉన్నతాధికారుల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.