మనకూ హైటెక్ బస్టాండ్
‘ఐసీబీటీ’కి లైన్ క్లియర్
- మియాపూర్‌లో 50 ఎకరాల్లో అంతర్జాతీయ హంగులతో ఏర్పాటు
- ప్రయాణ సౌకర్యాలతో పాటు వినోదం, షాపింగ్
- సుప్రీం రీకాల్, అడ్వకేట్ జనరల్ గ్రీన్‌సిగ్నల్‌తో హెచ్‌ఎండీఏ పనుల్లో వేగం
సాక్షి, హైదరాబాద్: బాలారిష్టాలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ప్రతిష్టాత్మకమైన ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ ప్రాజెక్ట్ (ఐసీబీటీ) పనులు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. 2011లో ప్రారంభం కావల్సిన ఈ ప్రాజెక్టు పనులను దక్కించుకున్న కేఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా కంపెనీ ఇన్‌కమ్‌ట్యాక్స్ సమస్యలతో కొన్ని నెలలు ఆలస్యం కాగా, అంతలోనే ఐసీబీటీ ప్రాజెక్టు పనులు చేయాలనుకున్న మియాపూర్ విలేజ్ సర్వే నంబర్ 20 (పీ), 28లోని 55 ఎకరాల భూమి విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో మరింత ఆలస్యమైంది.
ఈ భూమిని అమ్మేందుకు వీల్లేదని, ఇప్పటికే భవనాలు కట్టామని మరికొంత మంది ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో అంతకుముందు అమ్ముకోవ చ్చంటూ సుప్రీం ఇచ్చిన ఆదేశాలను రీకాల్ చేసింది. దీంతో ఐసీబీటీ ప్రాజెక్టు పనులకు మార్గం సుగమమైంది. ‘మియాపూర్ సర్వే నంబర్ 20, 28 నిజాం కాలంలో జాగీర్‌లకు చెందినది. అయితే 1358 ఎఫ్ జాగీర్ రద్దు చట్టం ప్రకారం ఆ భూములు ప్రభుత్వానికి బదలాయింపు అయ్యాయి. జాగీర్ వారసులకు కమ్యూటేషన్ కూడా చెల్లించింది. మియాపూర్‌లో ఐసీబీటీ పనులు నిరభ్యంతరంగా చేపట్టవచ్చ’ని హెచ్‌ఎండీఏ రాసిన లేఖకు అడ్వొకేట్ జనరల్ సమాధానమిచ్చారు.
మియాపూరే ఎందుకంటే...
ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరానికి వందలాది ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. దీనికితోడు సిటీ బస్సులు కూడా వేలల్లో ట్రిప్పులు తిరుగుతుండటంతో నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికమయింది. ఎంజీబీఎస్‌లో రోజురోజుకు బస్సుల తాకిడి పెరిగిపోతుండటంతో... ప్రత్యామ్నాయంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సులు హాల్ట్ చేసేందుకు శివారు ప్రాంతంలోనే ఓ భారీ బస్టాండ్‌ను నిర్మించాలని 2011లో అప్పటి ప్రభుత్వం ఆలోచించింది. ఇందుకనుగుణంగా మియా పూర్‌లో 55 ఎకరాల విస్తీర్ణంలో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ ప్రాజెక్ట్ పనులను చేపట్టాలని నిర్ణయించింది. జాతీయ రహదారికి దగ్గర కావడం, అవుటర్ రింగ్ రోడ్డు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఏ ప్రాంతం నుంచైనా బస్సులు వచ్చివెళ్లే అవకాశం కలుగుతుంది. అలాగే... అక్కడి నుంచి ప్రయాణికులు నగరంలోకి వచ్చి వెళ్లేందుకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయన్న ఆలోచనతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.
షాపింగ్ చేయొచ్చు... సినిమా చూడొచ్చు
తమిళనాడులో 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఐసీబీటీని తలదన్నేలా దేశంలోనే నంబర్‌వన్‌గా మియాపూర్‌లో ఐసీబీటీని నిర్మించనున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులూ ఇక్కడ నిలపొచ్చు. వైద్యం నుంచి వినోదం వరకు అన్ని వసతులు కల్పించనున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు డార్మెటరీలు, వినోదం కోసం సినిమా థియేటర్ నిర్మించనున్నారు. ఫుడ్‌కోర్ట్స్, సెలూన్స్ ఏర్పాటు చేస్తారు. ఖాళీ సమయంలో షాపింగ్ చేసుకునేలా షాపింగ్ మాల్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు ఉండటంతో రూ.100 కోట్ల వ్యయంతో కేఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా కంపెనీ ఈ పనులు చేపడుతోంది.
సగం ట్రాఫిక్ తగ్గినట్టే...
ఐసీబీటీ అందు బాటులోకి వస్తే నగ రంలోకి వచ్చే దాదా పు వెయ్యి నుంచి రెండు వేల ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను నియంత్రించవచ్చు. తద్వారా బస్టాండులకు వెళ్లే ప్రయాణికుల వాహనాల రద్దీ కూడా నగరంలో తగ్గుతుంది. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ జామ్‌లు సగం వరకు తగ్గినట్టే అవుతుంది.
– టి.చిరంజీవులు, హెచ్‌ఎండీఏ కమిషనర్