హెచ్‌ఎండీఏలో అనిశ్చితి
- వెంటాడుతున్న బదిలీ భయం
- ఫైళ్ల కియరెన్స్‌కు కమిషనర్ విముఖత
- అటకెక్కిన అనుమతుల జారీ
సాక్షి, హైదరాబాద్: ‘మహా’ నగరాభివృద్ధి సంస్థలో ప్రస్తుతం అనిశ్చితి రాజ్యమేలుతోంది. కొత్త లేఅవుట్లు, భవనాలు, భూ వినియోగ మార్పిడికి సంబంధించిన ఫైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడమే ఇందుకు నిదర్శనం. హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్‌ను త్వరలో బదిలీ చేస్తారన్న సంకేతాలు రావడంతో ఆ ప్రభావం ఫైళ్ల క్లియరెన్స్‌పై పడిందని సిబ్బంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
రొటీన్ ఫైళ్లు తప్ప వివిధ కొత్త పర్మిషన్లు, పాలసీ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ల ఆయా సెక్షన్లలోనే మగ్గుతుండటం ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది. ప్రత్యేకించి ప్లానింగ్ విభాగానికి చెందిన ఫైళ్లు తనకు పంపవద్దని ఇటీవల కమిషనర్ ఆదేశించడం కింది స్థాయి అధికారులను విస్మయానికి గురిచేసింది. స్వయంగా ఉన్నతాధికారి వద్దనడంతో కిందిస్థాయిలో ప్రాసెస్ జరిగిన ఫైళ్లు కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
15 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఏం చేయాలో తెలియక కిందిస్థాయి అధికారులు తల పట్టుకొంటున్నారు. నగరాభివృద్ధిలో కీలక భూమిక పోషించే హెచ్‌ఎండీఏలో అవినీతి వేళ్లూనుకొందని, దీన్ని సంస్కరించేందుకు తొలుత కమిషనర్‌ను తప్పించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందన్న ఊహాగానాలు ఇప్పుడు హెచ్‌ఎండీఏలో జోరందుకొన్నాయి.
మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్న తరుణంలో దేనికి అనుమతి ఇచ్చినా... ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి ప్లానింగ్ ఫైళ్ల విషయంలో ఏదైనా పొరపాట్లు జరిగితే భవిష్యత్‌లో అవి మెడకు చుట్టుకొనే ప్రమాదం ఉండటంతో కమిషనర్ కావాలనే ఆ ఫైళ్లను పక్కకు పెట్టేశారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
అయితే... కొందరు అధికారుల వాదన మరోలా ఉంది. నిత్యం సచివాలయంలో మీటింగ్‌లకు హాజరవుతున్న కారణంగా కమిషనర్ కొన్ని ఫైళ్లను చూడలేక పోతున్నారని, రొటీన్ ఫైళ్లు ఏరోజుకారోజు క్లియర్ అవుతున్నాయని చెబుతున్నారు.
పడిపోయిన ఆదాయం...
వివిధ అనుమతులకు సంబంధించిన ఫైళ్లు క్లియర్ కాకపోవడంతో ఫీజుల రూపంలో హెచ్‌ఎండీఏకు రావాల్సిన ఆదాయం గణనీయంగా పడిపోయింది. గతంలో తక్కువలో తక్కువ అంటే కొత్త లేఅవుట్స్ కోసం నెలకు 10-15 దరఖాస్తులు, నూతన భవనాల అనుమతులు కోరుతూ 25-30, భూ వినియోగ మార్పిడి కోరుతూ 5-10 దరఖాస్తులు హెచ్‌ఎండీఏకు వచ్చేవి.
నిబంధనల మేరకున్న దరఖాస్తులను క్లియర్ చేసి అనుమతులిస్తే ఫీజుల రూపంలో నెలకు రూ.12-15 కోట్ల మేర ఆదాయం వచ్చేది. అయితే... ఇప్పుడు ఆ ఆదాయం రూ.2కోట్లకు పడిపోయింది. కొత్త దరఖాస్తులు రాకపోవడంతో పనిలేక ఖాళీగా కూర్చోవాల్సి వస్తోందని సిబ్బంది అంటున్నారు. నగరంలోని పార్కులు, కాంప్లెక్స్‌ల అద్దె, లీజ్‌ల రూపంలో నెలవారీగా వచ్చే రూ.12కోట్లు ఆదాయంతోనే హెచ్‌ఎండీఏ మనుగడ సాగిస్తోంది. ఈ తరుణంలో కీలక ఫైళ్లను పరిష్కరించకుండా పక్కన పెట్టేసి సంస్థను అనిశ్చితిలోకి నెట్టేసిన ఉన్నతాధికారుల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.