పొగాకు పంటకు డ్రిప్ సౌకర్యం | Tobacco crop drip Facility | Sakshi
Sakshi News home page

పొగాకు పంటకు డ్రిప్ సౌకర్యం

Published Sun, Oct 12 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

పొగాకు పంటకు డ్రిప్ సౌకర్యం

పొగాకు పంటకు డ్రిప్ సౌకర్యం

కొరిటెపాడు(గుంటూరు) :
 పొగాకు పంటకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీఇచ్చారు. స్థానిక రింగ్‌రోడ్డులోని సిద్ధార్థ గార్డెన్స్‌లో శనివారం టీటీఐఐ (ది టుబాకో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉత్తమ పొగాకు రైతు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి మంత్రి ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

     తొలుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమ, నిబంధనలు పాటిస్తూ పొగాకు పండిస్తున్న రైతులను మంత్రి అభినందించారు. పంటకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేస్తానని హామీఇచ్చారు.
     వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పొగాకు బోర్డు చైర్మన్ చురుగ్గా వ్యవహరించినప్పుడే రెతులు, వ్యాపారులకు మేలు జరుగుతుందన్నారు. పొగాకు ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి పొగాకు బోర్డు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు.
 
పంటల బీమా సౌకర్యం కల్పించాలి : ఎంపీ వైవీ
  ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ, పొగాకు సాగులో నూతన విధానాలను అవలంబించటానికి ఉత్తమ రైతులను ఎంపిక చేసి వారికి అవార్డులు ప్రదానం చేయటం అభినందనీయమన్నారు.

  మూడేళ్లుగా రైతులు వ్యవసాయంలో ఎంతో నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు బోర్డు పంటల బీమా సౌకర్యం కచ్చితంగా కల్పించాలని కోరారు.
  రాష్ట్రంలో పొగాకు సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం వుందన్నారు. పెట్టుబడులు పెరిగి సాగు ఖర్చులు అధికమయ్యాయని ఆయన చెబుతూ, అపరాధ రుసుం లేకుండా 50 క్వింటాళ్ల వరకు బోర్డు కొనుగోలు చేయాలని సూచించారు. కిలోకు సగటున రూ.150లు ధర కల్పించేలా చూడాలన్నారు.

  శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పంట పొలాలను సందర్శించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా అవార్డు పొందిన ఉత్తమ రైతులను ఎంపీ అభినందించారు.

 బోర్డుకు రైతులు, వ్యాపారులు రెండు కళ్లు : ఎంపీ రాయపాటి
  నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ పొగాకు బోర్డుకు రైతులు, వ్యాపారులు రెండు కళ్లులాంటివారన్నారు. భారత్‌లో సిగరెట్ అక్రమ అమ్మకాలు జరగకుండా చూడాలన్నారు. ధరలు తగ్గినప్పుడు బోర్డు కొనుగోలు చేసి బఫర్‌స్టాక్ పెట్టాలని సూచించారు.
  సిగరెట్లపై అధిక పన్నులు వేయటం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారు తప్ప తయారీదారులు నష్టపోవటం లేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు.

 మంచి ధర లభించేలా చూస్తా : చైర్మన్ డాక్టర్ గోపాల్
  పొగాకు బోర్డు ఛైర్మన్ డాక్టర్ కె.గోపాల్ మాట్లాడుతూ బోర్డు చట్టం ప్రకారం పంటకు మంచి ధర లభించేలా చూస్తామన్నారు.  100 రోజుల్లో వేలం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు మంచి ధర ఇవ్వలేక పోతే  విజయవంతం కాలేనట్లేనని తెలిపారు.

 మేలైన వంగడాలు అందించాలి :ఎమ్మెల్యే ముస్తఫా
  గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ సీటీఆర్‌ఐ నాణ్యమైన, అధిక దిగుబడులను ఇచ్చే విత్తనాలను తయారు చేసి రైతులకు అందించాలని సూచించారు.
  పొగాకు పంటకు గిట్టుబాటు ధర లభించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై వుం దన్నారు. పొగాకు రైతులతోపాటు వ్యాపారులకు ఇబ్బందులు తప్పటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

  ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ 60 శాతం పొగాకు ఒక్క ప్రకాశం జిల్లాలోనే పండుతుందని తెలిపారు. ఎకరా పండించటానికి రూ.1.20 లక్షల ఖర్చు అవుతుందన్నారు.
  శాసన మండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ పొగాకు బోర్డు, ఐటీసీ కలసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు.

  అనంతరం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉత్తమ పొగాకు రైతులకు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీటీఆర్‌ఐ డెరైక్టర్ దామోదరరెడ్డి, బోర్డు సభ్యుడు శేషగిరిరావు, ఐటీసీ ప్రతినిధి సంజీవ్ రంగరాజు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల  రైతులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement