బాధితులకు బాసటగా...
- పొగాకు రైతులకు అండగా జగన్
- రేపు జిల్లాలో పరామర్శ యాత్ర
- అత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఓదార్పు
- టంగుటూరు వేలం కేంద్రం ఎదుట ధర్నా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గిట్టుబాటు ధర లేక సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను పరామర్శించడంతోపాటు, పొగాకు రైతులకు అండగా నిలబడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి బుధవారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఉదయం 6 గంటలకు సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు చేరుకుంటారు.
అక్కడి నుంచి ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బయలుదేరి పొందలవారిపాలెంలో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించి అక్కడి నుంచి టంగుటూరు చేరుకుని వేలం కేంద్రం ఎదుట గిట్టుబాటు ధర కోసం రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొంటారు. ధర్నా అనంతరం జరుగుమిల్లి మండలం చింతలవారిపాలెం వెళ్లి వేలం కేంద్రంలోనే గుండెపోటుతో మృతి చెందిన మిడసల కొండలరావు కుటుంబాన్ని, వలివేటివారిపాలెం మండలం కొండసముద్రంలో ఆత్మహత్య చేసుకున్న నీలం వెంకట్రావు కుటుంబాలను పరామర్శిస్తారు. టంగుటూరులో నిర్వహించే ధర్నాలో పొగాకు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ట్రాక్ పై తీగలు - నిలిచిన రైళ్లు
కంభం : రైలు పట్టాలపై విద్యుత్తు తీగలు తెగిపడడంతో సోమవారం అర్ధరాత్రి వరకూ రైళ్లకు అంతరాయం ఏర్పడిన ఘటన కంభం మండలంలోని సైదాపురం సమీపంలో చోటుచేసుకుంది. తొలుత సాయంత్రం కొన్ని విద్యుత్ తీగలను అతికష్టం మీద పక్కకు లాగి గుంటూరు - డోన్ ప్యాసింజర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మళ్లీ మరో తీగ రాత్రి 7.30 గంటలకు పడడంతో కంభం రైల్వేస్టేషన్‌కు వచ్చిన కాచిగూడ - గుంటూరు ప్యాసింజరు రాత్రి 9.40 నిమిషాల వరకూ కదలలేకపోయింది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు రైల్వే అధికారులతో వాగ్వివాదానికి దిగారు. 9 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య నడిచే మచిలీపట్నం ఎక్స్ ప్రెస్, గుంటూరు -కాచిగూడ ప్యాసింజరు, అమరావతి, ప్రశాంతి, ఎక్స్‌ప్రెస్‌ల రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
రూ 27.11కోట్ల ముద్రా రుణాలు జిల్లా కలెక్టర్ సుజాతశర్మ వెల్లడి
ఒంగోలు టౌన్: ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద జిల్లాలో 10100 మందికి 27.11కోట్ల రూపాయల ముద్రా రుణాలు ఇవ్వనున్నట్టు కలెక్టర్ సుజాతశర్మ వెల్లడించారు. సోమవారం సాయంత్రం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ముద్రా రుణ మెగా క్యాంపు నిర్వహించారు. ఏపీఐఐసీ ద్వారా ఏకగవాక్ష విధానం అమలులో ఉందని, పరిశ్రమల కోసం కొత్తగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారికి విద్యుత్, పంచాయతీ, అగ్నిమాపక శాఖల నుంచి సకాలంలో అనుమతులు మంజూరు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
నిష్పక్షపాతంగా, నిజాయితీగా అమలు చేయాలని యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజుసూచించారు. ఎటువంటి గ్యారంటీ లేకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా రుణం పొందే సౌలభ్యం ఉండటం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ నరసింహారావు, సిండికేట్ బ్యాంకు డివిజనల్ మేనేజర్ రామ్మూర్తి, డీఆర్‌డీఏ పీడీ మురళి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ డాక్టర్ బీ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులు బ్యాంకు చెక్కులను అందజేశారు.